శివుని కరుణ

శివుని యాజ్ఞ లేక చీమైన కుట్టదు
భవునినయాజ్ఞ లేక భవములేదు
హరుని యాజ్ఞ చేత నఖిలంబు లయమందు
మూడుకన్ను లాడి ముచ్చటిదియె

అష్టమూర్తియతడు నషుతోషుడితడు
సర్వశుభములొసగు శంకరుడు
దయను చూపు నట్టి దక్షిణా మూర్తికి
మ్రొక్కుచుంటినయ్య మోక్షమంద

అంబకరుణతోడ సాంబశివునియండ
పూర్వ జన్మ లోని పుణ్యగరిమ
దారిచూపినన్ను దరిచేర్చుమనుచుంటి
శివుని కరుణకల్గ చింతయేల

నాకు జన్మనిచ్చి  నన్నివేళలగాచి
చదువు సంధ్య నేర్పి సాకినావు
భక్తిలేని నాకు భవబంధముల్ దీర్చు
మంత్రరాజ మొసగి మనచినావు

కూడుగూడగుడ్డ కుశలంబు యొనగూర్చి
కంటిరెప్పవోలె కాచినావు
అల్ప ఫలముదొరక యఖిలార్థ మట్లుగా
భావశుధ్ధినొసగి మనిచినావు

నాదు విజయమెల్ల నాదియెట్లగు స్వామి
నడక నీవు నేర్ప నడచినాను
అల్పుడైన నేను నాధిక్యమందుట
నీదుకరుణ గాక నాదియగునె

గండమాలతోడ గండాలు దండెత్తి
మాట పలుకు లేక బాధపడితి
మాటపలుకునిచ్ఛి మంచివిద్యనొసగి
మనిచినట్టి నిన్ను మరువగలనె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత