రథసప్తమి
ఉదయాస్త మానాల ఉనకి నిచ్చే సూర్యుణ్ణికీ (నేను సూర్యం బాబాయి అని యిష్టంగా పిల్చుకొంటా) సంబంధించిన పండగ నేడు.
సూర్యుణ్ణి మనమే కాదు విశ్వంలో చాలా దేశాలు స్మరించుకొన్నట్లు చరిత్ర చెబుతుంది. ఈజిప్షియన్ లు సూర్యుణ్ణి "రా' అని పూజించేవారట! జపనీయులు కూడా సూర్యోపాసన చేసేవారట.
భగవంతుడు ఎక్కడా వెదకనక్కరలేదు.తలెత్తి చూస్తే చాలు నేనున్నాని పలకరిస్తాడు. అందుకే "అసౌ ఆదిత్యో బ్రహ్మ" అని మనం సూర్యునికి దండం పెడుతుంటాము..అదిగదిగో ఆ ఆదిత్యుడే బ్రహ్మ. మనసు పులకరించే వేదమాత మనకు ఇచ్చింది.
నా విద్యార్థులకు అమ్మ నాన్న ఆదిత్యుడు మనకు కనిపించే దేవుళ్ళ రా! అని చెపుతుంటాను.
సూర్యుడు కేవలం వెలుగు వేడిమే కాదు సర్వం మనకు ఇస్తున్నాడు.అతడు లేకపోతే ఏమిలేదు.సర్వం శూన్యం.ఊహించలేము.ఆధునిక విజ్ఞానశాస్త్రమైన మన ఆధ్యాత్మ విద్య యైన.
సూర్యునకు ఉన్న ప్రతి పేరూ గొప్ప ఆర్థమిస్తుఃది.
అన్నిటికన్నా అందమైన పేరు "మిత్రుడు" మంచి సూర్యుడంటే ఆశ, ఉత్సాహము,సంతోషము ,ఒక భరోసా, నమ్మకము. రేపొకటి వుందని గురుతు చేసే ఆత్మీయత, నిరాశ వద్దని చెప్పె ఆశాకిరణం.మబ్బులు కమ్ముకున్నాయని క్రుంగి పోకు ,మబ్బులు చీల్చుకొని వెలుగు వస్తుందని ఓ దార్పు.
" మేము గొప్ప మాసామ్రాజ్యం గొప్ప, అందుకే మా రాజ్యం రవి అస్తమించని రాజ్యం " అని జాత్యాహంకారముతో విర్రవీగాడు ఆంగ్లేయాధికారి సర్దార్ వల్లభాయిపటేల్ తో.
అందుకు పటేల్ "అవును నిజం ! నేను
(ప్రకాశిస్తుండగానే ఇంత దోపిడీ చేశారు మీరు. నేను అస్తమించే ఇంకెంత దోపిడీ చేస్తారో? అని భయపడి అస్తమించడం మానేశి వుంటాడని చమత్కరించాడు.
ఉదయాద్రి పైనుంచి ఉదయించి పశ్చిమాద్రి చేరేవరకు అస్తమించని భానుడే బాసట.
బాల్యంలో అంజనీ సుతుడు సూర్యబింబాన్ని బాగా మ్రగ్గిన పండుగా భావించి సూర్యని మ్రింగడానికి ప్రయత్నించిన కథ మనకు తెలుసు. అటుతరువాత హనుమంతుని శిష్యునిగా స్వీకరించి నవవ్యాకరణ పండితునిగా తీర్చిదిద్దాడట సూర్యుడు. నేను నిరంతర సంచారిని నీకెట్లు చదువు నేర్పగలని అన్న సూర్యుని ఒప్పించి విద్యనేర్చుకొన్నాడట ఎలా? అంటే ఉదయాద్రిపై ఒక కాలూ,పశ్చిమాద్రిపై మరోకాలు వుంచి సూర్యగమనమనుసరించి తలను వుంచి విద్యనేర్చుకొన్నట్లు యైతిహ్యం
యాజ్ఞ వల్కునికి యజుర్వేదమును సూర్యడే నేర్పాడు. ఆవేదానికి శుక్లయజుర్వేదం అనే పేరొచ్చింది. విద్యా గురువు కూడా! ఆరోగ్య ప్రదాత మన ఆదిత్యుడు. "ఆరోగ్యం భాస్కరాదీఛ్ఛేత్" అని వుండనే వుంది. ఈ విషయం ఆధునిక వైద్య శాస్త్రం కూడా ముక్త కంఠంతో అంగీకరించినది. మన సంస్కృత కవి మయూరుడు తనకు శాపవశాత్తు సంక్రమించిన చర్మవ్యాధిని సూర్యశతకం వ్రాసి నయం చేసుకొన్నాడు.సంస్కృత సాహిత్యంలో మయూర శతకం అనర్ఘ్యమైన రచన స్రగ్ధరా వృత్తాలతో సాగుతుంది.
మన తెలుగు సాహిత్యంలో మారద వెంకయ్య భాస్కర శతకం సుప్రసిధ్ధం.అతని సూర్యభక్తిని గురించి వివరాలు తెలియవు.మరింకెందరో సూర్యభగవానుని భక్త కవులు వున్నారో!
సూర్యుని చూచికాని భోజనం చేయని నియమం వున్నవారిని మనం చూడవచ్చు. వర్ష రుతువులో సూర్యుని చూడడానికి ఎదురు చూస్తున్న విషయం ఆముక్త మాల్యదలో కృష్ణరాయలు అందంగా వర్ణించాడు."రవిజూచి కుడుచువారలకు కృకలాసములకు నింగిని దృష్టినిలిచె" అంటారు. సూర్యుని చూడని రోజును దుర్దిదనమని అంటారు. జ్యోతిశాస్త్రం ప్రకారం సూర్యుడు పితృకారకుడంటారు. అంటే మనకు సూర్యుడు తండ్రి.
సమస్త లోకాలకు చైతన్యాన్ని ప్రసాదిస్తున్న సూర్యుణ్ణి సూర్య నారాయణా అని భక్తితో పిలుచుకుంటాము. శ్లోకాలు మంత్రాలు జపాలు రాని జానపదులుకూడా ఉదయం తమ దైనందిన జీవితాన్ని సూర్యభగవానునికి దండం పెట్టె పనులు ప్రారంభిస్తారు. నమకం లో కూడా సూర్యుణ్ణి " అసౌ యో~ వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపా అదృశన్నదృశనుదహార్యః "అని 8 అనువాకంలో సూర్యరూపమైన శివుని వర్ణిస్తూ నల్లని మచ్చ కల కంఠం కలవాడు,(నీలగ్రీవో) ఎరుపు రంగు(విలోహితః) కలవాడైన పరమేశ్వరుడు సూర్యమండలం లో కనిపిస్తాడు.అతడు గగనాన సంచరిస్తున్న రుద్రరూపుడైన సూర్యుడే.అతణ్ణి గోపాలకులు నిత్యం వాడే చూస్తుంటారు.
సూర్యని రథముపేరు సత్యాస రథమట! సూర్యుని కాంతి ఏడు వర్ణాల కలయిక. ఆధునిక విజ్ఞానశాస్త్రం ఇదే భావాన్ని స్వీకరించింది. సూర్య రథం ఏడుగుర్రాలతో కూడియున్న ది. ఈ ఏడుగుర్రాలకు ఏడు పేర్లున్నాయి. వీటిని ఛందస్సులంటారు.1 గాయత్రి,2 త్రిష్టుప్,3,అనుష్టుప్,4, జగతి,5,పంక్తి.6, బృహతీ,7 ఉష్ణిక్, సంధ్యావందనాదికములలో గాయత్రి ఒకటి అనేది సుప్రసిద్ధము. వేదము ఛందోమయము.వేదం అంటే జ్ఞానమేషకదా,!
వేదాంగములలో ఛందస్సుతరువాత స్థానం జ్యోతిష్యమేకదా! సూర్యునికి జ్యోతిషానికి అవినాభావ సంబంధముంది. పగలు రాత్రులు రుతువులు,సంక్రమణాలు , మొదులైనవన్ని సూర్యుడు లేకుండా లేవు కదా!
సూర్యుని రథానికి ఇరుసుగా రాత్రింబవళ్ళు వున్నాయి. సూర్య రథచక్రానికి గల ఆరు ఆకులు ఆరు రుతవులకు సంకేతం.
ఒకే సూర్యుడు ద్వాదశాదిత్యుల రూపముతో ప్రతి నెలను ప్రభావితం చేస్తాడు. ద్వాదశాదిత్యుల వారి వివరాలు తెలుసుకొందాము,
1.ధాత:-చైత్ర మాసంలో వచ్చే సూర్యుని పేరు ధాత ధాత అంటే బ్రహ్మకదా! బ్రహ్మరూపంలో సకల ప్రాణులను సృష్టిస్తాడు.
2.అర్యముడు;-వైశాఖమాసంలో వచ్చే సూర్యుని పేరు అర్యముడు. ఇయర్తి గఛ్ఛతీతి అర్యమః అంటుంది అమరము నిత్యము గమనశీలము కలవాడని అర్థము.
3. మిత్రుడు:- జ్యేష్ట మాసంలో వచ్చే సూర్యుని పేరు మిత్రుడు. సూర్యునికున్న అందమైన పేర్లలో ముఖ్యమైన పేరు. మిత్రుడై సకలలోకాలకు మేలు చేస్తాడు.
4వరుణుడు:- ఆషాఢమాసంలో వచ్చే సూర్యుని పేరు వరుణుడు. ఆ పేరుతోనే వేసవి యెండల్లో గ్రీష్మ తాపానికి గురియైనా లోకానికి వర్షాధారలను సమృద్ధిగా కురిపించి స్వాంతనను అందజేస్తాడు.
5.ఇంద్రుడు:-- శ్రావణమాసంలో సూర్యుడు ఇంద్ర రూపంలో వుండి స్వర్గాధిపతియై లోకాలను దుష్టశక్తులనుండి కాపాడుతాడు.
6. వివస్వతుడు:--భాధ్రపదమాసంలో సూర్యుడు వివస్వతుడై ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకొనేలా చేస్తాడు.
7 .త్వష్ట:- సూర్యుడు ఆశ్వయుజంలో త్వష్ట గా ఓషధులు రూపంలో వుండి ,వృక్షాలను ఫలవంతం చేస్తాడు.
8.విష్ణవు,:-- సూర్యుడు కార్తీక మాసంలో విష్ణవై శత్రు సంహారం చేస్తాడు.
9అంశుమంతుడు:--మార్గశిరమాసంలో సూర్యుడు అంశుమంతుడై ప్రాణుల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు.
10.భగుడు:-పుష్యమాసంలో సూర్యుడు భగుని రూపంలో ప్రాణుల శరీరంలో వుండి వారిని పోషిస్తాడు.
11. పూషుడు:-మాఘమాసంలో సూర్యడు పూషుడై వుండి ప్రాణులకు ఆహారం ద్వారా పుష్టిని చేకూరుస్తాడు.
12. పర్జన్యుడు:- ఫాల్గుణ మాసంలో సూర్యుడు పర్జన్యుడై తన కిరణాలతో నీటిని గ్రహించి మేఘరూపంలో వర్షిస్తాడు.
ద్వాదశాదిత్యులు
హిందూ పురాణాలలో "అదితి" మరియు కశ్యపుని యొక్క 12 మంది పుత్రులను ద్వాదశాదిత్యులు అంటారు. సంవత్సరంలోని పన్నెండు నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యుల పేర్లతో వర్ణించారు:
మహాభాగవతం 12వ స్కంధం చివరిలో ద్వాదశాదిత్యుల వర్ణ ఉంది. ఒక్కొక్క నెలలో సూర్య భగవానుడు ఆయా ఆదిత్యుని నామంతో ఆరాధింపబడుతుంటాడు. ఆదిత్యుని వెంట ఆరుగురు పరిజనులు ఉంటారు. వాఱు కూడా మాసాన్ని బట్టి మారుతుంటారు.{,బ్రహ్మాండ పురాణంలో సూర్యరథంలో 12 గురు అనుసరిస్తారని విపులంగా వర్ణించబడివుంది}
ధాత - మాసం: చైత్రం - పరిజనులు: కృతస్థలి (అప్సరస), హేతి (రాక్షసుడు), వాసుకి (నాగువు), రథకృత్తు (యక్షుడు), పులస్త్యుడు (ఋషి), తుంబురుడు (గంధర్వుడు)
అర్యముడు - మాసం: వైశాఖం - పరిజనులు: పుంజికస్థలి (అప్సరస), పులహుడు (రాక్షసుడు), ఓజస్సు (నాగువు), ప్రహేతి (యక్షుడు), నారదుడు (ఋషి), కంజనీరుడు (గంధర్వుడు)
మిత్రుడు - మాసం: జ్యేష్ఠం - పరిజనులు: మేనక (అప్సరస), పౌరషేయుడు (రాక్షసుడు), తక్షకుడు (నాగువు), రథస్వనుడు (యక్షుడు), అత్రి (ఋషి, హాహా (గంధర్వుడు)
వరుణుడు - మాసం: ఆషాఢం - పరిజనులు: రంభ, శుక్రచిత్తు సహజన్యుడు, హూహూ, వసిష్ఠుడు, సృనుడు
ఇంద్రుడు - మాసం: శ్రావణం - పరిజనులు: విశ్వావసువు, శ్రోత, ఏలా పుత్రుడు, అంగిరసు, ప్రమ్లోచ, చర్యుడు
వివస్వంతుడు - మాసం: బాధ్రపదం - పరిజనులు: అనుమ్లోద, ఉగ్రసేనుడు, వ్యాఘ్రుడు, అసారణుడు, భృగువు, శంఖపాలుడు
అంశుమంతుడు - మాసం: మార్గశిరం - పరిజనులు: కశ్యపుడు, తార్క్ష్యుడు, ఋతసేన, ఊర్వశి, విద్యుచ్ఛత్ర, మహాశంఖులు
త్వష్ట - మాసం: ఆశ్వయుజం - పరిజనులు: జమదగ్ని, కంబళాశ్వుడు, తిలోత్తమ, బ్రహ్మపేతుడు, శతజిత్తు, ధృతరాష్ట్రుడు
విష్ణువు - మాసం: కార్తీకం - పరిజనులు: అశ్వతరుడు, రంభ, సూర్యవర్చుడు, సత్యజిత్తు, విశ్వామిత్రుడు, మఖాపేతుడు
భగుడు - మాసం: పుష్యం - పరిజనులు: స్ఫూర్జుడు, అరిష్టనేమి, ఊర్ణువు, ఆయువు, కర్కోటకుడు, పూర్వజిత్త
పూషుడు - మాసం: మాఘం - పరిజనులు: ధనుంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతావి, గౌతముడు
క్రతువు - మాసం: ఫాల్గుణం - పరిజనులు: వర్చుడు, భరద్వాజుడు, పర్జన్యుడు, సేనజిత్తు, విశ్వుడు, ఐరావతుడు
ఇంకా భాగవతంలో శౌనకుడు సూతునకిలా చెప్పాడు - ఈ పన్నెండుగురు ఆదిత్యులును విష్ణువుయొక్క సూర్యరూప విభూతులు. సూర్యుని వెంబడించేవారిలో ఋషులు వేదత్రయాన్ని చదువుతుంటారు. గంధర్వులు గానాన్ని చేస్తుంటారు. అప్సరసలు నాట్యం చేస్తుంటారు. నాగులు సూర్య రథాన్ని చుట్టుముట్టి ఉంటారు. యక్షులు రథయోజన చేస్తారు. రాక్షసులు రథాన్ని వెనుకనైపునుండి తోస్తుంటారు. వాలఖిల్యులనే పేరుగల బ్రహ్మర్షులు అరువదివేలమంది రథం ముందు నిలచి సూర్య భగవానునికి అభిముఖులై త్రయీమూర్తిని ప్రస్తుతిస్తుంటారు.
మహాభారతం, ఆదిపర్వంలోని శ్లోకాలలో (65-15,16) చెప్పబడిన పేర్లు:
ధాతా మిత్రః ఆర్యమా శక్రో
వరుణ స్త్వంశ ఏవచ
భగో వివస్వాన్ పూషా చ,
సవితా దశమస్తథా
ఏకాదశస్తథా త్వష్టా,
ద్వాదశో విష్ణురుచ్యతే
జఘన్యజస్తు సర్వేషా
మాదిత్యానా గుణాధికః
(ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణువు)
"ఆదిత్యానామహం విష్ణుః" - ఆదిత్యులలో నేను విష్ణువును - అని భగవద్గీతలో (10-21) చెప్పబడింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి