ప్రాణసఖి

ప్రాణి సఖని గంటి భార్యగా నేనంత
ఆలిగాగనన్ను నాదరించు
అమ్మయటులనాకునాప్యాయమందించు
కొంటెవేష మేయకోపగించు

కూరికూరిపెట్టు కొసరికొసరినాకు
అన్నమొల్లనన్ననలుగునెపుడు
జ్వరమువచ్చినంతజాగసేయకనన్ను
కంటిరెప్పలాగకాచియుండు

మనసులోనిమాటమరివిప్పిచెప్పదు
తనదుమనసుతలపు తనకెతెలియు
నేత్ర సంజ్ఞ తోడనేర్పుతోతెలుపును
ఎరుగవలయుమనముయెరుక కల్గి

ఉప్పు నుసిరికట్లునుద్వాహమొందగా
కలసిమెలసి నాము కాపురాన
సీతయంచుపిలుతుశ్రీమంతురాలిని
పరులమంచికోరుపడతితానె

నాదువిజయమందునాలోనిశక్తియే
తాన కాకయెవరుధాత్రిలోన
ఒప్పుతప్పులెల్లనోర్మితో గమనించి
దారిచూపునట్టి ధర్మపత్న

నాదుబలమెకాదు నాబలహీనతల్
ఎరుకకల్గినట్టి యోగ్యురాలు
మగనివిజయమందుమగువకలదనిన
కల్లకానిమాట ఖచ్చితమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత