అష్టాదశ శక్తిపీఠాలు
శ్రీమాత కృపచేత సిధ్ధింఛు సర్వంబు
అనువదింతును నేను నార్యు లార!
లంకలోన వెలసె శాంకరీ దేవిగా
కామాక్షి మాతగ కంచి లోన
ప్రద్యుమ్న పురమున భవ్యమౌ రీతిగా
శృంగలాదేవిగాదృశ్యమాయె
చాముండు వధియించి చాముండ మాతగా
క్రౌంచపురమునందు ఘనత తోడ
అయ్యలంపురమున పర్ఛింప బడుచుండు
జోగులాంబాదేవి యోగ సిధ్ధి
ఏకవీరాఖ్యతో యీరేడు లోకాలు
మాధుర్య పురమున మనుచు నెపుడు
శ్రీశైల క్షేత్రాన శ్రీభ్రమరాంబగా
భక్తజనుల కెల్ల భయము దీర్చు
కోలాసురుదునిమి కొల్హాపురంబున
శ్రీలక్ష్మి యైనిల్చె సిరుల నొసగ
ఉజ్జైని నగరాన నుగ్రంపు రూపెత్తి
కాళికా దేవియై కరుణ జూపు
పురుహూతి కాఖ్యతో పురుషార్థ ములనివ్వ
పీఠికా పురమున పీఠమెక్కె
ఓడ్యాన నగరాన హొయెలొప్ప నగజాత
గిరిజాఖ్యతో కీర్తి నందె
దక్షిణ కాశియౌ దక్షవాటికలోన
మాణిక్య దేవియై మనుచు నెపుడు
కామ్యముల్ దీర్చగా కామరూపాఖ్యతో
హరిక్షేత్ర వాసియై యంబ యొపుడు
భవ్య ప్రయాగలో దివ్యమౌరీతిగా
మాధవు దేవేరి మహిమ జూపు
వైష్ణవీ దేవియై వైభవంబొప్పగా
జ్వాలాపురిని దివ్య జ్యోతి యట్లు
శాక్తేయ పీఠాలు స్మరింప వలెనయ్య
యోగవిద్యల నిచ్చు యోగ మాయ
ఆరోగ్య భాగ్యాలు నాయుష్య మందించు
అపమృత్యు భయమంత నంతరించు
శాత్రవుల్ నశియింత్రు సంపదల్ కల్గును
జగదంబ కృపచేత జరుగు నింక
రచన నాది యైన రచియుంచు శక్తిని
అంబ నాకు నొసగె నార్ద్రతొప్ప
కవిని కాని నన్ను కవితలల్లునటుల
ఆజ్ఞ నొసగినట్లు నర్థమాయె
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి