మాల దాసరి కథ-1 మొదటి బాగం
--మాలదాసరి కథ(మొదటి భాగం)
కథఎత్తుగడలోనే కొత్తదనం వుంది ."కలడొకరుండు"-మామూలగా అనగ అనగ ఒకరాజ్యం, లేక రాజు అంటూవుంటాము.అలా కాక అతడొకడున్నోడోయి తో కథ మొదులెట్టెసాడు కృష్ణరాయాలు. ఆ కలడనేవాడెవుడు,? కథేమిటీ ? కమామీషేమిటి? అనే అనుమానం పాఠకుడికి సహజంగా వస్తుంది. అతడొక మాలదాసరీ.ఆ కాలంలో పేరుకొనగరాని కులము. సగటు బడుగు బలహీన వర్గాల ప్రతినిధి. సమాజంలో అతని స్థానమేదైనా ,
కానీ అతడు మహోన్నత వ్యక్తిత్వాన్ని సాక్షాత్తు శ్రీమహావిష్ణువే నిత్యానపాయని యైన మహాలక్ష్మీదేవికి వివరిస్తూ మదీయ భక్తుడు అని గొప్పగా చెపుతాడు."శ్వపోచపి మహిపాల! విష్ణుభక్తో ద్విజాధికః" అని అతని గొన్పదనాన్ని మెచ్చుకొంటాడు.
అతడిగురించి మహావిష్ణవే వర్ణించాడంటే అతని గొప్పదనం తప్పక తెలుసుకోవలసిందే
ఆ కథా యిలా మొదులవుతుంది.
ఆమాలదాసరి తనజాతికి తగిన జీవనవిధానాన్ని ఎంచుకొని నిష్టంగా ఆచరిస్తున్నాడు.తన అంతరంగం కలుషితం కాకుండా తిరుక్కురంగడిలోవెలసిన వామనావతార మూర్తిగా వెలసిన నన్ను ధ్యానిస్తుండేవాడు. అతడు మసిగుడ్డలో దాగున్న మాణిక్యంలా ప్రకాశిస్తున్నాడు."అని శ్రీమహావిష్ణువు అనుగ్రహానికి పాత్రుడయ్యాడు.
ఇక సూరియాళవైష్ణవుని రాయల ఇలా వర్ణిస్తున్నాడు.
నూనె మరకలతో నిండిన తోలు చొక్కాను ధరించేవాడు. చిన్నవైన ఇత్తడి శంఖచక్రాలను కమ్మలుగా ధరించేవాడు. దీపాలు వెలిగించె దివేదారు కొమ్ము స్తంభాన్ని ఒక చేతితో మోస్తూ,తాళం వేసె చిరుతలను మరోచేత్తో మోస్తూ భిక్షాటన చేసేవాడు.( నేను ఇటువంటి మాలదాసరులను బాల్యంలో ప్రత్యక్షం గా చూచాను). అతడి భుజానికి ఒక తోలు సంచి వేళాడుతూ వుండేది. బాణం వంటి ఆయుధమొకటి ఆయన వద్ద వుండేది. మొగలిబోదెలతో చేసిన గొడుగు మరో భుజాన వేలాడుతూ వుండేది. విష్ణు పాదములు కలిగిన ఇత్తడి బిళ్ళ మెడలో వేలాడుతూ వుండేది.
గుర్రపు వెంట్రుకలతో కుట్టిన సొర్రకాయ బుర్ర అతని వద్ద వుండేది.అతని నడక వేగా
న్ని బట్టి చిట్టితాళాలు ఒకదానికొకటి తగిలి శబ్దాలు చేస్తుండేవి. మెడలో తులసి మాల. ఒళ్ళంతా దుమ్ము. నుదిటిపై తిరునామాలు ప్రకాసిస్తుండేవి.బాగా పసుపు పట్టించిన తోలు బట్ట ఉత్తరీయంగా పైన కప్పుకొనేవాడు.
ఇతరులేమైనా అంటారేమోననీ బెదురు చూపులు చూస్తూ, వేగంగా అడుగులు వేస్తూ పెరుమాళ్ళను సేవించుకోవడానికి ఆలయానికి
వచ్చేవాడు.
ఆలయ సమీపానికి వచ్చిన తరువాత తన బరువులన్నీతీసి ప్రక్కన బెట్టేవాడు . భక్తితో పులకించిన మనసుతో శ్రీమహావిష్ణువును కీర్తిస్తూ గానంచేసేవాడు. ఆ గానం భగవంతుని హృదయాన్ని కూడా కరిగించేట్లు వుందని చెప్పడం అతిశయోక్తి ఏ మాత్రంకాదు. అలా గానం చేసే సమయంలో భక్తి తన్మయతతో కన్నీరొలికి చెక్కిళ్ళపై బడి ధారలుగా కారేవి.
ఎండ ,ఆకలి, గాలి మొదులైనవి ఏవి పట్టించుకోకుండా ,ఎండ నడినెత్తిన మలమాడుస్తున్నా లెక్క చేసెవాడు కాడు.
అతని భక్తి రసాత్మకమైన గాన మాధుర్యానికి రాళ్ళుకూడా కరిగిపోతాయేమోనని పించేది.సొర్రకాయ బుర్రను మీటుతో పాడుతూ నృత్యం చేసేవాడు.
(రాయలు "పసి" (,ఆకలి) అనే తమిళ పదం వాడటం గమనించ వచ్చు)
విష్ణభక్తుడు వేకువజామునుంచి మధ్యాహ్నం దాకా భజనానందంలో మునిగి తేలేవాడు.
కీర్తనాదికములు ముగించి పెరుమాళ్ళకు సాష్టంగ ప్రణామాలు సభక్తింగా తన్మయతతో ఆచరించే వాడు.
గర్భాలయపు కలకజలము రాతొట్టిలో నిండి కాలువలుగా కారుతున్న సమయంలో ఆ జలమును శూద్రుడివ్వగా సభక్తికంగా స్వీకరించేవాడు. భాగవతోత్తములైన అగ్రజాతివారొస్తుంటే వినయంగా ప్రక్కన తప్పుకొనేవాడు. ఎండవిపరీతంగా కాస్తున్నా వడగాలి రివ్వున వీస్తున్నా ,వేచిచూచి ఆలయపుటుద్యోగి దూరంగా జాలితో దయతో అందిస్తున్న తీర్థ ప్రసాదాలను మహా ప్రసాదంగా స్వీకరించేవాడు మిక్కిలి తృప్తితో.
ఈరకంగా పరమభాగవతోత్తముడైన విష్ణభక్తుడు అకించిన భావముతో, పరమార్తితో సకలజనులు ఆశ్చర్య పడేట్లుగా భక్తితో ప్రదక్షిణలు చేసేవాడు. ఇలా భగవత్సేవా కైంకర్యమును ముగించుకొని తన గ్రామానికి చేరుకొనేవాడు. ఇలా కాలం గడుస్తుంది అయినా కాలం ఒకే రీతిగా సాగదుకదా!
ఆరోజు రానే వచ్చింది.కాదు కాదు అది అర్ధరాత్రి లా వచ్చింది.
ప్రతిరోజు రాత్రి లానే మన మాలదాసరి నడం వాల్చాడు.మాగన్నుగా నిద్ర పట్టింది. హఠాత్తుగా కోళ్ళలన్ని ఒక పెట్టున కూయసాగాయి.కారణం కోళ్ళ గూటిలో పిల్లి ఒకటి ఆహారార్థము జొరబడింది. ఈ అల్లరి తెలియని మనదాసరి వేకువ జామైనది.పెరుమాళ్ళ సేవకు వెళ్ళాలనుకొన్నాడు.
అనుకొని నిత్యకృత్యాలు తీర్చుకు బయలుదేరాడు.
అది నిశిరాత్రి.కారుచీకట్లు అంతటా అలుముకొని కళ్ళుపొడుచుకుచూచినా ఏమి కనపడని కాళరాత్రి. ఓ అని అరిస్తే ఓ అని బదులు పలికేట్లుగా వున్నాయని రాయలు ఆ రాత్రిని వర్ణించాడు.
దారిలో మరులుతీగను మన మాలదాసరి త్రొక్కడం జరిగింది. తిరిగినచోటె తిరిగె ఒక లాంటి మానసిక విభ్రాంతిని కలిగించడం ఆ మరలు తీగ లక్షణం.(కొన్ని మొక్కలకు వృక్షాలకు కొన్ని అతీత శక్తులుంటాయి.వాటిని ఓషధులంటారు).
అందువల్ల అతడు ఆచీకటిలోతిరిగి తిరిగి తూర్పు తెలవారుతుండగా దట్టమైన అడవిలో ప్రవేశించాడు.
ఆ నిర్జనారణ్యం ఒక్కప్పుడు బాగా బ్రతికిన జనపదమే.కాని కాలక్రమేణా కొన్ని అనివార్య పరిస్థితులవల్ల ఆ గ్రామం కాస్తా నిర్మానుష్యమై అడవిని తలపిస్తుంది. ఆ గ్రామం అలా ఎందుకు అఘోరించిందో ముందు ముందు మీకే తెలుస్తుంది.
ఆ దారి ప్రక్కనంతా కూలిపోయిన యిళ్ళ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. పొట్రేను, ఉత్తరేణి కసింద,కోరింద వంటి ముళ్ళమొక్కలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. కూలిన ధాన్యపుగాదెలు కన్నాలు పడి బొరియల్లో ఎలుకలు నివసిస్తున్నాయి. ఈ బొరియల చుట్టూ చిగిరింత గడ్డిమొలిచింది. చీమలు ధాన్యపు గింజలు లాక్కెళ్ళుతున్నప్పుడు జారిపోయిన ధాన్యపు గింజలు మొలకలు వేసి, పెరిగి,కంకులు వేసి ఎండిపోయాయి.
ఆ పక్కగా వున్న పెంట దిబ్బల పైన డొక్కలు పిక్కోపోయిన ముసలి పిల్లులు మీసాలు కూడా కదల్చలేక నీరసించి పోయాయట. వరిచేలలో ఉత్తగడ్డి కలుపు మొక్కలు మొలిచాయి. పొలాల్లో నిట్రాలు మాత్రం మేమున్నమనట్లు నిలుచున్నాయి. ఎతాము బావులన్ని(పొలాలకు నీళ్ళుతోడడానికి ఉపయోగించి బావులు) కూలిపోయాయి.
ఆ దారిలోనే విష్ణుభక్తుడు నడుస్తున్నాడు.
(ఈ పద్యం కృష్ణరాయల పరిశీలనా దృష్టికి చక్కని నిదర్శనం).
అలా దారితప్పిన మార్గంలో నడుస్తుంటే కాళ్ళకు ఉత్తరేణి వంటి ముళ్ళు ఇరుక్కొన్నాయి. అవిరాపాడిస్తూ గీచుకొంటున్నాయి. పల్లేరుకాయలు అరికాళ్ళలో గుచ్చుకొని బాధపెడుతున్నాయి. విష్ణభక్తుడు వాటిని నేర్పుగా తొలగిస్తూ ముందుకు నడుస్తున్నాడు.
అలా నడుస్తూ ముందుకు వెడుతున్న విష్ణభక్తునకు అల్లంత దూరంలో అర్ధయోజనం( 4 మైళ్ళ ) విస్తరించిన మర్రిచెట్టును చూచాడు. ఆ మర్రిచెట్టు ఊడలు శాఖోపశాఖలుగా విస్తరించి వుంది. ఆ మర్రి చెట్టును తాకి గాలి సుడలు సుడులు గా తిరుగుతుంది. ఆగాలి వేగానికి ఆ చెట్ల ఆకులు అల్లంత దూరం వరకు ఎగిరి పోతున్నాయి. పురుగులు కొట్టగా ఏర్పడిన రంధ్రాలు ఆ ఆకులపై వ్రాసిన అక్షరాల్లా కనిపిస్తూ ఎదో హెచ్చరికను అందజేస్తున్నాయా అన్నట్లువుంది.
"నా పై బ్రహ్మ రాక్షసుడు నివసిస్తున్నాడు. ఇటువైపు ఎవరూ రాకండి" అన్నట్లు జాగ్రత్తలు చెప్పినట్లుగా వున్నాయి. అటువంటి హెచ్చరికను జారిచేసి నందు వల్ల కావచ్చు, అక్కడ జనసంచారం బొత్తగాలేదు.ఈ విధంగా బ్రహ్మరాక్షసుని బారినుండి మానవులను కాపాడిన పుణ్యం మూటకట్టుకుందా అన్నట్లు ఆ చెట్టు పెద్ద పెద్ద పండ్లతో నిఃడివుంది.ఆ విశాలమైన చెట్టు చూడడానికి చూడడానికి గంభీరంగా వుంది.(కృష్ణరాయలు ఈ భయంకరమైన ప్రదేశాన్ని వర్ణించడానికి శార్దుల విక్రీడితాన్ని స్వీకరించి జటిలమైన సమాసభూయిష్టంగా వర్ణించాడు)
ఆ విష్ణభక్తునకు ఒక కాలిబాట కనిపించిఃది. ఆ దారి కనీపించడమేఅదృష్టంగా భావించి తన నడకను కొనసాగించాడు.
అక్కడ ప్రదేశం మిక్కిలి భీభత్సం గావుంది.
కొబ్బరి బొండాలను జుర్రేసి పారేసినట్లుగా ఎండిపోయిన మానవ కంకాళాలు కనిపిస్తున్నాయి. గోళ్ళతో రక్కి రక్కి గీరిగీరి మాంసాన్ని తిన్నట్లుగా పచ్చిగా వున్న ఎముకలగుట్టలు కనిపిస్తున్నాయి.
అక్కడ ముళ్ళచెట్ల కంపలకు మానవ చర్మాలు వేలాడుతున్నాయి.వాటిపై ఈగలు ఝమ్మని మూగుతూ ఎగురుతూ వుండడంవల్ల అవతలవైపు ఏముందో కనిపించడం లేదు. మనూషుల జుట్టు మంగళ్ళు కత్తిరించి కుప్పలుగా పడేసినట్లు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. గాలి వాటుకు ఆ వెంట్రకలు ఎగిరి నానాకంగాలి చేస్తున్నాయి. మిగిలిన మానవశరీరావయవలాకోసం కొన్ని కాట్ల కుక్కులు కాట్లాడుకుంటున్నాయి.
ఆ కుక్కల కాళ్ళక్రింద పడీనలూగూతున్న ఎండుమాంసపుముక్కలనుంచి దుర్వాసన భరించరానంతగా వుంది. మరోదారి లేక మన విష్ణు భక్తుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తు మర్రిచెట్టు వద్దకు వచ్చాడు.
ఆ మర్రి చెట్టు క్రింద ముందరికాళ్ళను ముందుకు సాచి అక్కడున్న ఎముకలను ఎత్తుకు పోవడానికై ఆడకుక్కలు దొంగచూపులు తో వేచిచూస్తున్నాయి.అదును చూచి వాటిని పట్టుకొని పారిపోతున్నాయి. అక్కడ ఇంతకు ముందు గ్రద్దలు తినగా మిగిలిపోయి మాంసపుతోరణాల్లా వేలాడుతున్నాయి.వాటిని కరుచుకొని ఒక్క ఉదుటన ఎగిరిపోతున్నాయి.ఆ సమయంలో వేగంగా కొమ్మలు వెనుకకు తగిలడం వల్ల ఆదెబ్బలకు పక్షిజాతులు నానా గోలా చేస్తున్నాయి. ఒక కొమ్మ మీదనుంచి మరోకొమ్మ మీదకు దూకుతూ కోతులు దెబ్బలు తింటున్నాయి. ఆ దెబ్బలు భరించలేక అవి వాటి నడుమును రెండుచేతులతో పట్టుకొని గట్టిగా బాధతో ఏడుస్తున్నాయి. ఆ చెట్టును చూస్తున్నప్పుడు కొన్ని దృశ్యాలు కనిపిస్తు అంతలోనే మాయమౌతున్నాయి. వీటన్నటినీ గమనించిన విష్ణుభక్తుడు ,ఈ చెట్ఠు పై ఎవడో వున్నాడు , వాడు కట్టెలు కొట్టే వాడులా అనిపించడం లేదు. ఐనా అలాంటి వారు ఇలాంటిళచోటికి వచ్చే సమయమా? కాదు అంటు తనలో తాను ఇలా వితర్కించుకొంటున్నాడు. ఒక ప్రక్క కుళ్ళిన మాంసపు దుర్గంధం వస్తున్నది. నేను ఇంకా చాలా దూరం పోవాలి అని తనలో తర్కించుకొంటున్పాడు.
ఇంత వరకు మనం కథలోని కథా నాయుకునే చూచాము.ఇక ముందు ప్రతినాయకుని ప్రతాపాలు చూద్దాము.
అతని కృష్ణరాయలు ఎలా ఆవిష్కరిస్తున్నాడో
అని చూద్దామని అందరికీ ఆసక్తి వుంటుంది.
మన ప్రతినాయకుడు కుంభ జానుడనే బ్రహ్మరాక్షసుడు. ఇతడు సార్థకనాముడు .ఇతని జానువులు అంటే మోకాళ్ళు కుంభాల్లా (,పెద్ద కడవల్లా) వుంటాయి. అందుకే ఇతనికాపేరు అతకినట్లు సరిపోయింది. అర్ధ యోజనం వరకు వ్యాపించిన వట వృక్షం ఇతని నివాసం అని మర్రాకులు చెప్పకనే చెప్పి పుణ్యం మూటకట్టుకొన్నది.
ఇతడు ఎంత దీర్ఘకాయుడంటే మానవ మృతదేహాన్ని కౌపీనం గా ధరించాడు. కానీ ఆచనిపోయిన వాని దేహం గోచికి కురచైపోయింది. దాన్ని లాగి లాగి దోపుకున్నందువల్ల రక్తపుమరకలు రాక్షసుని పొట్టపై కనిపిస్తున్నాయి. ఆ రాక్షసుడు గడ్డితో బాగా పేనిన దానిని మొలత్రాడుగా ధరించాడు. వాడి శరీరం నిండా ఎర్రని వెంట్రుకలున్నాయి. శరీరం కాస్తా ఎర్రచీమలు వంకలుగా దిరిగిన నల్ల జీడిమామిడి చెట్టులా ప్రకాశిస్తుంది. తలక్రిందుగానున్న ఏనుగుతలలాగా వాడి గడ్డం దంతాలతో ముఖం మిక్కిలి భయంకరంగా వుంది.
కందిరీగల గూడులా ఉన్న వాడి ఎర్రనిగడ్డంనుంచి నిరంతరం చొంగ కారుతూ వుండడంవల్ల మట్టికొట్టుకుపోయి కాష్టం(నల్ల) రంగులోకి మారింది.తిండికోసం ఆ మర్రిచెట్టుఎక్కిదిగడంవల్ల మెడలో వేసికున్న పేగులు జారిపోతున్నాయి. చిరాకుతో తనలో తాను కసురుకుంటూ మళ్ళీ సరిజేసుకొంటు చెట్టు ఎక్కుతున్నాడు. అతడి పొట్ట జారిపోతుంది. పైగా అతని కాళ్ళు బూర( సన్నని ఊచ) కాళ్ళాయే. ఇక తల అంటావా అదేదో చిన్న చెంబులా వుంది. తలా మెడ కలసిన గుంట భాగంలో వెంట్రుకలు వొత్తుగా వున్నాయి.
ఆ రాక్షసుడి కండ్లచుట్టూ కండలు బాగా పెరగడంవల్ల కళ్ళు బాగా కనిపించడం లేదు.
ఆకలి బాగా మండిపోతుందేమో! ఆడరాకాసులను పదేపదే బండతిట్లుతిడుతున్నాడు.( రాకాసి జన్మ యెత్తిన ఈ చాకిరి తప్పలేదని అవి అనుకొంటున్నాయేమో? పాపం) చూడడానికి మన బ్రహ్మ రాక్షసుడు కొండలా వున్నాడు.
చెట్ఝు క్రింద చేరిన మాలదాసరిని చూడగానే తనకు ఆహారం దొరికిందని సంతోషంతో కాబోలు దభీమని క్రిందకు దూకాడు రాక్షసుడు .ఆ దూకిన వేగానికి అక్కడున్న చెట్లన్ని నుగ్గావుతాయేమోనని అనిపించింది.
ఆత్మరక్షణ అవశ్యం కర్తవ్యం కాబట్టి మన దాసరి పోరాటానికే సిధ్ధ పడ్డాడు.
మానవులకు రాత్రైనా పగలైనా బలం సమానం.రాక్షసులకు రాత్రి మాత్రమే బలం.ఇంతకు ముందు మనదాసరి భధ్రంగా దాచిన బాణం లాంటి ఆయుధంతో పోరాడాడు. రాక్షసుడు దాన్ని ముక్కలుగా కొట్టాడు. ఇలా రాక్షసునితో తన శక్తివంచన లేకుండా తలపడ్డాడు. రాక్షసుని బలం క్రమంగా పెరిగింది.
ఇది పనికాదని తప్పించుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎట్లాగో రాక్షసుని ఏమార్చి తప్పించుకుని పోయాడు.అలా తప్పించుకుపోవడం సహించలేని రాక్షసుడు ఉక్రోషంతో రాక్షసస్త్రీలను పిలిచి అతడిని పట్టుకోమని ఆజ్ఞాపించాడు. వారందరూ అతడిని పట్టి బంధించి చెట్టుక్రిందకు తెచ్చారు.
ఇలా బంధింపబడిన మాలదాసరితో బ్రహ్మరాక్షసుడు ."నన్ను చాలా శ్రమపెట్టావు.దీనికి శిక్షగా నా పంచ ప్రాణాలు సంతృప్తి చెంది.అబ్బా! యికచాలు. అనుకొనేంతవరకు నీ వెచ్చని రక్తాన్ని త్రాగతాను. నీతలను కత్తితో నరికి ఉబికి వచ్చే రక్తాన్ని జుర్రుకొంటాను. నాదాసిజనం
నీ మాంసాన్ని కండలను ముక్కలు ముక్కలు ముక్కలుగా నరికి బాగా కాల్చి కరకుట్లుగా నాకందిస్తుంటే వాటిని నీకపాలములో జారుతున్న కల్లుతో కలుపుకు తింటాను.
నువు దుష్టుడవు,నన్ను బాగా అలసిపోయేట్లు చేశావు.నీన్ను అంత తేలిగ్గా చంపుతానా? అనికోపంతో బుసకొట్టాడు బ్రహ్మరాక్షసుడు.కోపం మితిమీరిపోవడం కావచ్ఛు మాటలు స్పష్టంగా లేక తడబడుతున్నాయి.
ఇతడిని నరకిముక్కలు చేయడానికి కత్తిని పాత్రను తెమ్మని రాక్షస స్త్రీలను అజ్ఞపించాడు.కాళ్ళూ చేతులు బంధించి జంతువులను క్రిందపడవేసేదానికి ఉపయోగించే కోలకొక్కెరను తెచ్చిదానితో బంధించి బలంగా క్రిందికి తోశాడు.
అప్పుడా విష్ణుభక్తుడు క్రిందపడినప్పటికీ ధైర్యం కోల్పోక ఆ బ్రహ్మ రాక్షసునితో ఇలా అంటున్నాడు.
------------- ఇక్కడనుంచి విష్ణుభక్తుడు బ్రహ్మరాక్షస సంవాదం మొదులవుతుంది.
ఇందులో పలు అధ్యాత్మిక విషయాలు చర్చకు వస్తాయి.----
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి