ప్రపంచనాటకదినోత్సవము

సూత్రధారుడతడు పాత్రధారులమమ్మ
అతడుచెప్పినటులనటన సేయ
అంకములెన్నియో యసలేమితెలియదు
నాటకమ్ముపేరేమొ జ్ఞప్తిలేదు
నటనేమిరానట్టి నాతోన నటియింప
పంతంబు పూనిన ప్రబలుడతడు
నాయకపాత్రయా నాయక మన్యుడో
ఏపాత్రయేమిటో యెరుక లేదు
రంగనాథునిసృష్టి రంగస్థలంబాయె
ఏపాత్రపరిధంతె యేరికెరుక
నటనసూత్రధారినాటకంబందున
పాత్రలెన్నిగలవొ ప్రముఖమౌనె
ఆడమన్నరీతియాడవలయునోయి
దర్శకత్వమతడె ద్రష్టయతడె
(రచన:---విద్వాన్ గొల్లాపిన్నినాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత