ధర్మో రక్షతి రక్షితః(రేడియో ప్రసంగము)

ధర్మో రక్షతి రక్షితః
"జంతూనాం నరజన్మ దుర్లభం" అన్నా రు ఆదిశంకరులు తన వివేక చూడామణి లో.84కోట్ల జీవరాసుల్లో మానవజన్మ శ్రేష్టమైనది.
ఆహార నిద్రాభయాదులు పశువులకు మానవులకు సమానమేకదా! మరి మానవ జన్మ విశిష్టత  యేమిటి? అని ప్రశ్న ఉదయించక మానదు.మానవునకు ప్రకృతి మాత ప్రసాదించిన రెండు ముఖ్యమైన వారాలు,జంతువులనుండి మానవులను వేరు చేస్తున్నాయి.ఇవి భగవదత్తములు.ఆవే వివేకము విజ్ఞానములు. వీటి వల్లనే మానవుడు విశిష్ట వ్యక్తి యైనాడు.
యుక్తా యుక్తి విచక్షణా జ్ఞానముతో మానవుడు యేమి ఆచరించాలో,వేటిని వ్యర్జించాలో తెలుసుకొంటాడు. తెలుసుకోని సత్కర్మలనాచరించి తరువాతి తరాలకు మార్గదర్శకుడౌతాడు.
ఇంక పరంపరాప్రాప్తంగా లభించిన విజ్ఞానముతో మహామనీషియై  వెలుగొందుతాడు."మానవుడే మహనీయుడు,యుక్తి టరుడు శక్తి పరుడు మానవుడే"అంటాడు మహాకవి శ్రీశ్రీ.అట్టి మానవుడు తన జీవిత లక్ష్యాలుగా,పరమార్థాలుగా సాధించే వెలసిన లక్ష్యాలనే పురుషార్థాలంటారు.అవి ధర్మార్థ కామ మోక్షాలుగా నాలుగు విధాలు.ఇవే మానవుని మహనీయుని గా తీర్చిదిద్దే అంశాలుగా పెద్దలు చెప్పారు.
పురుషార్థాల్లో ధర్మంతో మొదులవుతుంది.కావున మనం ధర్మమునుగురించి తెలుసుకొని ఆచరించి  ధన్యులమవుదాము.
"సత్యం వద---ధర్మంచర" అన్నది వేదము.సత్యాన్ని పలకాలి ధర్మాన్ని ఆచరించాలి.
ధర్మాన్ని ఆచరించాలంటే ధర్మమేదో తెలియాలిగా! 
"ధర్మం"--ధృ అనేధాతువునుంచి ధర్మం అనే పదం వచ్చింది. ధృ ధాతువునకు ధరించేది,హరించేది,రక్షించేది అనే అర్థాలున్నాయి.
సమస్త విశ్వాన్ని ధరించేది ధర్మం."ధరతి  విశ్వం  ఇతి ధర్మః"
అని ధర్మానికి నిర్వచనము."ధర్మం యతో అభ్యుదయ నిశ్శ్రేయస స్సిధ్ధిః  సధర్మః అన్నారు శాస్త్రజ్ఞులు. అభ్యుదయం నిశ్శ్రేయసము మానవాళికి కలిగించేది ధర్మము.
అంటే మానవాళికి ఈ లోకంలో అభ్యుదయమును కలిగించే సాధనంగా ఉపయోగపడి,పరమార్థ మైన మోక్షాన్ని అందించేది ధర్మము."యస్మిన్ దేశేయమాచారః పారంపర్యక్రమాగతః
ఆమ్నాయైః  అవిరుధ్ధంశ్చ  సధ్ధర్మ పరికీర్తితః"
వేదవిరుధ్ధంకానిదీ,ఏ ప్రాంతంలోనైనా పరంపరగా పెద్దలచేతకొనసాగించబడే ఆచారాన్ని ధర్మమంటారు అని పెద్దలమాట
"ధారణాత్ ధర్మయిత్యాహూః
ధర్మో ధారయతే ప్రజాః
యూత్ స్యాత్ ధొరణి సంయుక్తం 
సధర్మః ఇతి నిశ్చయం"
అంటాయి వేదాంగాలు.
ధర్మం సమస్తమును ధరిస్తుంది.ధర్మం ప్రజలను రక్షిస్తుంది.రక్షణ కలిగించే దాన్నే ధర్మమంటారు అన్నారు వేదవ్యాసుడు వారు.
"ధర్మో రక్షతి రక్షితః" అన్నది ఆర్యోక్తి.
ధర్మాన్ని రక్షించడమెలా? ధర్మం ఒక వస్తువుతో వ్యక్తోవకాదు కదా! దాన్ని యెలా రక్షించాలి? అన్న అనుమానం వస్తుంది. ధర్మాన్ని రక్షించడమంటే, ధర్మాన్ని మనం నిత్యజీవితంలో ఆచరించాలి.అలా ఆచరించినపుడే ధర్మం మనలను కాపాడుతుంది.
ధర్మం అంటే స్వభావము, లక్షణము అనే అర్థాలు కూడా వున్నాయి.ప్రకృతిలో ప్రతివస్తువు దాని స్వభావానికి తగిన లక్షణాలను కలిగి వుంటుంది. అట్లే మానవాళికి కొన్ని సముచితమైన ధర్మాలు న్నాయి.
"శైశవేభ్యస్త విద్యానాం
యవ్వనే విషయైషిణాం
వార్ధకే మునివృత్తీనాం
యోగేనాంతే తనుత్యజాం"
అని మహాకవి కాళిదాసు తన రఘు వంశ మహాకావ్యం లో రఘువంశరాజుల గొప్పదనాన్ని కీర్తించాడు.
బాల్యమున విద్యాభ్యాసం,యవ్వనమున ధార్మికమైన సంసారసుఖాలు,వార్ధక్యమున ఆధ్యాత్మిక జిజ్ఞాసకలిగి, యోగమార్గమున మార్గమున మోక్షాన్ని పొందాలి అని పై శ్లోకం భావము.
విద్యార్థులకు విద్యాభ్యాసము పై శ్రద్ధ,ఉపాధ్యాయులకు పాఠ్య బోధన,ఉద్యోగులకు తమ విధి నిర్వహణ  అధికారి వారి స్వధర్మాలు.వారు తమ స్వధర్మాలను విస్మరిస్తే సమాజంలో సామరస్యం వుండదు.ససామరస్యం లేకపోతే శాంతియుండదు.శాంతిలేకపోతేసుఖముండదు.
ఇలా మనం నిత్య జీవితంలో ధర్మాచరణకావిస్తే జయం తప్పక లభిస్తుంది.'యతోధర్మః తతోజయః", అన్న సూక్తి నిజమౌతుంది.
"రామో విగ్రహాన్ని ధర్మః "అన్నది రామకథ. శ్రీరాముడు మూర్తీ భవించిన ధర్మ స్వరూపుడు.శ్రీరామునిలోనున్న ధర్మగుణాలు జగతి జనులకెల్ల ఆచరణీయాలు.పితృవాక్యపాలనకై శ్రీరాముడు అరణ్యవాసం చేశాడు.ఆదర్శవంతుడైన మహనీయుడు శ్రీరామ చంద్రుడు.అందుకే వాల్మీకి మహాకవి శ్రీరాముని"ధర్మజ్గశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృడవ్రతః"అని వర్ణించాడు. శ్రీరాముడు ధర్మమును తెలిసిన వాడేకాదు,ఆచరించి చూపిన వాడు‌.అందుకే మనం ధర్మజ్గులము , కృతజ్ఞులుగా, సత్యవాక్యపాలకులుగా నిలిచి పోదాము.

"

It

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత