ద్వాదశ జ్యోతిర్లింగములు

సౌందర్య తీరమౌ సౌరాష్ట్ర దేశాన
సోముఃడు నిలిపెగా సోమనాథు
శ్రీశైల నాథుండు శివలింగ రూపియై
భ్రమరాంబతోగూడి భద్ర మొసగు
కాళికాదేవితో కాళేశ్వరాఖ్యుడై
ఉజ్జయినిపురిలో  నుగ్రమూర్తి
అమలేశ్వరంబున నాదిదేవుండచట
ఓంకారలింగమై  యొప్పు చుండు
భవరోగవైద్యుడై  భస్మాంగ రాగియై
వైద్యనాథాఖ్యతో  వెలసెనిచట
ఢాకినీ తీరాన దనుజమర్దనచేసి
భీమశంకరుడంచు బిరుదుపొందె
రామేశ్వరంబున రామచంద్రునిచేత
రామేశలింగమై రాణకెక్కె
దారుకావనములో నాగేశలింగమై
పుడమిజనులకెల్ల పుణ్య మొసగు
విశ్వేశవంద్యుడైవిభుదేంద్ర పూజ్యుడై
విశ్వేశ రాఖ్యతో వెలసె కాశి
గౌతమీ తీరాన గౌరమ్మతోతాను
త్ర్యంబక లింగమై తరలె నచట
కేదారలింగమై కైవల్య మూర్తియై
పరమేశు భక్తుల వరదు దతడు
కౄరాత్ము దునుమాడుఘృష్ణేశ లింగమ్ము
భక్తజనుల పాలి ముక్తి పథము
పరమేశు తత్త్వంబు  పండ్రెండు పాదాల
అర్పణంబొనరింతు నార్తి మీర
వెలుగుదివ్వెల బోలు విశ్వేశు లింగాల
మహిమతెలుపనాకు బలములేదు
ఆ.వే. మందమతిని నేను మాహేశు  మహిమను
తెలుపగలనెనేను తెలివి మాలి
నాకుతోచినంత  నాగేంద్ర హారుని
వర్ణనమ్ము సేయ వరము నిమ్ము
ఆ.వే.దొసగు లన్నియు నాదునెరసులంచు
తలపవలయు మీరు తత్త్వ మరసి
ఒప్పు లన్ని కూడ యోంకార మూర్తివే
అప్పగింతు నింక నార్తితోడ
[ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకములతో నేను చేసిన చిరు యత్నము]
(రచన:౼విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత