శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః
దేవతల్ వేడగా దేవకీ గర్భాన
జగమేలు స్వామియే జన్మ మందె
అష్టమీ తిథియందు యష్టమగర్భాన
అవతరించెను గాదె యచ్యుతుండు
పరపక్షమేలేని పరమాత్ము చెంతకు
కృష్ణపక్షమ్మింక కృష్ణు చేరె
చెరసాల పుణ్యంబు చెప్పలేరెవ్వరు
అఖిలాంతరాత్ముడె యవతరించె
అవతార తత్త్వంబునమ్మనాన్నల కెల్ల
ఆసక్తి వివరించు నధ్భుతమ్ము
చెవులార విన్నట్టి చెరసాల భాగ్యమ్ము
ఇతిహాసమందంత యిమిడిపోయె
నిశిరాత్రి వేళలో నిబిడాంధకారాన
రేపల్లె చేరిన రేని కథ
భవ్యమౌ రీతిగా భాగవత సుధనంత
ఆస్వాదించవలయు నమృత మట్లు
పగతోడ నైనను భగవంతు స్మరణమ్ము
మోక్షము పొందగా ముందు నుండు
చిలిపి కృష్ణుడతడు శిఖిపించ మౌళియౌ
ఆలమందలతోడనరుగు చుండు
గోప బాలు డమ్మ గోవిందుదతడమ్మ
మనకు రక్ష నొసగు మాధవుండు
దేవుదేవుడతడు దేవకీ గర్భాన
జననమందినతడు జగతికావ
వేదవేద్యుడతడువేణుగానలహరి
వినిపించి మురిపించె విశ్వ మయత
గోవర్ధనోధ్ధారి గోపబాలురకూడి
ఆలమందలతోడ యరిగి తిరిగె
ఆ.వె.బాలకృష్ణు డతడు భక్తమానసహంస
శిష్ట జనుల కెల్ల శ్రేయ మొసగ
అవని వెలసి నట్టి యచ్యుతుండతడోయి
ఇహము పరము లిచ్చు యూశ్వరుండు
(విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి