సూక్తి సుధ

ఆరుబయటి పడక యానందమందించు
నింగిలోన చూపి నిలిపితేను
తారలన్ని నిన్ను చేర రమ్మనియంచు
కన్నుకొట్టి నిలుచు సున్నితంగ

గగనపథమునందు కన్పట్టు తారలు
మిణుకు మిణుకు మనుచు గొణగునట్లు
ఊసులేమొ తెలిపి నూకొట్టు మనుచున్న
గడుసుదనము చూడకనుల విందు

అన్నివున్నవనుచునానందమందుటె
గొప్పతనముకాదు కువలయాన
ఇన్ని యిచ్చి నట్టి యీశ్వరునియందు
మనసునిలుపవలయు మరువకెపుడు

అమ్మసృష్టిలోన యధికులధములన్న
విభజనంబులేదు బిడ్డలొకటె
ప్రేమ పంచుతల్లి బేధంబు చూపదు
గాడిదైన నేమి గజము కూడ

మరుపు కూడ మం‌చి బాటకాదెమనకు
మరవకున్న బ్రతుకు నరకమగును
పూర్వజన్మ గుర్తు పుట్టించు నరకమ్ము
దానికేదిమందు ధరణిలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత