భాగవత మందార మకరందాలు

1.&&&&గత కొన్ని రోజులుగా శ్రీమదాంధ్ర భాగవతం పద్యాలను లఘువాఖ్యతో మీ ముందుంచుటకు  ఒక కారణముంది.

మా నవభారత పాఠశాలల విద్యార్థులకు నవనగర్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయానికి శ్రీకృష్ణానుబంధమున్నది.

సింహమాసములో వచ్చేశ్రీవైష్ణవ కృష్ణాష్టమి నాడు బమ్మెర పోతనామాత్యవిరచిత  భాగవత పద్యాలు పోటీలు నిర్వహించడము  ఒక సంప్రదాయంగా వున్నది.  

ఈ సందర్భములో విద్యార్థులకు శిక్షణ నివ్వడం తెలుగు పండితుల బాధ్యత.తెలుగు మాధ్యమం పాఠశాలలో నేను,ఆంగ్ల మాధ్యమమునందు శ్రీమతి జి.సుబ్బలక్ష్మి, మేడమ్, బ్రహ్మశ్రీ వే.మూర్తులైన వెలివంటి సుబ్రహ్మణ్యము గారలు  ఇష్టంగా స్వీకరించే వారము.

ఆ సమయంలో  నేను సిధ్ధపరిచిన పద్యములను,సందర్భములను, భావములను,వ్యాఖ్యలను మీ ముందు వుంచుతున్నాను.

 ఈ ప్రక్రియ దాదాపు 30 సం||రాలుగా నేటికి కొనసాగుతున్నది(కరోనా యిబ్బంది రానంత వరకు).వీటిలోనేను వ్రాసిన కొన్ని ప్రతులు  నా అజాగ్రత్తవల్లనో మీరే ఇతర కారణాల వల్లనో  ప్రస్తుతము లభించడం లేదు.

మాకు ఈ పద్య శిక్షణకు ప్రేరకులు ఆనాటి కీ.శే.లు ధర్మకర్త శ్రీ R.S.S.V. ప్రాసాద్ గారు  వారికి బమ్మెర పోతన అన్న  తెలుగు సాహిత్యమన్నా అపార ప్రేమ. విద్యార్థుల్లో భాగవతమహా గ్రంధం లోని మాధుర్యము  విద్యార్థుల మనస్సులో నిలవాలని వారి తపన.ఆ మహాయజ్ఞములో మా వంతు పాత్రను పోషించా మన్న సంతృప్తి మాకు కలిగింది.అప్పుడు నేను వ్రాసిన వ్యాఖ్యలను మీ ముందు వుంచాను 

మకరందాలు&&&&&
ఆంధ్రమహా భాగవతము తెలుగువారి నోములు పంట.అందులోని ప్రతిపద్యమూ,ఆనందామృతములోనుంచి ముంచి తీసిన యమృత ఫలము.పోతనామాత్యడు తనఘంటమును భక్తి సుధారసములో ముంచి రచించినట్లుగా ఈ పద్యము అలరారుతుంది.
ఈ పద్యరత్నము ఆంధ్రమహాభాగవతములోని ద్వితీయస్కంధములో నున్న అనర్ఘ్యపద్యరత్నము.
సీ||సాంద్రశరచ్చంద్ర చంద్రికా ధవలిత విమల బృందావన దీనియందు
రాసకేళీ సముల్లాసుడై యుత్ఫల్ల జలజాక్షుడొకనిశాసమయమున
దనరారుమంద్ర మాధ్యమం తారముల
నింపుదళకొత్త రాగబేధముల దనరి
దైవతం ఋషభ గాంధార నిషాద పంచమ షజ్జ మాధ్యమం స్వరములోలి
తే.గీ.గళలుజాతులు మూర్చనల్ గలుగ వేణు
నాళవివరాంగుళీ న్యాస లాలనమున
మహితగతిబాడె నవ్యక్త మధురముగను
పంకజాక్షుండుదారువులంకురింప
పద్యభావము:---
శరదృతువులోని  పౌర్ణమి రాత్రి,చంద్రకిరణాలుబృందావనమునందు వెల్లివిరుస్తుండగా, అరవిందదళాక్షుడు మిక్కిలి ఉల్లాసముతో రాసకేళిని కావిస్తూ,తన సుకుమార సుందరహస్తములతో వేణువుపై గల రంద్రములను మూస్తూ,తెరుస్తూ,మంద్రమధ్యమ తారకములతో దైవతం,ఋషభ,గాంధార,నిషాద, పంచమషజ్జస్వరములతో ,కళ్లు,జాతులు,మూర్ఛనలు కలుగజేస్తూ అవ్యక్తమధురముగా గానం చేస్తుంటే ఎండిన మ్రానులు చిగురించాయి.
వ్యాఖ్య:--అలంకారికులు "సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం
ఏకమాపాత మధురం అన్యదాలోచినామృతం"(సంగీత సాహిత్యాలను సరస్వతీదేవి స్తనద్వయాలుగా పేర్కొంటారు).
బమ్మెరపోతన్నకు సంగీత సాహిత్యములో లోనున్న అభినివేశానికి ఈ పద్యం చక్కని నిదర్శనము.ఎంతైనా పోతన సహజపండితుడుకదా!
"శిశుర్వేత్తి,పశుర్వేత్తి రసంగానఫణిః"అన్న ఆర్యోక్తిని మీరు వినే వుంటారు.ఇది ఒక అర్థము.శిశువు అంటే కుమారస్వామీ,పశువు అనగా నందీశ్వరుడు ఫణి అనగా ఆదిశేషుడు అని కొందరు పెద్దల మనసులో మాట.
సామాన్య సంగీతజ్ఞుల సంగీతానికే సమ్మోహన శక్తి వున్నప్పుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన ఆ వేణుగానలోలుని గానమహిమను ఎవరు వర్ణింపగలరూ, ఎంతని వర్ణింపగలరు.
"సంగీతజ్ఞానము భక్తి వినాసన్మార్గము కలదే ఓమనసా!"అన్నారు వాగ్గేయకారులైన  త్యాగరాజస్వామి.
భక్తుని భగవంతుని వద్దకు చేర్చడానికి ఉపయోగపడే చాలాదగ్గరి దారి సంగీతము.ఎందుకంటే అది ఆపాతమధురము.ఇక సాహిత్యమంటావా అదే ఆలోచనామృతమే.ఈ రెండింటిని చక్కగా జతగూర్చి తెలుగువారికందించిన పోతన గొప్పదనము అనితర సాధ్యము.
భక్తుని భక్తి రసానుభూతిలో నిమగ్నుని చేసి, తన్మయావస్థకు తెచ్చేది సంగీతము."సరిగమపదని"అనే సప్తస్వరములు భక్తుడు భగవంతుని వైపు వేసె యేడడగులు.
సుస్వరంగా సంగీతాన్ని ఆలపిస్తే రాళ్ళు కలుగుతాయి, మలగిన దీపాలు వెలుగుతాయి,ఎండిన మ్రోడులు చిగురిస్తాయి.
వాయుపూరిత ఊఛ్ఛ్వాస విశ్వాసకలితమైన వేణువు నుండి ,ఆ రాగాలు ఆరోపణలు అవరోహణలు ఒకవైపునకొనసాగుతున్నాయి‌.స్వరస్థానాలు వెల్లివిరుస్తున్నాయి.జన్యరాగాలనుండి  రాగిణులు ఉధ్భవిస్తున్నాయి.జగన్మోహనునమూర్తి వేణుగానఝరిలో సంగీతామృతపయోధిమగ్నులైన గోపికలు గోవులు ఎంతపుణ్యులో ధన్యులో! ఆ ఆనందమే పరబ్రహ్మము కదా!
వ్రేపల్లెలోని గోపగోపికలు ,గోవులతో పాటు పోతనామాత్యడు మనలను కూడా ఆనందసాగరములో ఓలలాడించాడుకదా!
-

2.శివకేశవాభేదం భాగవతళధర్మం
--------------------------------------
"ఏకం సత్ విప్రాబహుదా వదంతి" అన్న వేదోక్తిని మీరు వినే వుంటారు భగవంతుడుశ్రీవైష్ణవులకు  శ్రీహరిగా కనిపిస్తే ,శైవులకు ఆ భగవంతుడు పరమేశ్వరునిగా తోచవచ్చు.శాక్తేయులకు జగన్మాతగా,గాణాపత్యులకు గణపతిగా,సూర్యారాధకులకు సూర్యుని గా కనిపించవచ్చు.కుమారస్వామిని పూజించే వారికి సుబ్రహ్మణ్యస్వామిగా తోచవచ్చు. పేరు ఏదైనా కావచ్చు.కానీ భగవత్త్వం ఒకటే.బసవేశ్వరండు "దేవునొబ్బ నామ హళువు"అని పేర్కొన్నాడు.యతో మత్ తతో పత్ అని శ్రీరామకృష్ణపరమహంస కూడా తన సాధనాల ద్వారా నిగ్ఖుదేల్చాడు.
సనాతన ధర్మం ఈ ఆరుమతాలను సమదృష్టితో చూడమని మనకు శ్రీమద్భాగవత పురాణముద్వారా సోదాహరణంగా తెల్పింది‌.ఇదే భాగవత ధర్మమని తెలిపింది అదియొలానో పోతనామాత్యుని మాటల్లో  విందాము.
ఆంధ్ర మహాభాగవతం మును దశమస్కంధమున బాలకృష్ణుడు తనకు పరమేశ్వరునకు అణుమాత్రమైన బేధంలేనటుల తన బాలలీలను చూపుతున్నాడు.ఆ లీలేమిటో మనము వీక్షించి (చదివి) ధన్యులమవుదాము.
సీ||తనువున నంటిన ధరణీపరాగంబు
పూసిన నెరిభూతి పూతగాగ
ముందట వెలుగొందు ముక్తాలలామంబు
తొగలసంగడికాని తునకగాగ
ఫాలభాగంబుపైబరగు గావలి(రి)
బోట్టు
కాముని గెలిచిన కన్నుగాగ
కంఠమాలికలోని ఘననీలరత్నంబు
కమనీయమగుమెడకప్పుగాగ
ఆ.వె.హారవల్లులురగహారవల్లులకాగ
బాలులీల ప్రౌఢ బాలకుండు
శివుని పొంగింది నొప్పె శివునకుందనకును
వేరులేమి తెలుపు  వెలయునట్లు"
అందమైన పద్యాన్ని విన్నాముకదా! ఇక పద్యభావాన్ని ,అందులొ దాగున్న ఆధ్యాత్మిక మర్మాన్ని అవలోకిద్దాము.
బాలకృష్ణుడు మట్టిలో ఆడుకోవడం వల్ల ,దేహానికంతా మట్టి అలముకొంది.అదిశివుడు పూసుకొన్న వీభూతిళపూతలిగా వుంది.ముఖమండలముపై అలంకరించబడిన ముత్యాల దండ బాలచంద్రుని శిరస్సుపై ధరించిన శివుని గుర్తుకు తెచ్చింది.
బాలకృష్ణుని లలాటఫలకముపై తీర్చిదిద్దిన కస్తూరితిలకం కామునిదహించిన త్రినేత్రుని మూడవకన్నులా అమరింది.
బాలకృష్ణుని కంఠాన్ని అలంకరించిన రత్నహారములో నాయకమణియైన ఇంద్రనీలమణి హిలాహలమును కంఠములో నిలుపుకొని నీలకంఠుని గుర్తుకు తెస్తుంది.
అలంకరణార్థము బాలకృష్ణుని గళసీమలో అమరిన పుష్పమాల సర్పభూషణుడైన శివుని గుర్తుకు తెస్తుంది.
ఇలా బాలకృష్ణుని లీలా వినోదములలో శివునకు తనకు ఇసుమంత బేధము లేనట్లు తెలుపడానికి ఇలా ఉన్నాడేమో అనిపిస్తుంది."శివాయవిష్ణురూపాయ శివరూపయా విష్ణువే
శివస్యహృదయంవిష్ణోః విష్ణోస్యహృదయంశివః" అనే శ్లోకాన్ని మీరు వినే వుంటారు.శివుడు విష్ణు స్వరూపుడు,విష్ణువు శివుని స్వరూపమే.శివుని హృదయాన విష్ణవు, విష్ణువు అంతరంగంలో శివుడూ వున్నాడు.శివకేశవాబేధమే భాగవత ధర్మము."ఆకాశాత్ పతితం తోయం
యథాగఛ్ఛతి సాగరం
సర్వదేవనమస్కారః కేశవం ప్రతిగఛ్ఛతి"అన్న సంధ్యావందన సందేశాన్ని మరువరాదు.
ఇదే శ్రీకృష్ణుడు భాగవతం ద్వారా నేర్పే పరమధర్మము‌ఇదే మనందరి కీ శిరోధార్యము

"చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడవడేని
దయయు సత్యంబు లోపుగా తలుపడేని
కలుగనేటికి తల్లుల కడుపు చేటు"
శివుడు  విష్ణువు పేర్లువేరేకానీ,వారిద్దరూ ఒకరే.శివుని హృదయాన విష్ణువు,విష్ణువు హృదయాన శివుడు ఉన్నారు.ఎక్కడ శివుడు వున్నాడో, అక్కడ విష్ణువు వున్నట్లే,ఎక్కడవిష్ణువు వున్నాడో అక్కడ శివుడు వున్నట్లే. వీరిద్దరిని ఒకరిగా భావించే వారికి మంచి జరుగుగాక!
శివుడు అంటే శుభములిచ్చువాడు,విష్ణువు అంటే సర్వ వ్యాపకుడు.శివుడు అభిషేక ప్రియుడు,విష్ణువు అలంకార ప్రియుడు.శివుడు కరుణకు ఆలవాలము. విష్ణువు సత్యస్వరూపుడు.శివుని వలన దయను, విష్ణువు వలన సత్యాన్ని తెలుసుకొని ఆచరించి చూపాలి.సకల జీవరాసుల్లో శివుడు వున్నాడు.సకల జీవులను సేవించడమే శివుని పూజించడము,సత్యము విష్ణువును పూజించడం మే.కాబట్టి దయను సత్యమును అలవర్చుకోవాలి.అలా జీవించినప్పుడే జన్మ ధన్యమవుతుంది.అలాకానప్పుడు మానవజన్మ వ్యర్థ పరచినట్లౌవుతుంది. సనాతన ధర్మం సారం ఇదే


కాళీయ మర్దనము
----_----------_---------
3.శ్రీమద్భాగవతం మిత్రసంహితమైన మహా పురాణము.భక్తిరసికులైన వారికి మహాకావ్యమనిపిస్తుంది.శ్రీకృష్ణపరమాత్మయే మనకథానాయకుడు.
ఈ శ్రవ్యకావ్యంలో అతిసుందరదృశ్యాలనేకము.
ఈ సుందరదృశ్యాలకు మహాకవి బమ్మెరపోతన అక్షరరూపం కల్పించారు.
దశమస్కంధంలోని బాలకృష్ణుని బాల లీల్లో కాళీయమర్దనము అత్యంత సుందర దృశ్యం.దుష్టశిక్షణార్థము అవతరించిన శ్రీకృష్ణుడు మడుగులోకి దూకి కాళీయుని పీచమణిచి అతనిపై నర్తించు అందమైన దృశ్యాన్ని అక్షరరూపం లో మలిచిన చక్కని సీసపద్యాన్ని అవలోకిద్దాము.
"ఘనయమునానదీ కల్లోల ఘోషంబు
సరసమృదంగఘోషంబుగాగ
సాధుబృందావన చరచంచరీకగా
నంబు గా యకసుగానంబుగాగ
కలహంస సారస కమనీయమంజుశ
బ్దుంబులు తాళశబ్దములుగాగ
దివినుండి వీక్షించు దివిజగంధర్వాది
జనులుసభాసన జనులుగాగ
తే.గీ.పద్మరాగాది రత్న ప్రభాసమాన
మహితకాళీయ పణిమహామంటపమున
నళినలోచన విఖ్యాత నేర్చుకుంటాడు
నిత్య నైపుణ్యమొప్పగా నృత్యమాడె"
భావము:--ఘనమైనట్టి కల్లోల సంకులమైనట్టి యమునానదీఘోషమే మృదంగం నాదముగా,సాధుబృందావనమున సంచరించు తుమ్మెదలు ఝుంకారనాదమే గాయకులు చక్కనిగానంకాగ,రాజహంసల కమనీయమైనట్టి మంజుశబ్దంబులు తాళశబ్దములు కాగా,స్వర్గం నుండి వీక్షించారు దేవగంధర్వాదులే సభాసదులుకాగా,పద్మనేత్రుడనే విఖ్యాత నర్తకుడు నిత్యనైపుణ్యం అయిపోయింది నట్లు నాట్యం చేస్తున్నాడు.
ఈ పద్యం ఆంధ్రసాహిత్యానికి ఒక అమూల్యమైన కానుక.
నృత్యంలో ఆంగికము,వాచికము,ఆహార్యము ఎంతమముఖ్యమో మనకందరికీ తెలుసు.
జగన్నాటక సూత్రధారి సమయానుకూలంగా పాత్రధారి కాగలడు.అప్పుడు ప్రకృతి కూడా ఈ జగన్నాటకంలో అధ్భుతరీతిగా సహకరిస్తుంది.
నృత్యం రక్తి కట్టాలంటే అన్నిహంగులూవుండాలి.నర్తకుడు ఎంత విఖ్యాత నర్తకుడైనా , నృత్యానికి తగినట్లుగా అన్ని యేర్పాట్లు వుండాలి.గానానికి తగినట్లు తాళం వుండాలి,నట్టువాంగం వుండాలి.అన్ని హంగులూ ఆమరినట్లు  వుంటేనే నృత్యం రక్తి కడుతుంది.వీటన్నటితో పాటు రంగస్థలమూ,ఆ రంగస్థాలానికి అలంకరణలు,ముఖ్యంగా దీపాలంకరణ వుండాలి.అన్నిటికన్న ముందు రసజ్ఞులైన ప్రేక్షకులు ఉండాలి.అప్పుడే వారిలో రసస్వరూపమైన బ్రహ్మానుభూతికలుగుతుంది."రసోవైసహా" అన్నది తైత్తిరీయోపనిషత్తు.
యమునానది యొక్క కల్లోలతరంగాలధ్వని మృదంగ ధ్వానముకాగా,సాధు బృందావన సంచారులైన తుమ్మెదలు ఝుంకార నాదం గానమై విరాజిల్లింది.తుమ్మెదలఝుంకారనాదము  గానమైనప్పుడు తాళంళతప్పకవుండాలి కదా! అందువల్ల రాజహంసల కమనీయమొనట్టి మంజుల ధ్వనులు తాళశబ్దములైనాయి.
నాట్యవేదిక ఎత్తుగా ను ప్రేక్షకులు క్రిందగావుండటం మనసహజంగా చూచే ఏర్పాటు.కానీ ఇక్కడ ప్రేక్షకులైన దేవగంధర్వాదులు ఆకాశం నుండి చూస్తున్నట్లు వర్ణించబడింది.చూచేవారుకూడా సామాన్యులు కారు.గంధర్వగానం చేయు గంధర్వులు, వాద్యనిపుణులైన కిన్నెరకింపురుషాది దేవతలు.
నాటకమందలి మెళకువలూ,మంచి చెడ్డలూ చెప్పాలంటే సమర్థులైన ప్రేక్షకుల కావాలి.ఇక నాట్యవేదికందామా! అది అనేక ఫణివిరాజితమైన కాళీయుని   శిరస్సు.ఆ శిరస్సు నందు వివధరత్నములకాంతి నాట్యరంగముపైనా నర్తకుని పైన ప్రసరింప జేస్తుంది.ఎంత అందమైన ఊహ?
ఇక్కడ నళినలోచన పద ప్రయోగాన్ని చక్కగ ప్రయోగించారు‌.నృత్యాని కి హస్తాభినాయాదులేకాక నేత్రాభినయము ద్వారా అనేక భావాలను వ్యక్తం చేశాడాదనికే నళిని లోచన పదమును ఉపయోగించాడు
ఇక నర్తకుని గొప్పదనాన్ని వర్ణించడం ఎవరి తరము? ఎవరికి అంత సమర్థత వుంది? నర్తకుని భంగి పెక్కు మూర్తూలతో ఆడే విఖ్యాత వర్తకుడు.అతని నర్తన గొప్పదనాన్ని మునులు దివిజులుకూడా  తెలుసుకోలేరు.నర్తకుడూ,నాట్యమూ,
నృత్యవీక్షకులు అన్ని తానే.
మన చిన్నకృష్ణుడు మాయామానుష విగ్రహుడుకదా! ఈ అనంత విశ్వమూ అతని నాటకరంగమైనప్పుడు,అందులో ఎన్నిరంగాలూ, ఎన్ని హంగులూ వుంటాయో ఎవరికి తెలుసు?

చదువు సంధ్యలు

అల్పాక్షరములతో అనల్పార్థచనకు శ్రీకారం తిక్కనామాత్యుడు చుడితే తరువాత దానిని కొనసాగించిన వాడు మన బమ్మెరపోతన్న.పోతన్నకు అది నల్లేరుపై బండినడకే కాదు,వెన్నతో పెట్టిన విద్య. పద్యం చిన్నది.భావమేమో పెద్దది.

హిరణ్య కశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుని విద్యాభ్యాసం కావలసిన అవసరం గుర్తించి

"చదవనివాదజ్గుండగు 

చదివిన సదసత్ వివేక చతురతగల్గున్" అని భావించి అందరి తల్లిదండ్రుల వలే తమ కులగురుపుత్రులైన చండామార్కుల చదువుల బడిలో చేర్పిస్తాడు.అలాకొంత కాలము మన ప్రహ్లాదుడు అక్కడ చదివాక,కొడుకు చదువు ఎలా సాగుతుందో పరీక్ష చేద్దామనుకొని ప్రహ్లాదుని పిలిపించి,ఆప్యాయంగా తన ఒడిలో కుర్చుండ బెట్టుకొని ఆప్యాయంగా "నాన్నా! నీ చదువు ఎలాసాగుతుంది?

గురువులు చెప్పిన పాఠాలు అర్థమవుతున్నాయా? వారు ఏ పాఠాలు  చెప్పారో ?నీవు ఎంవిన్నావో?ఏమి అర్థం చేసుకొన్నావో ? నీకు బాగా తెలిసిన శాస్త్రంలోని పద్యము చెప్పి దాని భావము వివరించవా! "అని ఆప్యాయంగా కుతూహలంగా అడిగాడు.ఈ రోజుల్లోనైతే progress report (విద్యార్థి ప్రగతి పత్రము)చూపినట్లు. అప్పుడు  ప్రహ్లాదుడు విద్యయొక్క పరమార్థాన్ని ఈ పద్యం ద్వారా మనకు అందించాడు.

ఈ భావాలు ప్రహ్లాదునివే కాదు బమ్మెర పోతనామాత్యునివి కూడా 

"చదివించినను గురువులు

చదివించి ధర్మార్థ ముఖరశాస్త్రంబుల్ నే

చదివినవి గలవు పెక్కులు

చదువులలోమర్మమెల్ల ఛదివితి తండ్రీ!

భావము:-గురువులు నన్ను చదివించారు.ధర్మార్థకామాది ముఖ్యశాస్త్రాలు చదివాను.అంతేకాదు చదువులలోని మర్మాన్ని అంతా చదువుకొన్నా ను.ఇది పద్యభావము.

పైకి చూస్తే ఈ పద్యం చాలా సాధారణంగా కనిపిస్తుంది.తండ్రి అడిగిన ప్రశ్నలన్నిటికి జవాబు చెప్పి,ఒక అదనపు జవాబు చెప్పాడు ప్రహ్లాదుడు.గురువులు చదువు చెప్పడం వారి ధర్మము‌.విధ్యార్థులు విద్యనభ్యసించడం వారి కర్తవ్యం.ధర్మార్థాది శాస్త్రాలు చదవడం తప్పనిసరి. విజ్ఞానమును విస్తృతం చేసుకోవడానికి పెక్కు విషయాలు మనం చదవాలి.వీటన్నిటితో పాటు ఛదువులలోని మర్మాన్ని తెలుసుకోవాలి.స్పూర్తిని పొందాలి.అలా కానప్పుడు విద్యార్థి లోకానికి అశాంతి తప్పదు.ప్రపంచంలోని గ్రంధాలయాలలోని గ్రంధాలన్ని చదివినా, విద్య యొక్క పరమార్థాన్ని తెలుసుకోక పోతే ఆచదువు వ్యర్థము.

అధ్యాత్మిక దృష్టిలేని భౌతికశాస్త్రవిద్యలు వాసన లేని ప్లాస్థిక్ పూలవంటివి.మానలతాదృష్టిలేని భౌతిక విజ్ఞానము పిచ్చివాడి చేతిరాయి వంటిది.

శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంధకోటిభిః

పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం"అని వ్యాసమహర్షి వాక్యం శిరోధార్యం.

"ఆలోఢ్యసర్వశాస్త్రాణి విచార్యచ పునః పునః

ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారయణస్సదా"

సకలశాస్త్రాలు చదవి చదవి తర్కించి తర్కించి  నారాయణుని సదా ధ్యానించండి"అన్నది పురాణోక్తి.ఈ సత్యాన్ని ప్రహ్లాదుడు తెలుసుకొన్నాడు.సర్వం విష్ణు మాయం జగత్తని తెలుసుకొన్నాడు.మనకు తెలిపాడు.ఇదే చదువులలోని మనం తెలుసుకోవలసిన మర్మము.ఇతరులకు తెలుపవలసినదీ యిదే.




చదువు సంధ్యలు

అల్పాక్షరములతో అనల్పార్థచనకు శ్రీకారం తిక్కనామాత్యుడు చుడితే తరువాత దానిని కొనసాగించిన వాడు మన బమ్మెరపోతన్న.పోతన్నకు అది నల్లేరుపై బండినడకే కాదు,వెన్నతో పెట్టిన విద్య. పద్యం చిన్నది.భావమేమో పెద్దది.

హిరణ్య కశిపుడు తన కుమారుడు ప్రహ్లాదుని విద్యాభ్యాసం కావలసిన అవసరం గుర్తించి

"చదవనివాదజ్గుండగు 

చదివిన సదసత్ వివేక చతురతగల్గున్" అని భావించి అందరి తల్లిదండ్రుల వలే తమ కులగురుపుత్రులైన చండామార్కుల చదువుల బడిలో చేర్పిస్తాడు.అలాకొంత కాలము మన ప్రహ్లాదుడు అక్కడ చదివాక,కొడుకు చదువు ఎలా సాగుతుందో పరీక్ష చేద్దామనుకొని ప్రహ్లాదుని పిలిపించి,ఆప్యాయంగా తన ఒడిలో కుర్చుండ బెట్టుకొని ఆప్యాయంగా "నాన్నా! నీ చదువు ఎలాసాగుతుంది?

గురువులు చెప్పిన పాఠాలు అర్థమవుతున్నాయా? వారు ఏ పాఠాలు  చెప్పారో ?నీవు ఎంవిన్నావో?ఏమి అర్థం చేసుకొన్నావో ? నీకు బాగా తెలిసిన శాస్త్రంలోని పద్యము చెప్పి దాని భావము వివరించవా! "అని ఆప్యాయంగా కుతూహలంగా అడిగాడు.ఈ రోజుల్లోనైతే progress report (విద్యార్థి ప్రగతి పత్రము)చూపినట్లు. అప్పుడు  ప్రహ్లాదుడు విద్యయొక్క పరమార్థాన్ని ఈ పద్యం ద్వారా మనకు అందించాడు.

ఈ భావాలు ప్రహ్లాదునివే కాదు బమ్మెర పోతనామాత్యునివి కూడా 

"చదివించినను గురువులు

చదివించి ధర్మార్థ ముఖరశాస్త్రంబుల్ నే

చదివినవి గలవు పెక్కులు

చదువులలోమర్మమెల్ల ఛదివితి తండ్రీ!

భావము:-గురువులు నన్ను చదివించారు.ధర్మార్థకామాది ముఖ్యశాస్త్రాలు చదివాను.అంతేకాదు చదువులలోని మర్మాన్ని అంతా చదువుకొన్నా ను.ఇది పద్యభావము.

పైకి చూస్తే ఈ పద్యం చాలా సాధారణంగా కనిపిస్తుంది.తండ్రి అడిగిన ప్రశ్నలన్నిటికి జవాబు చెప్పి,ఒక అదనపు జవాబు చెప్పాడు ప్రహ్లాదుడు.గురువులు చదువు చెప్పడం వారి ధర్మము‌.విధ్యార్థులు విద్యనభ్యసించడం వారి కర్తవ్యం.ధర్మార్థాది శాస్త్రాలు చదవడం తప్పనిసరి. విజ్ఞానమును విస్తృతం చేసుకోవడానికి పెక్కు విషయాలు మనం చదవాలి.వీటన్నిటితో పాటు ఛదువులలోని మర్మాన్ని తెలుసుకోవాలి.స్పూర్తిని పొందాలి.అలా కానప్పుడు విద్యార్థి లోకానికి అశాంతి తప్పదు.ప్రపంచంలోని గ్రంధాలయాలలోని గ్రంధాలన్ని చదివినా, విద్య యొక్క పరమార్థాన్ని తెలుసుకోక పోతే ఆచదువు వ్యర్థము.

అధ్యాత్మిక దృష్టిలేని భౌతికశాస్త్రవిద్యలు వాసన లేని ప్లాస్థిక్ పూలవంటివి.మానలతాదృష్టిలేని భౌతిక విజ్ఞానము పిచ్చివాడి చేతిరాయి వంటిది.

శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంధకోటిభిః

పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం"అని వ్యాసమహర్షి వాక్యం శిరోధార్యం.

"ఆలోఢ్యసర్వశాస్త్రాణి విచార్యచ పునః పునః

ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారయణస్సదా"

సకలశాస్త్రాలు చదవి చదవి తర్కించి తర్కించి  నారాయణుని సదా ధ్యానించండి"అన్నది పురాణోక్తి.ఈ సత్యాన్ని ప్రహ్లాదుడు తెలుసుకొన్నాడు.సర్వం విష్ణు మాయం జగత్తని తెలుసుకొన్నాడు.మనకు తెలిపాడు.ఇదే చదువులలోని మనం తెలుసుకోవలసిన మర్మము.ఇతరులకు తెలుపవలసినదీ యిదే.



ఆంధ్రమహాభాగవతం దశమస్కంధమున రుక్మిణీ కళ్యాణము ఒక మహోన్నత ఘట్టము.తెలుగు వారందరికీ అభిమాన పాత్రము.పెళ్ళికాని కన్యలు నిష్టతో రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పారాయణ చేస్తే శీఘ్రంగా మంచి భర్తలభిస్తాడనే గట్టి నమ్మకం తెలుగు వారందరికీ వుంది.అలావతెలుగు వారి జీవితాల్లో ముడివేసుకొన్న మధుర భక్తి పూర్వకమైన ముచ్చటైన ఘట్టములో ముఖ్య మైన పద్యము.

రుక్మిణి దేవికి యిష్టములేని వివాహాన్ని నిర్ణయిస్తాడు అన్నయైన రుక్మి.కాని చిట్టి చెల్లెలైన రుక్మిణీ దేవి మనసావాచా కర్మణా శ్రీకృష్ణుని తన భర్తగా స్వీకరించింది.ఆరాధించింది.తనకు యిష్టములేని వివాహసంభ్రమమును

ఆరంభించాడు.రుక్మి.ఆలస్యం ఇక ఎంతమాత్రము పనికిరాదని కృతనిశ్ఛయానికొచ్చిన రుక్మిణీ దేవి,తన మనోగతమును అగ్నిద్యోతనుడనే అతి విశ్వాసం పాత్రుడైన కులపురోహితుని ద్వారా తన సందేశాన్ని పంపిస్తుంది.

తాను పంపిన సందేశం అందిందో లేదో,తనను స్వీకరించడానికి శ్రీకృష్ణుడు వస్తాడో రాడో అని అందోళనతో ఎదురుచూచింది‌.ఆమె ఆందోళణ తొలగించడానికా అన్నట్లు,అప్పుడే ప్రవేశించిన అగ్నిజ్యోతనుడు నల్లనయ్య సందేశాన్ని సంక్షిప్తంగా సమగ్రంగా ఎలా చెప్పాడో విందామా!

"మెచ్చెభవద్గోణోన్నతి,కమేయధానవులిచ్చెనాకు,దా

వచ్చెసుదర్శనాయుధుడు,వాడెసురాసురెల్ల నడ్డమై

వచ్చిన నైనను రాక్షసవివాహమునంగొనిపోవునిన్ను,నీ

సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించె కన్యకా!"

భావము:--కన్యకా!నీ యొక్క ఉత్తమమైన సద్గుణాలను మెచ్చుకొన్నాడు,నాకేమో అపారధనరాసులిచ్చాడు, సుదర్శనాయుధుడైన తానే స్వయముగా వచ్చాడు.సురాసురులందరూ అడ్డమై వచ్చినా రాక్షస వివాహమును తప్పక తీసుకు వెళతాడు.నీ చక్కనైన శీలమూ,అదృష్టము నేడు ఫలించింది అని పద్యభావము.

ఈ పద్యాన్ని ఎత్తుకోవడంలోనే ఒక చమత్కారము దాగుంది.మెచ్చెఇచ్చె,వచ్చె,అనె పదాల ప్రయోగములోనే అందమంతా దాగుంది.శబ్దాలంకారముతో పాటు,సంక్షిప్త చోటు చేసుకొంది.ఎవరికైనా మనం సందేశం పంపించాలను కొన్నప్పుడు(పూర్వకాలంలో టెలిగ్రాములా) తక్కువ పదాలను ఎంచుకోవడం పరిపాటి.

రుక్మిణీ దేవి శ్రీకృష్ణుని రాకకై ఆత్రంగా ఎదురు చూస్తుంది.అలా ఎదురుచూస్తున్నప్పుడు శుభవార్తైనా సంభ్రమము కలగనీయ్యకుండా నీ గుణాలను మెచ్చుకొన్నాడు. మెచ్చుకొన్నవాడు రావడానికెంతసేపు.

కన్యలంతా తల్లి చాటు బిడ్డలు.పైగా రుక్మిణి రాకుమారి.అటువంటి ఆమె తన హృదయసందేశాన్ని తెలిపితే ఏర్పరుచుకొనే ప్రమాదముంది.అటువంటి ప్రమాదమేమీ లేదని నిన్ను మెచ్చుకొన్నాడని ప్రశంసించాడు.

శ్రీకృష్ణడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు,కాబట్టే సుదర్శనాయుధుడనీ,నీవు సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి అవతార"మని  వ్యంగ్యంగా  తెలిపాడు.

పూజకొద్ది పురుషుడు,పుణ్యం కొద్ది పిల్లలు అనే లోకోక్తి వుండనే వుంది.శ్రీకృష్ణుని రుక్మిణి దేవి తనహృదయమందిరమున నందనందనుని నిలిపి ఆరాధించింది.అందకు తగ్గి ఫలితం పొందిందని అంతరార్థము.ఇటువంటి పద్యరచన మహాభక్తశిఖామణి బమ్మెరపోతనకే సాధ్యము.


అవ్వా! ఎంత ఆశ్చర్యమో!

ఆంధ్రమహా భాగవతం దశమ స్కంధం తెలుగువారికి కొంగుబంగారం.బాలకృష్ణుని బాలలీలలు ఎంత విన్నా ,ఎంత చెప్పినా, ఎంతవచదివినా తనివి తీరదు.అవాజ్గ్మానసగోచరుడైన శుధ్ధ పరబ్రహ్మ తత్త్వము బాలుని రూపములో నడయాడిన ఘట్టములో,యశోదా దేవిగోపికల భాగ్యాన్ని పోతన మహాకవి చిన్నికంద పద్యములో ఎంత అందంగా వర్ణించాడో విందాము.

"అవ్వల  నెరుగక మువ్వురి

కవ్వల వెలుగొందు పరముడర్భకుడై

అవ్వలకు సంతసంబుగ

అవ్వా! అవ్వా! యనగ యల్లన నేర్చెన్"

పద్యమే మనలనందరినీ అవ్వా అని ఆశ్చర్యము లో పడవేస్తుంది.ఇక భావము మనలో నెంత ఆశ్చర్యము లో పడవేస్తుందో? 

తనకన్నా వేరెవ్వరూలేనట్టి,బ్రహ్మ,విష్ణు

మహేశ్వరులకు ఆవాలు వెలుగు నట్టి పరతత్త్వము,పసిబాలునిరూపములో

యశోదకుగోపికలకు సంతోషము కలుగునట్లు,అమ్మా!అమ్మా! అంటుముద్దుమద్దుమాటలతో మాట్లాడటం  నేర్చుకొన్నాడు!

ఈ చిట్టి పద్యములో ఎంతమహార్థం దాగుందో!

అచ్చ(జాను) తెనుగు భాషలో  అవ్వా అంటే అమ్మా అని అర్థము.

కాని కొన్ని ప్రాంతాల్లో అవ్వ అంటే నాన్నమ్మ,అమ్మమ్మ అని అర్థంలో  స్థిర పడింది.అదిఅటుండని.

"ఏకమేవాద్వితీయం బ్రహ్మ"అన్నది వేదోక్తి.పరబ్రహ్మ తత్త్వం కన్నా వేరొకటి లేదు.

ఆ పరబ్రహ్మ తత్త్వమే సృష్టి స్థితి లయలను నిర్వహించడానికి త్రిమూర్తులను సృష్టించింది.

ఆ పరబ్రహ్మమే బాలకృష్ణుడై దోగాడుతూ,బుడిబుడినడకలతో ముద్దుముద్దు మాటలతో యశోదా గోపికలను మురిపించాడు.వారంతా అవ్వా! అంటూ ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపడేలా చేస్తున్నాడు బాలకృష్ణడు.

ఆవ్వల అన పదబంధమే చిత్రము.అవ్వల అంటే అతని మాయ అని అర్థము.ఎవరు అతని మాయనుకనుగొనగలరు?



హాలాహల భక్షణము
\\\\\\\\\\\\\\\\\\\\\
ఈ పద్యరత్నము పోతనామాత్యవిరచిత ఆంధ్రమహాభాగవతం అష్టమస్కృందములో విరాజిల్లుతున్నది. క్షీరసాగర మధనం సందర్భములో హాలాహలము ఉద్భవించింది.దేవతలుదానవులు మానవులందరూ భయపడినవారై ,కైలాస పర్వతమును తపోనిష్టలో  నున్న పరమేశ్వరుని సమీపించి "పాహిమాం పాహిమాం" అంటూ శరణువేడారు.వారిమొరవిని కరుణా సింధుడైన పరమేశ్వరుడు పార్వతీ దేవితో
"శిక్షింతు హాలాహలమును
భక్షింతును మధుర సూక్ష్మఫలరసముక్రియన్
రక్షించు ప్రాణికోట్లను
వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖీ"
2హరిమదినానందించిన
హరిణాక్షీ! జగంబులెల్ల నానందించున్
హరియును జగములు మెచ్చే
గరళమువారించుటొప్పు కమలదళాక్షీ?
3‌పరహితము సేయనెవ్వడు
పరమహితుండగును భూతపంచకమునకున్
పరహితమె పరమధర్మము
పరహితునకు నెదురులేదు పర్వేందుముఖీ!
4.ప్రాణేఛ్ఛ వచ్చిచొచ్చిన
ప్రాణులు రక్షింప వలయు ప్రభువులకెల్లన్
ప్రాణులకిత్తురు సాధువు
ప్రాణులు నిమిష భంగురములని మగువా!
5.కంటె జగములదుఃఖము
వింటె జలజనిత విషమువేడిమి ప్రభువై
యుంటకు నార్తులనాపద
గెంటింప వలయుకాదె మృగాక్షీ!
అందమైనయైదు  కందపద్యాల్లో  పంచాస్యుడైన పరమేశ్వరుడు పార్వతీదేవికి "పరోపకార పరాయణులకు పంచభూతములూ గొప్ప స్నేహితులవుతాయట.పరోపకారమే పరమధర్మము.పరోపకారికి ఈ ముల్లోకాల్లోను ఎదురులేదు."అని వివరించాడు.
గరళాన్నికూడా  తియ్యని మధుర సూక్ష్మఫలరసముగా భావించే ఆ పరమేశ్వరుని సమదర్శిత్వం ఈ పద్యమున వ్యక్తమవుతుంది.గరళముకూడా గళాభరణమై దివ్యమౌశోభను సమకూరుస్తుంది "నమోనీలగ్రీవాయ "అని మంత్ర స్వరూపుడైనాడు.ఆ నీలకంఠుని దయాహృదయానికి మేర లేదుకదా! వికచాబ్జముఖివై యీమహోన్నత ఘట్టాని వీక్షింపమని అర్ధనారీశ్వరియైన జగదంబతో ముచ్చటగా ముచ్చటిస్తున్నాడు.
హరిమదినానందిస్తే జగములంతా ఆనందిస్తాయట .ఎందుకంటే  "అంతర్భహిశ్చ తత్ సర్వం వ్యాప్యనారాయణస్థితః" అన్నది వేదోక్తి."విశ్వం విష్ణుః",అన్నది విష్ణసహస్రము.వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం
సర్వభూతనివాసోసి వాసుదేవ నమోస్తుతే " అని ఆ పరాత్పరుని ప్రార్థిస్తాముకదా! అతనికంటే అన్యమేముంది?
హాలాహలవిషమునుకూడా హాయిగా మధురసూక్ష్మఫలరసముగా భావించి సేవించిన పరమేశ్వరుని కరుణకు మేరకలదా?
నీలగ్రీవాయనమఃఅనికీర్తించి మనము మన జన్మను ధన్యముచేసుకొందాము.గరళము కాస్తా గళాభరణమై నీలకంఠునిసేవించింది.విషపానఘట్టాన్ని వికచాబ్జముఖియై వీక్షింపమని జగదంబతో ముచ్చటగా చెప్పుతున్న పరమేశ్వరుని  గడుసుదనం చూడండి.
"అంతర్భహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణస్థితః "అన్నట్లు విశ్వము విష్ణువు తానై యైన నారాయణుడు సంతోషించే విధంగా గరళాన్ని అడ్డగిస్తానని అనడంలో అందముంది.హరి అనే పదానికి  శివుడనే నానార్థము లోక ప్రసిధ్ధి మే.
పరహితము అంటే పరులకు చేసె ఉపకారమనే అర్థముతో పాటు గొప్పదైన మంచిది అనే అర్థమిందులో యిమిడి వుంది.
పరహిత ప్రాపకుల్ సజ్జనుల్  అనే లోకోక్తి వుంది.పృథివ్యప్తేజోవాయురాకాశాలు ఆ భగవంతుని దివ్య శక్తులే.కావున  పరోపకారి పంచభూతములకు హితుడే.పరోపకారమే ధర్మములో కెల్లా గొప్పధర్మము.ఆటు వంటి పరోపకారికి అడ్డమంటూ ఏమీలేదు.
మానవుడు పంచభూతములకు హితడు కావాలంటే పర్యావరణ దృష్టికలిగి యుండాలి.
శరణాగత రక్షణ పరమ ధర్మము.అది ప్రభువులకు ద్రవ్యము.జీవితము క్షణభంగురమని తెలిసిమంచి వారు మంచి వారు ఆత్మత్యాగమునకైనా సిధ్ధ పడుతారు.అని భవానికి వినిపించాడు భవానీ పతి.
భాగవతామృతపానములో లీనమైన పరీక్ష్మహారాజుకు పెద్ద ధర్మసందేహమే వచ్చింది(మన అనుమానం కూడా)
"అమరన్ లోకహితార్థ మంచునభవుండౌగాక యంచిడెబో
అమరులైన భీతిని "మ్రింగవే యనిరివొ
యంభోజగర్భాదులుం
తముగావ "హరో! లెమ్ములెమ్మనిరి"
వో తా జూచికనకంటన
య్యుమ ప్రాణేశ్వరునెట్లుమ్రింగమనె
నయ్యుగ్రానల జ్వాలలన్"
అమరత్వాన్ని కోరుకొన్న దేవతలు భయపడి కాలకూట విషాన్ని"మ్రింగు"మాని కోరారే అనుకో,బ్రహ్మాది దేవతలు తమనుతాము కాపాడుకోవడానికి"ఓ పరమేశ్వరా!లెమ్ము లెమ్ము"అని తొందర పెట్టారంటే అనుకో, ఆపరమశివుడు దయాళువు కాబట్టి లోకాలకు మేలు జరుగుతుంది కదా"సరే"అన్నాడనుకో,పార్వతీ దేవి అభవుడైన తన ప్రాణేశ్వరుడు,ఆమె కనులముందే భయంకరమైన అగ్నిజ్వాలలచే కూడుకొన్న హాలాహలాన్ని చూస్తూ కూడా "మ్రింగ"మని ఎలా చెప్పినది? అని ఫమపరీక్షిత్తుకు వచ్చిన సందేహము మనకు వస్తుంది.
ఇక్కడ "అభవుడు" అంటె పుట్టుక లేనివాడు నిం అర్థము.పుట్టకే లేకపోతే మరణమే లేదుకదా! పైగా పార్వతీ దేవి సర్వమంగళ.
"మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియుగరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంతమది నమ్మినదో!"

ఆమె సర్వమంగళకదా! కామేశ్వరునిచే అలంకరించబడిన సూత్ర శోభిత యైన తల్లి.ఆమెతనమనస్సులో తనమంగ సూత్రాన్ని బాగా గట్టిగా నమ్మింది.కాబట్టే మ్రింగే వాడు తనభర్తే అనీ,మ్రింగేది కాలకూటవిషమని తెలిసికూడా లోకాలకు మేలుకలగాలనే ఉద్దేశ్యంతో పార్వతీదేవి హాలాహలాన్నిమ్రింగమని చెప్పింది.
వారిద్దరు జగతికంతా జననీ జనకులు.జగమంతా వారికుటుంబము.భర్తకేమో భువనభయభంగమునుళపోగొట్టే ఆలోచనలో వుంటాడు‌.అమ్మకేమో విశ్వత్రాణక్రీడన లోల.అంటే విశ్వమునకు వచ్చిన ఆపదను పొగొట్టె క్రిడ అంటే అమితమైన ఆసక్తి.

.


భాగవతం --పరమార్థము

----------------------------------

ఆంధ్రమహాభాగవతం తెలుగువారి పూర్వ పుణ్య ఫలము.పరమపావనమైన భాగవతం ముక్తినిధానము.నశ్వరమైన ప్రపంచ పరిధి దాటి అనంతమైన మోక్షపదమును పొందడము మానవ జన్మకు పరమార్థము.

ఏడు రోజుల్లో మృత్యువు తనను కబళిస్తుందని తెలిసీన పరీక్ష్మిమహారాజు శుకమహర్షిని సేవించి భాగవతా పురాణకథాశ్రవణం చేస్తున్నప్పుడు శుకమహర్షి మానవ జన్మకు గలపరమార్థాన్ని ఇలా వివరిస్తున్నాడు.

ఈ పద్యం ఆంధ్రమహాభాగవతం ద్వితీయస్కందంలోనీది.

"పురుషభవంబు నొందుటయపూర్వము జన్మలందు భూ

సురకులమందు పుట్టుట చోద్యము,యట్లగుటన్ మనుష్యుల

స్థిరమగు కార్యదుర్దశల చేత నశింపక,విష్ణుసేవనా

ప్రతి దనర్చి నిత్యమగుభవ్య పదంబు నొందుటోప్పడే"

ఆహార నిద్రాభయాదులు మానవులకెట్లో ,జంతువులకూ అట్లే.జంతువులనుండి మానవులను వేరు చేయునది జ్ఞానమే.అందుకే సృష్టీలోని సకవజీవరాసుల్లో మానవుని స్థానము అత్యున్నతమైనది.అందుకు కారణముఅతనియుక్తాయుక్త విచక్షణా జ్ఞానమే.అందుకే  ఆదిశంకరులు "జంతూనాం నరజన్మ దుర్లభం'అన్నారు.ఇక్కడ పురుషభవము అంటే మగవాడిజన్మకాదు మానవజన్మ అని అర్థము.ఆ మానవజన్మ లోకూడా ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన భూసురజన్మలభించుట మిక్కిలి కష్టము.అట్టి ఉత్తమ జన్మ లభించినప్పుడు లౌకికకార్యాచేత కర్మబంధనములను కలిగించు దుష్కర్మలచేత జీవనయాత్రను నిష్ఫలముగా గడుపుట మిక్కిలి తప్పు.కర్మాచరణముల చేత లభించే ఫలము శాశ్వతముకాదు కదా!

పుణ్యకర్మలచేత లభించే స్వర్గము దాని సుఖాలు శాశ్వతం కావు."క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి" పుణ్యం క్షీణమైతే తిరిగి మానవజన్మ సంప్రాప్త మవుతుంది.

శాశ్వతము మహోన్నతమైనది,పునర్జన్మ లేనట్టిదీ మోక్షపదమొక్కటే.అట్టి మోక్షపదము పొందుటకు మూలము విష్ణు పాదములను ఆశ్రయించుటే.

ఇట్లు మానవ జన్మను సఫలము చేసుకొమ్మని శుకమహర్షి  పరీక్ష్మహారాజుకు బోధీంచుటద్వారా మనకు మహోన్నత సందేశమిచ్చాడు.మనముకూడా ఆభగవంతుని చరణకములములను ఆశ్రయించి ముక్తిని పొందుదాము.




గజేంద్రమోక్షఘట్టము --1
-------------------------------
గజేంద్రమోక్షఘట్టమును నియమనిష్టలతో  పారాయణం చేస్తే ,దట్టంగా అలముకొన్న కష్టపరంపరలు దూది పింజెల్లా ఎగిరిపోతాయని, సర్వ దోషాలూ శాంతిస్తాయి,ఆర్తి నశిస్తుందని,శుభం పలం ప్రాప్తిస్తుందని తెలుగు వారికి అనూచానంగా వుండే ధృఢవిశ్వాసము.తెలుగు వారందరికీ ఎంతో యిష్టమైన ఘట్టమిది.
భావాల్లో దుఃఖాల్లో కష్టాల్లో చిక్కిశల్యమౌతున్న మానవులకు మకరిచేత చిక్కిన గజేంద్రుడు ఒక ప్రతీక కావచ్చు.
"ఏ రూపంబున దునిగెల్తు,నిటమీదే వేల్పుచింతింతునె
వ్వారిజీరుదు,నెవ్వరడ్డమిక నివ్వారిప్రచారోత్తమున్
వారింపన్ దగువారలెవ్వరఖిలవ్యాపార పారాయణుల్
లేరేమ్రొక్కద దిక్కుమాలిన మొరాలింపన్  ప్రపుణ్యాత్మకుల్"
ఆర్తితో కూడిన గజేంద్రుని దీనాలాపములు  విన్నారుగా!
ఇక ఏవిధంగా ఈ మకరినిగెలువగలను,?నాకు సహాయపడమని ఏదేవతలను ప్రార్థించను?ఎవరిని పిల్లను? ఈ బలిష్టమైన మొసలిని నివారించే వారే లేరా? నన్ను రక్షించే పుణ్యాత్ములు కే ఈ లోకంలో కొరత వచ్చిందా?ఏమి?
ఈ అనాథయైన నామొరను ఇలించమని ఆ దయామయులను మ్రొక్కు తున్నాను.ఇదీ ఈ పద్యభావము.
ఈ గజేంద్రుని వలే కష్టాల సుడగుండాల్లో చిక్కి, మొసళ్ళు కన్నా కౄరమైన మానవమృగాల దౌర్జన్యాలకు నలిగీపోయిన సగటుమనిషి మనో వేదనకు దర్పణము ఈ పద్యము
బుధ్ధి భ్రమించి,సంసార క్లేశములనే సుడిగుండములనే సుడిగుండాలు లో పడిపోరాడుతూ, అజ్ఞాన పాశబధ్ధుడై,ఆ బంధాన్ని విడిపించుకొని లేక,ప్రాణా పాయాన్ని శంకించే జీవునకు సంకేతమే మకరినోట చిక్కిన గజేంద్రుడు.సగటుమనిషి కష్టాలూ కడగండ్లూ వచ్చినప్పుడు పురుషప్రయత్నముతో  వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు.తన ప్రయత్నాల్ని వ్యర్థమై ఏదిక్కు కనుచూపు మేరలో కనిపించినప్పుడు తనను రక్షించే వారెవరా అని అన్వేషిస్తాడు. తైత్తిరీయోపనిషత్తు పేర్కొనట్లుగా "భీషాద్వాతః పవతే ,భీషోదేతి సూర్యః మృత్యః ధావతి పంచమయితి" ఎవరికీ భయపడి గిలి వీస్తుందో ,ఎవరీకి భయపడి సూర్యుడు ఉదయిస్తాడో,ఎవనికి భయపడి మృత్యువు పరుగులు తీస్తుందో,అట్టి సర్వలోక నియంత, సర్వేశ్వరుడే నాకు దిక్కు.అతనినే నేను శరణువేడతాను.అతడే నాకు దిక్కు అతనినే ప్రార్థిస్తానని గజేంద్రుని నిశ్చయించుకొన్నననాడు



సదసత్సంశయము

"ఏదైనా మంచి జరిగితే అది తనఘనత.తలచింది జరగకపోతే అది విధివిలాసము,ఇది మానవుని తలుపు.పూర్వ కర్మవశమున మానవుడు కష్టపరంపరలలో చిక్కుకొని,నైరాశ్యములో మునిగి దేవుడు లేడు,లేడుగాక లేడు.దేవుని యస్తిత్వం ఒక భ్రమ.దేవుడనే వాడుంటే ప్రపంచం ఇలా అఘోరిస్తుందా!"

అని వెర్రితలపులు పోతు నేను చేసే పూజలు ,వ్రతాలూ,జపతపాలు అన్ని వ్యర్థమూ,నిర్థకము అని అనుకొంటు వుంటాడు.అట్టి మానవునకు సంకేతమే ముసలినోటికి చిక్కిన గజేంద్రుడు.

ఈ భావాన్ని బమ్మెర పోతన అందమైన కందపద్యములో చిత్రించాడు.

"కలదండురు దీనులయెడ

కలదండురు పరమయోగిగణములపాలన్

కలడందురన్నిదిశలను

కలడుకలడనువాడు కలడో లేడో"

దీనుల రక్షింపుము ఆదేవుడున్నాడు.ఆదేవదేవుడే పరమయోగిగణముల హృదయాధినాథుడై ఉన్నాడు.అన్నిదిక్కులందూ ఉన్నాడనియంటూవుంటారు.అట్టి ఉన్నాడనే వాడు, ఉన్నాడా? లేడా?" అని గజేంద్రుడు తనలో తానే ప్రశ్నించుకొన్నాడు.

మానవాళికి ప్రాచీన కాలము నుండీ భగవంతుని అస్తిత్వాన్ని తెలుసుకోవడానికి చేసె ప్రయత్న పరంపరను ఈ పద్యం గుర్తుకు తెస్తుంది.

దేవుడున్నాడని నమ్మేవారిని ఆస్తికులంటారు‌.దేవుడు లేడనే వారు నాస్తికులు.వీరిద్దరికీ జరిగే సంవాదము అతి ప్రాచీనము.

ఆస్తికులేమో దీనజనరక్షకుడు,యోగిహృదయాది నాథుడుయైన దేవుడున్నాడనిఅతడు సర్వవ్యాపకుడని సోదాహరణంగా వివరిస్తారు. నాస్తికులు కూడా తమగతితార్కిక భౌతిక వాదపు బలముతో, హేతువాదమంటూ దేవుడు లేడని వాదిస్తారు.

దేవుని అస్తిత్వాన్ని ఆస్తికుల్లా  అంగీకరించలేదు,దేవుడు లేడని వాదించే నాస్తికుల వాదమును బలపరచలేక ,త్రిశంకు స్వర్గం లాంటి ఆగ్నేయ వారములో కొందరు బ్రతికేస్తుంటారు.

మనగజేంద్రడుకూడా కార్డు కలడనెడివాడు కలడో లేడో అని సదసత్సయంలోకి జారి, తిరిగీ కలిమి లేములు లేక కలిగిన వాడిని,దుష్టశిక్షకుడు,శిష్ట రక్షకుడైన భగవంతుని వినడే,చుడడే,తలపడే, వేగరాడేయని వేయి కన్నులతో ఎదురు చూస్తున్నాడు.

ఎంతటి గొప్ప భక్తునికైనా,ఎప్పుడో ఒకప్పుడు సందేహం రాక తప్పదు‌.

అలా సందేహము కలిగించిన దేవుడే భక్తుని పరిపూర్ణంగా పరీక్షించి అనుగ్రహిస్తాడు.అది గజేంద్రనకైనా సరే మరో భక్తుడికొన సరే.


ప్రహ్లాద హిరణ్యకశప సంవాదము

√√√√√√√√√√√√√√√√√√√√


ఆంధ్రమహాభాగవతం భక్తి సుధా లహరి.అందులో ఏ ఘట్టం స్మరించి నా మనం ఆనందంతో పులకించిపోయారు.మీదు మిక్కిలి సప్తమస్కంధంలోని ప్రహ్లాద వృత్తాంతము భక్తి తత్త్వానికెత్తిన వైజయంతిక.శుకమహర్షి భక్తుడంటె ఎలా వుండాలో ప్రహ్లాదుని భక్తి తత్త్పరతను వివరించడం ద్వారా సమస్త విశ్వానికి వివరించారు.భక్తితత్త్వంలో శుకమహర్షి ప్రహ్లాదులిద్దరూ సమ ఉజ్జీలే.ఆదర్శవంతమైన భక్తుని లక్షణాలు ప్రహ్లాదునిలో ఇలా చక్కగి ఇమిడిపోయాయో చూద్దాము.

"తనయందు నఖిలభూతములయందును

నొకభంగి సమహిత్త్వంబున జరుగువాడు

పెద్దల పొడుగున్న భృత్యని కైవడి

చేరినమస్కృతులు చేయువాడు

కన్నుదోయికినన్యకాంతలడ్డంబైన మాతృ

భావనసేసి మరులువాడు

తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను

దీనులకావ చింతించువాడు

తే.గి.సముల రెండు సోదరస్థితి జరుపుతాడు

దైవతములంచు గురువులు దలచువాడు

లీలలందునుబొంకులు లేనివాడు

లలిత మార్యాదుడైన ప్రహ్లాదుడధిప!"

తనయందూ అఖిలప్రాణులయందూ సమభావమునే కాక హితము కలుగునట్లు నడుచుకొనువాడు.పెద్దలు యెదురైనచో సేవకునివలె నమస్కారములు చేసి గౌరవించేవాడు ప్రహ్లాదుడు.తన కన్నులకు అన్యకాంతలు ఎదురైనచో మాతృభావనతో గౌరివించి పూజించేవాడు.దీనులూ,అనాథలు ఎదురైనచో వారిని తల్లిదండ్రుల వలె మిక్కిలి గౌరవాదరములతో ఆదుకొనేవాడు.తనతోటివారిని సోదరులు వోలె గౌరవించే వాడు.గురువులను దేవతల వలె భావించేవాడు.కొంటెతనముతో కూడా అసత్యం పలికేవాడు కాడు.ఇలా లలితమర్యాదుడైన ప్రవర్తనతో ప్రహ్లాదుడు విరాజిల్లుతున్నాడు.

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యోగి లక్షణాలు తెలుపుతూ "సమత్వం యోగముచ్యతే" అని సిధ్ధాంతీకరించారు.ఇది స్థితప్రజ్ఞుని లక్షణము.అలానే భగవద్గీతలో పండితాః సమదర్శినః అన్న మాట మనకు వేదవాక్కు.ఇక సమదర్శిత్వంతో బాటు హితమెనరించడం అందులో భాగమే.

ఆత్మవత్ సర్వభూతాని యః పశ్యతి స పశ్యతి అన్ని శాస్త్రవాక్యాన్ని స్మరించాలి.

వైష్ణవ ధర్మంలో అకించనత్వం,శేషభావము అతి ముఖ్యము.అందుకే ప్రహ్లాదుడు పెద్ధలెదురైతే దాసభావముతో వ్యవహారించే చక్కని వైష్ణవుడు.

జగత్తులో గల స్త్రీలను జగన్మాతగా చూడటం అత్యున్నత భారతీయ ధర్మము.విద్యలన్నీ జగన్మాతకళలే.స్త్రీలందరూ జగన్మాత స్వరూపాలే  అనిదేవీ మహాత్మ్యం నొక్కి చెప్పింది.

"మాతృదేవో భవా! పితృదేవోభవా" అన్నది వేదము.తల్లిదండ్రులను ప్రేమగా భక్తిగా చూడటం అత్యంత సహజము.ఇందులో ఆశ్చర్యమేమీలేదు.కానీదీనులనుకూడా తల్లిదండ్రుల్లా చూడటంలోనే ప్రహ్లాదుని గొప్పదనముంది.

"దరిద్రదేవో భవ,మూరచఖదేవో భావ"అన్నారు స్వామీ వివేకానందులు.దరిద్రులనూ,మూర్ఖులు దేవతలుగా భావించి సేవించు,జీవసేవయే ఈశ్వర సేవ"అనే గొప్ప నినాదాన్ని గుర్తించుకోవాలి.దీనులను దేవతలుగా భావించడంలో నే ప్రహ్లాదుని దీనవత్సలత యిమిడివుంది ."సత్యం వద"అన్న వేదోక్తి విశిష్టతను తెలుసుకో వడంళవల్లే ప్రహ్లాదుడు ఏమరపాటుగానో ఆటకాయతనంతోను అసత్యం ఆడేవాడు కాదు.ఎందుకంటే భగవంతుడు సత్యస్వరూపుడు.సత్యం భగవంతుని స్వరూపాలక్షణము.తనతోటివారిని సోదరులుగా  భావిస్తూ.గురువులను ఆచార్యలను దేవతలుగా భావించి పూజించడం భారతీయ సనాతన ధర్మాలకు చేసాము.అందుకు మన ప్రహ్లాదుడు నిలువెత్తునిదర్శనము.



 భక్త భాగవతా భగవాన్----

ఆంధ్ర మహాభాగవతము భక్తి ఉద్యమానికెత్తిన కీర్తి పతాక.అందులో సప్తమస్కంధం భక్తజనావళికి కొంగుబంగారము.అందులో ప్రహ్లాద హిరణ్యకశప సంవాదము విజ్ఞాన భండారము.ఆ సంపదలో మనకూ భాగస్వామ్యమిప్పించాడు పోతన మహాకవి.కావున ఆసంపదనను మనమూ స్వంతం చేసుకొందాము.

"సంసారజీమూతసంఘంబు విచ్చునే

చక్రిదాస్యప్రభంజనములేక

తాపత్ర యాభీలదావాగ్నులారునే

విష్ణసేవామృత వృష్టిలేక

సర్వంకషాఘమౌ జలరాసులింకునే

హరిమనీషా బడబాగ్నిలేక

ఘనవిపద్ఘాంధకారంబులణగనే

పద్మాక్షునుతిరవప్రభలు లేక

నిరుపమాపునరావృత్తినిష్కళంక

ముక్తి నిదిగాను వచ్చునెముఖ్యమైన

శార్గ కోదండ చింతానంజనములేక

తామరసగర్భునకునైన దానవేంద్ర"

భావము:--సంసారమనెడి కారుమబ్బులగుంపులు తొలగాలంటే చక్రధారిసేవయనెడి ప్రభంజనముకావాలి కదా!

తాపత్రాయలనే పెద్దకార్చిచ్చులు చల్లారాలంటే విష్ణు సేవ అనే అమృతవృష్టికావాలి.అప్పుడే ఆ భయంకరమైన దావానలం చల్లారుతుంది.పాపరాశులతో కూడుకొన్న జలరాశులు యింకిపోవాలంటే హరిమనీషా బడబాగ్ని కావాలి.హరీ అంటే అన్నిపాపములూ హరించువాడు కదా!అందుకే శ్రీహరినామస్మరణకావిస్తే ఆపదలనే పెద్దచీకట్లు తొలగిపోతాయి.హరినామసంకీర్తన అనే కాంతితరంగాలు కావాలి.

వ్యాఖ్య:-

దానవేశ్వరా! అని పుత్రడు తండ్రిని సంబోధించడం కొంచెం విచిత్రంగా అనిపించ వచ్చు.కానీ అది నిజము.నిజం నిష్టూరంగా తోచినా నిజము నిజమే.దానవులు అంటే దమములేనివారు.దమము అంటే ఇంద్రియనిగ్రహము లేకపోవడం దానవ లక్షణము.ఇంద్రియనిగ్రహంకోల్పోయి అహంకరించడము,తమోగుణముతో చెలరేగిపోవడం దానవలక్షణము.దానవలక్షణమే ఇలావుంటే ఇకదానవరాజైన హిరణ్యకశిపుని గురించి అడగవలసిన పనేమమిటి? దానవుల్లోనే కాదు మానవుల్లో కూడా యీలక్షణాలు కలవారు ఉంటారు.మానవుల్లో కూడా తమోగుణప్రధానులూ,ఇంద్రియనిగ్రహం లేనివారిని గురించి ప్రహ్లాదుడు ఈ విధంగా హెచ్చరించి, విష్ణుభక్తి వలనే ముక్తి లభిస్తుందని స్వాంతనను అందించాడు.

సూర్యని నుంచి ఉత్పన్నమైన మేఘాలు‌ సూర్యని కప్పివేస్తున్నట్లు ఆత్మను మాయమేఘాలు కప్పి వేస్తాయి.సహస్రసూర్య సంకాశుడైన చక్రధారి సేవ వల్లనే మాయామేఘాలు తొలగిపోతాయి. ఈమాయాశక్తినే వేదాంతులు ఆవరణశక్తి అంటారు.

దారేషణ,పుత్రేషణ,ధనేషణ అనే ఈషణత్రయాలు, ఆది భౌతిక,ఆదిదైవిక ఆధ్యాత్మిక తాపాలు మానవుని దహించి వేస్తున్నాయి.అలాంటి తాపాలూ బాధలూ తొలగాలంటే విష్ణు సేవ అనే అమృతం జడివానలా కురవాలి.అప్పటిగానీ ఈతాపాలు చల్లారదు.

సముద్రాల్లాంటి పాపాలు మానవుని పతనోన్ముఖులను చేస్తాయి. అలాంటి పాపరాశి యింకిపోవాలంటే హరిమనీషా బడబాగ్ని వుండి తీరాలి.బడబాగ్ని సముద్రంలోనే దాగుంటుంది. అలానే భగవంతండు మనలోనే దాగున్నాడు.అతడిని పట్టుకోవడంలో నే చాకచక్యం వుంది.

కారుచీకట్లలాంటి ఆపదలు మనలను చుట్టుముట్టినపుడు అజ్ఞానాంధకారములో జీవుడు కూరుకు పోయినప్పుడు కమలాప్తుని కిరణసహస్రంవల్లే  ఆచీకట్లు తొలగి జ్ఞానోదయం కలుగుతుంది."తమసోమా జ్యోతిర్గమయా"అనే వేదోక్తి వుండనే వుంది.భగవంతుని గుణగానం అనే కాంతి మనకుదారి చూపుతుంది.నిధులను నిక్షేపాలను గుర్తించాలంటే అంజనం కావాలికదా!

అంతరంగమందు దాగున్న ఆత్మస్వరూపుడైన పరమాత్మను దర్శించాలంటే,జన్మరాహిత్యమనే  నిధిని పొందాలంటే  శాంర్గ‌కోదండములను ధరించిన శ్రీమన్నారాయణుని చింతనాంజనమును ధరించాలి."అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా"అన్న గురుస్తుతిని స్మరించాలి.

ఈ పద్యంలో నవవిధభక్తిమార్గ స్ఫురణ దాగుంది.



హిరణ్యాక్షవరాలు కావు హిరణ్యకశిపువరాలు

------------------------------

లోకంలో అసాధ్యమైన గొంతెమ్మకోరికలకు హిరణ్యాక్ష వరాలనే పలుకుబడుంది.కాని అసలు హిరణ్య కశిపునకే ఆ క్రెడిట్ దక్కాలి.అది ఎలానో చూద్దాము.తన సోదరుడైన హిరణ్యాక్షు మరణానంతరము శ్రీహరిపై పగబూని,ప్రతీకారంతో రగిలిపోతూ తనకు మరణము లేకుండా వరం పొందడానికి విధాతను గురించి తీవ్రమైన తపమాచరిస్తాడు హిరణ్యకశిపుడు. నలువ అతని తపమునకు మెచ్చి "ఏమివరముకావాలో కోరుకొ"మ్మని అనుజ్ఞ నివ్వగా

"గాలింగుంభిని నగ్ని నంబువుల నాకాశస్థలిన్ దిక్కులన్

రేలన్ ఘస్రములన్ దమఃప్రభల భూరిగ్రాహ రక్షోమృగ

వ్యాళాదిత్యనరాది జంతుకలహవ్యాప్తిన్ సమస్తశ

స్తోత్రాన్ని నుంచి మృత్యువు లేని జీవనము లోకాధీశ యిప్పింపవే"

సమస్తలోకాలకు అధిపతియైన ఓ బ్రహ్మదేవా!గాలిలొగానీ,నేలమీద గానీ,నిప్పుతో గానీ,నీటితో గానీ,ఆకాశంలో గానీ,నేలమీద గానీ,దిక్కులలో గానీ,రాత్రివేళ కానీ పగటి వేళ గానీ, చీకటిలోగానీ,వెలుగులో గానీ,జంతువులచేగానీ,జలజంతూవులతోగానీ,పాములచేగానీరాక్షసులచేగాదేవతలూమానవులు మున్నగువారి తో యుద్ధంలో సకలశస్త్రాస్త్రాలచే గానీ మరణం లేని వరము నిమ్ము అని వరమడిగాడు

అంటూ అసాధ్యమైన పెద్దవరాలనే కోరుతాడు.అందుకు విధాత కొంచెం ఆశ్చర్యపోయాడు.కాని అతని తపమునకు మెచ్చుకొన్నారు వల్ల వరమీయక తప్పలేదు.

ఈ వరమును జాగ్రత్త గా వాడుకొంటే నీతలరాత మారుతుందని సూచిస్తాడు.ఆ సూచన హిరణ్యకశిపుని కే కాదు,ఆధునిక విజ్ఞానశాస్త్రముతో విర్రవీగె మనకు వర్తిస్తుంది.ఈ సందేశాన్ని మానవాళికి దారికి అందాలి.



బ్రహ్మదేవ హిరణ్యకశిప సంవాదము

--------+++---+++-------------++---+-

"అన్నా! కశ్యప పుత్ర! దుర్లభములీయర్థంబులెవ్వారికిన్

మున్నెవ్వారలు కోరరీవరములన్ ,మోదించిన్నీయెడన్

నన్నున్ గోరినవెల్లనిచ్చితి ప్రవీణత్వంబుతో బుద్ధి సం

పన్నత్వంబున నుండుమీ సుమతివై భధ్రైకశీలుండవై"

బ్రహ్మదేవుని అందమైన సందేశాన్ని విన్నారుగా! ఇక భావానికొద్దాము."నాయనా! హిరణ్యకశిపా!నీవడిగిన ఈ వరములన్నీ దుర్లభములు.ఇట్టి అసాధ్యమైన వరాలను ఇంతకుముందు ఎవరూకోరలేదు.నీవుచేసిన ఉగ్రతపమునకు నేను మెచ్చాను.అందుకే నీవు కోరిన వరములన్నీ యిచ్చాను.నేర్పుతో బుధ్ధిసంపన్నతతో,మంచిబుధ్ధికలవాడవై జాగ్రత్తగా జీవించు.

భావాన్ని విన్నారుగా ,ఇక వ్యాఖ్యాననికి  వద్దాము.హిరణ్యకశిపుని ఉగ్రతపమునకు మెచ్చి విధాత వరములిచ్చాడు.అంతేకదాఅని అనిపించ  వచ్చు. కానీ బ్రహ్మదేవుని సందేశంలో గొప్ప అంతరార్థము దాగుంది.కశ్యప ప్రజాపతి సంతానమైన హిరణ్యకశిపుడు తనకు మనుముడౌతాడు .అందుకే వాతల్యభావముతో అన్నా అని అనురాగము తో ఆప్యాయతో సంబోధించాడు.ఇంతవరకు ఇటువంటి వారములు ఎవరూ కోరలేదు.ఇవన్ని దుస్సాధ్యములు. వీటికై నీవు ఉగ్రతపమాచరించావు.నీవుళచేసిన తపస్సు నాకు సంతోషాన్ని కలిగించింది.అందుకే నీకు అసాధ్యమైన వరాలను అనుగ్రహిస్తున్నాను.వీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోమంటు ముఖ్యమైన మూడు సలహాలనిచ్చాడు. బుధ్ధిసంపన్నత, భద్రైక శీలత్వము,ప్రవీణత్వము,అన్నవి ఆ విశేషణాలు.మానవులకు మొదటకావలసింది సుమతిత్వము.అంటే మంచిబుధ్ధికలిగి వుండటము. అదివుంటే  బుధ్ధిసంపన్నత, భద్రైక శీలత్వము, ప్రవీణత్వముదానిని అనుసరించి వస్తాయి.దుర్మార్గులకు కూడా బుధ్ధిసంపన్నత ప్రవీణత్వములంంటాయి.వాటి వారు దుర్వినియోగము చేసే ప్రమాదముంది.అందుకే సుమతిత్వము  కావాలి. 



మానవ జీవితం -ప్రహ్లాదుని దృష్టికోణం-------------------------------

మానవ జీవితం చాలా చిత్రమైనది.తలచుకొంటే మానవుడు మాధవుడు కావచ్చు.జీవనం నిత్యసంఘర్షణలమయము.ప్రకృతిశక్తులను బాహ్య ప్రకృతిని విజ్ఞాన శాస్త్ర సహాయముతో ఎదిరించి పోరాడాలి మానవుడు ఎంతో ఎదిగిపోయాడు.

మానవుడు బాహ్య శత్రువులను ఎదిరించి పోరాడాలి విశ్వ విజేత అయ్యాడు.అలాంటి విశ్వవిజేతల్లో హిరణ్యకశిపుడు ఒకడు.అతడు తన పుత్రుడైన ప్రహ్లాదుని దండిస్తూ"అన్ని లోకాలను జయించాడు,అష్టదిక్పాలరనుయింద్రుని జయించాడు.లోకంలోని వారందరు నేనే దిక్కని భావిస్తున్నారు.నాకంటే బలవంతుడే లేరు" అని అహంకారము తో దర్పించి పలికిన తండ్రి అమాయకత్వానికి చలించి ప్రహ్లాదుడు"నీలో నీకు తెలియకుండా దాగిన ఆరుగురుశత్రువులున్నారు.వారిని జయించావా "అని ప్రశ్నిస్తూ

"లోకములన్నియున్ గడియలోన జయించినవాడు నింద్రియా

నీకు చిత్తముంగెలువ పేర్లు,నిన్నునిబధ్ధుజేయునీ భీకర

శత్రులార్వర ప్రభిన్నులుజేసిన ప్రాణికోటి లో

నీకువిరోధిలేడొకడు నేర్పునజూడుము 

దానవేశ్వరా!"

లోకాలను గడియలోనే జయించాడు.కాని నీవు నీలోని పంచేంద్రియాలను మనసును గెలువలేదు.నీలో నీకు తెలియకుండా భయంకరమైన ఆరుగురు శత్రువులు న్నారు.వారిని నీవు జయించలేదు.నీవు నీలో వున్న ఆరుగురు శత్రువులను నేర్పుతో చూస్తే నే కనబడతారు.

తండ్రిని కొడుకు "దానవేశ్వరా!" అని సంబోధించడంలో ఒక విశేషముంది.హిరణ్యకశిపుడిలోనే కాదూ,మనలో కూడాఅహంకారముతోవిర్రవీగె మానవరూపములోనున్న దానవులు న్నారు. వారందరికి ఈ పద్యము కనువిప్పు కావాలి.కామక్రోధలోభమోహమదమాత్సర్యాలు,చాలా భయంకరమైనవి.ఇంద్రియసుఖాలు మనలను దారితప్పిస్తాయి.

వీటిని జయించిన వాడు భగవంతునకు చాలాదగ్గరవుతాడు,ఇష్టుడవుతాడు.అప్పుడు ప్రపంచాన్ని ద్వేషముతో పగతోకాక ప్రేమతో జయించవచ్చు.



ప్రహ్లాద హిరణ్యకశిపు సంవాదము

---------------------------------------------

పోతన సహజకవి.భగవంతునికృపాసముద్రంలో ఓలలాడిన వాడు,కాబట్టే అతని ప్రతి అక్షరమూ భక్తి రసాయనమే.అనంతమైనట్టి,గహనమైనట్టి తత్త్వరహస్యాలను కూడా చిన్నిచిన్ని ఉదాహరణలచే ద్రాక్షా పాకసమముగా వివరించుటలో పోతన దక్షుడు.

పోతన సహజకవి అయినట్లే ప్రహ్లాదుడు సహజభక్తుడు.భక్తి అతనికి నైజమనీష‌.గురువులు చెప్పని అధ్యాత్మిక  విద్యను నీకెవరు నేర్పాలని తండ్రియైన హిరణ్యకశిపుడు గద్దించాడు.

"ఏమాత్రము కల్తీలేని అసలు సిసలు అజ్ఞానాంధాకారములో కూరుకు పోయి,ఆహారనిద్రాభయాదులలో కూరుకుపోయి గృహవ్రతులైనారు.విషయాసక్తులై చర్విత చర్వణులై(నమిలిన పిప్పినే నమిలేవారు) ప్రవర్తిస్తున్నారు.అట్టివారికి పరులు చెప్పినా,నిజేఛ్ఛతో నైనా,అడవులకు వెళ్ళిన వారికి హరిప్రబోదములు వినిపిస్తాయా?  వారిలో  మిర్పువస్తుందా?"అని జాలితో ప్రహ్లాదుడు తపించిపోయాడు.అందుకే తండ్రియైన హిరణ్యకశిపుని నిమిత్తము చేసుకొని

"కానని వానినూతగొనికాననివాడు విశేషవస్తువుల్

కాననిభంగి కర్మములుగైకొని కర్మబధ్ధులై

కానరు విష్ణుగొందరట గందురకించిన వైష్ణవాంఘ్రిసం

స్థానరజోభిషిక్తులగుసంహృతకర్ములు దానవేశ్వరా!"

గ్రుడ్డివాడు మరోగ్రుడ్డివాడికి ఎలా ఏవస్తువునూ చూపలేడో,అలానే కర్మిష్టులు కర్మలనాచరిస్తూ కర్మబధ్ధులై ఆ పరాత్పరుడైన విష్ణవును దర్శింపలేరు.అకించనులైన కొందరు వైష్ణవభక్తుల పాదం ధూళిచే అభిషేకింబడిన వారై,దహించబడిన కర్మలు కలవారై విష్ణువును దర్శింతురు.వారి అదృష్టమును పొగడటానికి ఎవరికి తరమౌతుంది?


వెదికిచూడపనిలేదు-

"ఇందుగలడందులేడని
సందేహము వలదు సర్వోపగతం
డెందెందు వెదికిచూచిన
యందందే కలడు దానవాగ్రణి! వింటే"
చిన్ని పద్యంలో అనంతమైన అర్థమిమిడ్చాడు బమ్మెర పోతన.
దేవుడెక్కడ వున్నాడో చూపమని తండ్రియైన హిరణ్యకశిపుడు  గద్దిస్తు ప్రశ్నించాడు.అందుకు ప్రహ్లాదుడు సర్వజనావళికీ ఆహ్లాదం కలిగించి ఊరటనీచ్చే జవాబు చెప్పాడు.
ఇక్కడవున్నాడా అక్కడ వున్నాడా దేవుడు అని ప్రశ్నించనక్కరలేదు. చక్రధారి సర్వవ్యాపకుడు ,ఎక్కడ వెదికినా అక్కడె కనిపిస్తాడు.నీవుదానవాగ్రణివి నీవునామాట వింటె అని ముక్తాయిస్తాడు. దేవుడెక్కడవున్నాడో అనే ప్రశ్నకు దేవుడెక్కడలేడో చూపించు అనేది సమాధానమైనది.
దేవునిఅస్తిత్వాన్వేషణ అనేది ఇప్పటిది కాదు.అది ఎంతో ప్రాచీనమైనది. ఇంద్రియగోచరముకాకపోవడంతోనే దేవుని అస్తిత్వం పై సందేహాలు బయలుదేరాయి.
అందుకు మనపూర్వులు వేదాలు శాస్త్రాలు ఇతిహాసాలు పురాణాలు సప్రమాణంగా దేవుని అస్తిత్వాన్ని సప్రమాణంగా నిరూపించాయి.
"ఈశావాస్యమిదం సర్వం"అని ఈశావ్యాసోపనిషత్తు ఈశ్వరునిచే ఈ సర్వం వ్యాపించినదని తెలిపింది.
"అంతః బహిశ్చసర్వం వ్యాప్య నారాయణ స్థితః" అని మహానారాయణోపనిషత్ నిగ్గు తేల్చింది. ఈ సృష్టిలో లోపల వెలుపలా అంతటి నారాయణుడే వున్నాడు అన్నది స్పష్టము.
"ఈశ్వరసర్వభూతానాంహృద్దేశో అర్జున! తిష్టతి"అన్నది శ్రీమద్ భగవద్గీత.కావున భగవంతుడెక్కడలేడు.? "వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం
సర్వభూత నివాసోసి  వాసుదేవ నమోస్తుతె"అంటుంది విష్ణుసహస్రము.
"అణోరణీయాన్ మహతోమహీయాత్"
పిపీలకమునుంచి బ్రహ్మాండవరకు అతని లేని చోటు లేదు.అని వేదాలు ఉపనిషత్తులు పురాణాలూ చెప్పిన మాటను వినమంటాడు."వింటె"అనే మాటలోని విశేషమదే. పురాణం కాలములోనే కాదు శ్రీరామకృష్ణపరమహంసాదులు భగవద్దర్శన భాగ్యం పొందడమే కాక ఇతరులకు దర్శన భాగ్యం కలుగజేసిన వైనం మనకు తెలుసు.
అందు,ఇందు,ఎందెందు పదాలు ద్వారా భగవంతుని సర్వవ్యాపకత్వ ప్రతిపాదన చేశాడు బమ్మెర పోతన.
గురువులు మాట శాస్త్రముల వింటె వెదికి చూడనక్కరలేకుండానె  మనకు భగవద్దర్శనం కలుగుతుంది

భీష్మస్తవరాజము

------------------------

ఆంధ్ర మహాభాగవతం ప్రథమస్కంధం నవమాధ్యాయములో వెలసిన భీష్మస్తవరాజము వేదమూర్తులైన మా నాన్నగారికి అనుదినం ప్రాతఃకాలన పఠనీయమైనది భీష్మస్వరాజము.దీనితో పాటు గోపికా గీతాలు,గజేంద్రమోక్షఘట్టము అనుసంధానించే వారు.అలా భాగవతపద్యాలతో నాకు పరిచయం ఏర్పడింది.

భీష్మ పితామహుడు నిష్కాముడై విశుధ్ధమైన ధ్యానవిశేషముచేత నిరస్తదోషరహితుడై శ్రీ కృష్ణ పరబ్రహ్మను ఈ రీతిగా ప్రార్దిస్తున్నాడు.

"త్రిజగన్మోహన నీలకాంతితనువుద్దీపింప ప్రాభాతనీ

రజబంధుప్రభమైన చేరాము పయిన్ రంజిల్ల నీలాలక

వ్రజసంయుక్త ముఖారవిందం మృతి సేవ్యంబై విజృంబింపమా

విజయున్ చేరెడు వన్నెలాడు మదినావేశించు నెల్లెప్పుడున్"

భక్తిసుధారసములో నిండిన అందమైన పద్యమును కర్ణరసాయనముగా విన్నా చదివినా మనసంతా పులకించి జన్మధన్యమౌతుంది.ఇక భావామృతములో మునకలేద్దామా! 

ముల్లోకాలను మోహింప చేయునీలకాంతితో తనువు ప్రకాశింప గా,ఉదయించే సూర్యుని ఎండవలె ఉత్తరీయము ఎర్రని కాంతులతో ప్రకాశింప గా,నల్లనిముంగురలతో కూడిన ఆముఖపద్మము సేవింపదగినదిగా విజృభింపగా మా విజయుని సమీపించాడు అందగాడైన మహానుభావుడు నొమనస్సులో ఆవేశించాలి.

ఇది భీష్మ ప్రార్థన.

ఈ పద్యమునకు ఆధారమైన వేదవ్యాస విరచిత మూలశ్లోకమును ఒకమారు అనుసందిద్దాము.

"త్రోభువనకమనం తమాలవర్ణం

రవికరగౌరవాంబరం దధానే

వపురలకకులావృతానబ్జం

విజయసఖే!రతిరస్తుమే అనవద్యా!"

భీష్ముడు పరమేశ్వరుని మనసునిలుపుకొనెడు  నిశ్చయజ్ఞానము కల్గిన బుద్ధిని సమర్పించిన వాడై,ఆ పరమేశ్వరుని పరమాత్మను పరబ్రహ్మమును దర్శించాడు.

శ్రీకృష్ణుని దేహకాంతి నీలము.అదిమామూలు నీలమా! కానేకాదు.మూడులోకాలను మోహములౌ ముంచకలిగినకాంతి.ఆ ఆకాశమూ నీలమేల.ఆ ఆకాశమునుంచే కదా సకలచరాచరసృష్టి అంతా వచ్చింది.శ్రీకృష్ణుడే కదా ఆదికర్త శ్రీకృష్ణునిఎర్రని ఉత్తరీయము అరుణారుణవర్ణశోభితము.సూర్యోదయము దైవ ప్రజ్ఞ కు. సంకేతము.విజయని చేరెడు వన్నెలాడు విజయం ఇప్పించడానికే అక్కడున్నాడు.

"యత్రయోగీశ్వరకృష్ణో యత్రపార్థో ధనుర్ధః

తత్రశీ విజయో భూతిః ధృవానీతిర్మతిః మతిర్ మమ"అన్న భగవద్గీత సందేశము అదే


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత