మాతృభాష
మాతృభాషలోన మమకారమొప్పగా
అభ్యసింపవలయునాంధ్రభాష
తెలుగు రాని నీకు తెగనీల్గుడెక్కువై
ఆంగ్లభాషయెక్కువనగనేల
అన్యభాషలెల్లనభ్యసింపవలయు
మనకుపనికివచ్చు మర్మమెరిగి
తెలుగువారితోడతేనెలూరునట్లు
తేటతెనుగుఘనతతెలుపుమోయి
అమ్మయనుచుపలుకనవమానమేలరా?
మమ్మియనుచుపిల్వమాన్యతేన
నాన్న యనుచుపిల్వ నగుబాటుయేలరా?
డ్యాడియనుచుపిల్వడాబుసరియె
ఆంధ్రభాషనేర్వయత్యంత సులభము
చదువపనియులేదు చదవకుండ
తెలుగువాళ్లు ననుచు తెగువతోపల్కగా
మండిపోవుమనసు మాటలేల?
ఆంగ్లమాధ్యమంబునత్యవసరమంచు
అలమటించనేలనాంధ్రులార
తెలుగునుడులతీపితెగజుర్రకొనకుండ
ఆంగ్లభాషనీకుయర్థమగునె
ఆంగ్లభాష లోన నాధిక్యముందంచు
చంకగుద్దుకొన్న చవటయగును
కార్యశీలమతినికార్యముల్ నెరవేర్చు
ప్రజ్ఞ చూపవలయు పలుకుకన్న
అంకులనుచుపిల్వపెంకులూడగలవు
ఆంగ్ల పదము లేల యర్భకుండ
ఆంటియనుచుపిల్వననురాగమేముండు
అత్తపేరులోనియాదరమ్ము
తెలుగువారికెల్లవెలుగుజిలుగులిచ్చు
చైత్రమాసమొచ్చె చేరరండీ
వత్సరాది వచ్చె వాత్సల్యమొలకించ
పిలువరండిమీరు ప్రీతితోడభాషను కాపాడుభాధ్యత వుందన్న
అధ్యాప కులునేడవసరంబు
మాతృభాషను నేడు మరిపించు నేతలు
పుట్టకొకరునేడు పుట్టి నారు
మమ్మిడాడియనచుమోజతోపిలుపించు
ఉన్నాద జాడ్యంబు నూపిరాయె
ఆంగ్లమాధ్యామాన యర్హతల్ సాధించి
అమెరికా వాసన యాశపడుట
మబ్బులో నీటికై ముంతను పగలేయ
వక్రబుధ్ధికిపుడు వచ్చుటంత
తెలివైన పనికాదు తెలుసుకొమ్ము
ఆ.వె.అమ్మభాషలోనె యభివృధ్ధిచెందుట
మంచిదారియనుచు మరవకోయి
పరుల భాష లోన ప్రావీణ్య మొందగా
మాతృభాష యెకటె మంచిదారి
(రచన:--విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రీ)

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి