కాళీయమర్దనము

&&&&భాగవత మకరందాలు&&&&&
ఆంధ్రమహా భాగవతము తెలుగువారి నోములు పంట.అందులోని ప్రతిపద్యమూ,ఆనందామృతములోనుంచి ముంచి తీసిన యమృత ఫలము.పోతనామాత్యడు తనఘంటమును భక్తి సుధారసములో ముంచి రచించినట్లుగా ఈ పద్యము అలరారుతుంది.
ఈ పద్యరత్నము ఆంధ్రమహాభాగవతములోని ద్వితీయస్కంధములో నున్న అనర్ఘ్యపద్యరత్నము.
సీ||సాంద్రశరచ్చంద్ర చంద్రికా ధవలిత విమల బృందావన వీధియందు
రాసకేళీ సముల్లాసుడై యుత్ఫల్ల జలజాక్షుడొకనిశాసమయమున
దనరారుమంద్ర మాధ్యమం తారముల
నింపుదళకొత్త రాగబేధముల దనరి
దైవతం ఋషభ గాంధార నిషాద పంచమ షజ్జ మాధ్యమం స్వరములోలి
తే.గీ.గళలుజాతులు మూర్చనల్ గలుగ వేణు
నాళవివరాంగుళీ న్యాస లాలనమున
మహితగతిబాడె నవ్యక్త మధురముగను
పంకజాక్షుండుదారువులంకురింప
పద్యభావము:---
శరదృతువులోని  పౌర్ణమి రాత్రి,చంద్రకిరణాలుబృందావనమునందు వెల్లివిరుస్తుండగా, అరవిందదళాక్షుడు మిక్కిలి ఉల్లాసముతో రాసకేళిని కావిస్తూ,తన సుకుమార సుందరహస్తములతో వేణువుపై గల రంద్రములను మూస్తూ,తెరుస్తూ,మంద్రమధ్యమ తారకములతో దైవతం,ఋషభ,గాంధార,నిషాద, పంచమషజ్జస్వరములతో ,కళ్లు,జాతులు,మూర్ఛనలు కలుగజేస్తూ అవ్యక్తమధురముగా గానం చేస్తుంటే ఎండిన మ్రానులు చిగురించాయి.
వ్యాఖ్య:--అలంకారికులు "సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం 
ఏకమాపాత మధురం అన్యదాలోచినామృతం"(సంగీత సాహిత్యాలను సరస్వతీదేవి స్తనద్వయాలుగా పేర్కొంటారు).
బమ్మెరపోతన్నకు సంగీత సాహిత్యములో లోనున్న అభినివేశానికి ఈ పద్యం చక్కని నిదర్శనము.ఎంతైనా పోతన సహజపండితుడుకదా!
"శిశుర్వేత్తి,పశుర్వేత్తి రసంగానఫణిః"అన్న ఆర్యోక్తిని మీరు వినే వుంటారు.ఇది ఒక అర్థము.శిశువు అంటే కుమారస్వామీ,పశువు అనగా నందీశ్వరుడు ఫణి అనగా ఆదిశేషుడు అని కొందరు పెద్దల మనసులో మాట.
సామాన్య సంగీతజ్ఞుల సంగీతానికే సమ్మోహన శక్తి వున్నప్పుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన ఆ వేణుగానలోలుని గానమహిమను ఎవరు వర్ణింపగలరూ, ఎంతని వర్ణింపగలరు.
"సంగీతజ్ఞానము భక్తి వినాసన్మార్గము కలదే ఓమనసా!"అన్నారు వాగ్గేయకారులైన  త్యాగరాజస్వామి.
భక్తుని భగవంతుని వద్దకు చేర్చడానికి ఉపయోగపడే చాలాదగ్గరి దారి సంగీతము.ఎందుకంటే అది ఆపాతమధురము.ఇక సాహిత్యమంటావా అదే ఆలోచనామృతమే.ఈ రెండింటిని చక్కగా జతగూర్చి తెలుగువారికందించిన పోతన గొప్పదనము అనితర సాధ్యము.
భక్తుని భక్తి రసానుభూతిలో నిమగ్నుని చేసి, తన్మయావస్థకు తెచ్చేది సంగీతము."సరిగమపదని"అనే సప్తస్వరములు భక్తుడు భగవంతుని వైపు వేసె యేడడగులు.
సుస్వరంగా సంగీతాన్ని ఆలపిస్తే రాళ్ళు కలుగుతాయి, మలగిన దీపాలు వెలుగుతాయి,ఎండిన మ్రోడులు చిగురిస్తాయి.
వాయుపూరిత ఊఛ్ఛ్వాస విశ్వాసకలితమైన వేణువు నుండి ,ఆ రాగాలు ఆరోపణలు అవరోహణలు ఒకవైపునకొనసాగుతున్నాయి‌.స్వరస్థానాలు వెల్లివిరుస్తున్నాయి.జన్యరాగాలనుండి  రాగిణులు ఉధ్భవిస్తున్నాయి.జగన్మోహనునమూర్తి వేణుగానఝరిలో సంగీతామృతపయోధిమగ్నులైన గోపికలు గోవులు ఎంతపుణ్యులో ధన్యులో! ఆ ఆనందమే పరబ్రహ్మము కదా!
 వ్రేపల్లెలోని గోపగోపికలు ,గోవులతో పాటు పోతనామాత్యడు మనలను కూడా ఆనందసాగరములో ఓలలాడించాడుకదా!
-

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత