జీవసేవ--ఈశ్వర పూజనం

జీవ సేవ-ఈశ్వర పూజ
---------------+---------------------
స్వామీ వివేకానంద "ఆత్మనో మోక్షార్థం జగధ్ధితాయచ"అనే నినాదాన్ని యువతరానికందించారు. తనమోక్షసిధ్ధి జగత్తునకు హితమును కలిగించుటలోనే దాగుంది.కాబట్టి మనమందరము జీవసేవ యీశ్వరారాధనగా భావించి ,ఆచరించి తరించాలి.
మహాభాగవత పురాణం తృతీయస్కందంలోని కపిలదేవహూతి సంవాదములో జీవసేవయే భగవదారాధనగా చెప్పడం జరిగింది.
"అథమాం సర్వభూతేషు
భూతాత్మానం కృతాలయం
అర్చయేత్ దానామానాభ్యాం
మైత్ర్యా అభిన్నేన చక్షుసా" అనికపిలమహర్షి తన తల్లి దేవహూతితో అన్నాడు.
భగవంతూడనైన నేను సకలప్రాణుల హృదయాలను ఆలయంగా చేసుకొన్నాను.కావున ఎవరికేదియవసరమో గుర్తించి వారి ఆత్మాభిమానము దెబ్బతినకుండా మైత్రీ భావముతో అభిన్నదృష్టితో సేవచేయాలి.సేవచేయువాడు తాను గొప్ప వాడినన్న అహంకారము తలెత్తకుండా సేవ పొందువాడు తాను అభిన్నులు అనుభావముతో సెవచేయాలి.సేవాదృక్పథముకలవానికి ఈ భావముండాలి.
ఇలా సేవచేయకుండా పూజలు జపాలుతపాలు ఎన్నిచేసినా  అవి ఆడంబరమాత్రములే.ఇలాంటి అర్చావిడంబనము నాకు యిష్టములేదని భగవంతుడు నిష్కర్షగా ఆదేశించాడు.
గుర్రం జాషువా మహాకవి తనగబ్బిలం కావ్యంలో ఈ భావాన్ని స్పష్టంగా
 ధ్వనింపజేశాడు.
"ప్రతిమలపెండ్లిసేయుటకు వందలువేలువ్యయుంచురుగాని దుః
ఖితమతులైన పేదలఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకువిదల్చీభరతమేదిని ముప్పదిమూడుకోట్లదే
వతలెగపడ్డదేశమున భాగ్యవిహీనులక్షత్తులారునే"
సామాన్యంగా గుడికి వెళ్ళిదేవునకు దండం పెడితే సరిపోతుంది.జపంతపంచేస్తే చాలదా ? అని అనుకొంటువుంటాము.కానీ తనకళ్ళముందే వేలాది ప్రజలు ఆకలితో ఆజ్ఞానముతో రోగాలతో దుఃఖాలతో  బాధపడుతుంటే ఏమాత్రం పట్టించుకోరు. ఇలాంటి పూజలెన్నిచేసినా ఏమి ప్రయోజనము
కనులముందు కనిపిస్తున్న మానవరూపదేవతలను సేవరూపమమైనట్టి ఆరాధన చేయాలి."దరిద్రదేవోభవ,మూర్ఖ దేవోభవ,రోగిదేవోభవ(దరిద్రులు,మూర్ఖులు,రోగులను దేవతలుగా భావించి సేవించు.")అన్న స్వామీ వివేకానంద సందేశాన్ని మనం గుర్తుచేసుకోవాలి.
జీవసేవ యీశ్వరపూజగా పరిణమించాలి.ప్రార్థించే పెదవులు అనురాగపుతేనెలు వొలికించాలి.
ఈ సందర్భంగా రంతిదేవునిళత్యాగదాన గుణములను గుర్తుచేసుకోవాలి.రంతిదేవుని దానగుణమును మెచ్చుకొని త్రిమూర్తులు ప్రత్యక్ష మై ఏమివరంకావాలో కోరుకో మన్నారు.
రంతిదేవుడు వారితో
"నత్వహం కామయేరాజ్యం
నస్వర్గం నాపునర్భవం
కామయేదుఃఖతప్తానాం 
ప్రాణినాం ఆర్తి నాశనం"
,"నేను దానం చేసిన రాజ్యము నేను కోరుకోవడం లేదు.నాకుస్వర్గసుఖాలు అక్కర లేదు.నాకు మోక్షము అక్కర్లేదు.దుఃఖంతో తపించిపోయేవారి ఆర్తిని‌ పోగొట్టడమే నేను కోరుకొంటున్నాను"అన్న రంతిదేవుని పలుకులు మనకు స్పూర్తి నివ్వాలి.
సేవ సేవ,పని,పని అంటూవుంటారు.అలా చేస్తూ పోతే విసుగేస్తుందేమో కదూ!
అలా విసుగు రాకుండా వుండాలంటే స్వామి వివేకానందులు చెప్పిన చక్కని ఉపాయం పాటించడం మంచిదీ,ఉపయోగకరమైనది.
అదే మంటే"మొట్టమొదట నేను సహాయం చేస్తున్నాను"అనే భావం వదిలేయాలి. అప్పుడే సేవ పూజగా పరిణమిస్తుంది. "మీరంతా భగవత్ స్వరూపాలే మనదంతా భగవత్కుటంబమే "అనే భావనరావాలి.నేను వీరికి సేవకుడను.అనే భావంతో సేవించాలి.అప్పుడు కట్టెదుట కనిపిస్తున్న  భగవంతుని పూజించు.భగవంతుడు మన ఎదుట వివిధమైన ఆకృతులతో  కుంటివాడిగా,గ్రుడ్డివాడిగా,రోగిగా,మూర్ఖునిగా,మోసగానిగా ఇలాపలురూపాల్లో వచ్చాడని భావించి సేవించు.వీరికి సేవచేసే భాగ్యము లభించిందని ఆనందంతో  పొంగిపో! అప్పుడు ప్రార్థించే పెదవులకన్నా సేవచేసే చేతులే  గొప్పవవుతాయి.కానీ మెట్టమొదట సహాయంచేస్తున్నాయని భావాన్ని తుడిచి వేయాలి.
"అడుగడుగునగుడివుంది
అందరిలో గుడివుంది"
అని ఆనంద పారవశ్యం లో మునిగి పోతావు.అప్పుడు మన జన్మ చరితార్థం మవుతుంది.
ఈ మర్మం తెలియక కొందరు భక్తబ్రువులు కొంగజపంచేస్తూ లోక వంచన చేస్తుంటారు.అలాంటి కృత్రిమ భక్తులను దృష్టిలో పెట్టుకొని వారిని భగవంతుడు విష్ణుపురాణములోఇలా హెచ్చరించాడు.
"స్వధర్మకర్మవిముఖాః
కృష్ణకృష్ణేతి వాదినః
తే హరే ద్వేషిణో మూఢాః
జన్మార్థం జన్మయజ్జరే"
స్వధర్మ కర్మవిముఖులైన మూఢూలారా! కృష్ణా కృష్ణా అంటు పలికిన మాటలు భగవంతునకు సంతోషాన్ని కలిగించవు 
వాచా వాత్సల్యం కన్నా కర్తవ్యాచరణ అతి ముఖ్యము.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత