వందే వాల్మీకి కోకిలం
"వందే వాల్మీకి కోకిలం"
శ్రీమద్రామాయణం మహాకావ్యం.వాల్మీకి మహర్షి ఆదికవి.కొందరు రామాయణమును ఓతిహాసమంటారు."ఇతిహాసం"అంటే ఇది ఇలా జరిగిందని అర్థం.ఇతిహాసం అంటే ప్రాచీన చరిత్ర.రామాయణ మహాభారతాలు మొదట ఆశురూపంలోవుండి తరువాత గ్రంధస్తమయ్యాయి.
వాల్మీకి ప్రణీతమైన రామకథను శ్రీరామపుత్రులైన లవకుశులు వాల్మీకి మునివద్ద నేర్చుకొని ,తరువాత అయోధ్యానగరంలో శ్రీరామచంద్రుని కొలువకూటములో ఆడిపాడి వినిపించి సభాసదులనెల్లా మంత్రముగ్ధులను చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇక ప్రకృతానికొద్దాము.వాల్మీకి మహర్షి గురించి ఎన్నోకథలు బహుళ ప్రచారం లో వున్నాయి.ఆ కథల్లోని విశేషాలను తెలుసుకౌవడానికి ప్రయత్నం చేద్దాము.
వాల్మీకి మహర్షి ని గురించి,అతని చరిత్రను గురించి తెలుసుకోవడం అంత సులువైన పనేమి కాదు.పురాతన వాజ్మయాన్నిశోధించి,గాలించి,తరిచి చూస్తే మనకు ముగ్గురు వాల్మీకి నామధేయులు కనిపిస్తారు.
తైత్తిరీయ ప్రాతిశాఖ్యననుసరించి వాల్మీకి ఆనునతడు గొప్ప వ్యాకరణం వేత్త యనితెలుస్తుంది.క్రీశ.11వశతాబ్దం వాడైన హేమచంద్రడు వ్యాకరణవేత్తయైన వాల్మీకి విరచిత వ్యాకరణ సూత్రాలను తనగ్రంధములో వుదహరించాడు.శ్రీమహాభారత ఉద్యోగ పర్వంలో సుపర్ణ వాల్మీకి యను పేరుతో ఒకరు న్నారు.ఇతడు విష్ణభక్తాగ్రేసరుడైన గరుత్మంతుని వంశస్తుడని ఇతని పేరును బట్టి తెలుస్తుంది.కానీ వీరిరువురు రామాయణ కావ్యకర్తలు కారని విద్వాంసుల అభిప్రాయము.
భార్గవగోత్రుడు శివభక్తుడుయైన వాల్మీకి మహాభారత ద్రోణ పర్వంలో కనిపిస్తాడు.
భార్గవ గోత్ర సంజాతుడు బ్రాహ్మణుడైన వాల్మీకి యే మనం వెతుకుతున్న రామాయణకర్తయైన వాల్మీకి కాబోలు.రామాయణ కావ్యారంభంలో వాల్మీకి మహర్షి తనగురించి వివరాలేమీ తెలుపక కేవలం వాల్మీకి అని తనపేరును మాత్రమే తెలిపి వూరుకున్నాడు వాల్మీకి మహర్షి.
కానీ ఉత్తర రామాయణం లో తనగురించి మరింతసమాచార మందించడానికి ప్రయత్నించినట్లు మనం గమనించవచ్చు.తాను ప్రచేతసుని పదవకుమారుడని శ్రీరామునితో అన్నట్లు తెలుస్తుంది.అందుకే తనను అకల్ముషుడైన ప్రాచేతసుడుగా తెలిపాడు."ప్రాచేతసమకల్మషం" అని మనకందరికీ తెలిసిన విషయమే.ప్రచేతడని వరుణునకు మరో పేరుంది.
శతపథబ్రాహ్మణమున వరుణుడు చర్షిణీ హిలను పెండ్లియాడి ఆమెవల్ల ఇద్దరు కుమారులను పొందాడటవారే భృగువు,వాల్మీకులు విష్ణు పురాణము, మత్స్య పురాణం శ్రీమద్భాగవతం ఈ అంశంతో ఏకీభవిస్తున్నాయి.వల్మీక సంబంధంగల మరో ఋషి ఉన్నాడు.భార్గవ చిత్రాలను,ఆప్నువాన ఔర జామదగ్ని ప్రవరాన్వితమైన శ్రీవత్స గోత్రమునందలి చావనునికి కూడా వాల్మీకి సంబంధం వుంది.చావనుడువేలాది సంవత్సరాలు స్థిరసుఖాసనముతో తపస్సు చేయగా అతని శరీరమును చెదపురుగులు ఆవాసంగా చేసుకొని వల్మీకమును నిర్మించుకొన్నాయి.కానీ కాలాంతరేణ ఈ వాల్మికి నామధేయము రామాయణ విరచిత వాల్మికికే దక్కింది.
కృత్తివాస విరచిత వంగరామాయణమునందు మన వాల్మీకిని చ్యవనుని కుమారునిగా పేర్కొనడం జరిగింది.శ్రీమద్రామయణమున భార్గవి చ్యవన ప్రస్థాపన రెండుమార్లు జరిగినప్పటికి ఆది మన వాల్మికికి సంబంధించినదిగా పేర్కొనలేదు.
బుధ్ధ చరితమున అశ్వఘోషుడు గొప్పమునీశ్వరులైన చ్యవన మహర్షి వంటివారు రచించలేని రామాయణమును వల్మీకమునుండి ఉద్భవించిన వాల్మీకి రాయగలిగాడని ప్రశంసించాడు.
అదంతా బాగానే వుంది కానీ వాల్మీకీ,మహర్షి కాకముందు గొప్ప బందిపోటుదొంగ అనే కొన్ని కథలున్నాయికదా! దీనికే మంటారు? అనే శంక రాకమానదు.
రత్నాకరుడనే తస్కరుడు సప్త ఋషులు ప్రేరణతో పరివర్తన చెంది మహర్షియైన వృత్తాంతము స్కాంద పురాణమున ప్రపథముగా కనిపిస్తుంది. ఈ స్కాంద పురాణం అంత ప్రాచీనమైనది కాదనీ,అందులో వాల్మీకి మహర్షి కి సంబంధించిన వృత్తాంతము సమగ్రంగా విశ్వాసం పాత్రగా లేదని కొందరి వాదన.ఈ దొంగతనమునకు సంబంధించి వృత్తాంతాలు నాలుగు కనిపిస్తున్నాయని కొందరంటారు.
ఆధ్యాత్మ రామాయణమున వాల్మీకి స్వయంగా సీతా రామలక్ష్మణులతో సంభాషించే సందర్భంలో రొమనామ మహిమను గురించి వర్ణిస్తూ తన తస్కరవృత్తిని గుర్తుకు చేసుకొన్నాడు.అందులో ఇలా వుంది."నేను బ్రాహ్మణ దంపతులకే జన్మించాను.దైవఘటనా వంశమున కిరాతదంపతులచే పెంచబడ్డాను.ద్విజ ధర్మాన్ని త్యజించి శూద్రునిగా జీవిస్తూ,శుద్రవనితను వివాహం చేసుకొని ,సంతానాన్ని పొందాను.ఇలా జీవిస్తూ, ధనుర్బాణాలు ధరించి వ్యాపారుల బాటసారుల ధనమును తిరస్కరిస్తూ జీవిస్తున్నాను. జీవితం ఎప్పుడూ ఒకే తీరుగా వుండదుకదా!, కాల మహిమ విచిత్రమైనది.అదృష్ట వశమున ఆ అరణ్యప్రాంతానికి సప్త ఋషులు రావడం జరిగింది.వారిని కూడా దోచుకోవడానికి ప్రయత్నించాను.కారుణ్యమూర్తులైన ఆమహనీయులు నన్నుజాలిగా చూస్తూ" నీవు చేస్తున్న అకృత్యములలో నీ భార్యా పుత్రులు భాగస్వామ్యం తీసుకోంటారా? ఆ విషయము ఇంటికి వెళ్ళి తెలిసికొనిరమ్ము "అని నన్ను పంపించారు.నేను ఆత్రంగాఇంటికి వెళ్ళి వారిని ప్రశ్నించాను.వారు నాపాపకార్యములలో భాగస్వాములు కావడానికి అంగీకరించలేదు."నీపాపకార్యాచరణకు నీవే బాధ్యతలు,కుటుంబపోషణ నీ కర్తవ్యం" అని తేల్చివచెప్పారు.వారి సమాధానము తో నాకు జ్ఞానోదయమైనది.
సప్త ఋషులు వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పి వారిని శరణుకోరాను. వారుదయాసముద్రులగుటచే తారక మంత్రోపదేశం మును నా ఉఛ్ఛారణా సౌలభ్యతకోసం వ్యత్యస్తంగా(మరా) చేశారు. ఇలా నేను కొన్నియుగాలు తపస్సు చేశాను.నాశరీరము చీమలకు ఆవాసంగా మారింది.నాపై పుట్టలు పెరిగాయి. సప్త ఋషులు నావద్దకు వచ్చి పుట్టాను తోలగించి నన్ను పైకి తీసారు. వల్మీకమునుంచి జన్మించి. నీవు ద్విజుడవైనావు.శ్రీమద్రామాయణమునుళరచించి విశ్వమునకు శ్రేయస్సును కూర్చమంటు ఆశీర్వదించారు"అని వాల్మీకి తన పూర్వ వృత్తాంతాన్ని వివరించారు.
ఇలాంటి వృత్తాంతాల్లో ప్రసిధ్ధవ్యక్తులకు,కవులు యొక్క మహాత్మ్యాలను యినుమడింప చేయడానికి చేసె కల్పనలని చరిత్రకారులు అభిప్రాయము. వారిదృక్ఫథానికి ఆధ్యాత్మిక భావాలున్న వారికి లంకె కుదరడం కష్టము.
ఈ ఇతివృత్తం సత్యమని నమ్మేవారు అసంఖ్యాకంగా వున్నారు.ఈ కథను ఆధారంచేసుకొని నాటకాలు,కావ్యాలూ ,చివరకు చలన చిత్రాలూ వచ్చాయి.భవిష్యత్తులో రాబోతున్నాయి.
రామాయణం రచనాకాలం ఇదమిత్థంగా చెప్పలేము.ఉజ్జాయింపుగా నిర్ణయించడానికి వీలుకాదు. వాల్మీకి మహర్షి శ్రీరాముని సమకాలికుడని,రామాయణంలోని ప్రముఖ ఘట్టాల్లో వాల్మీకి ప్రత్యక్ష భాగస్వామ్యముందని భారతీయ సాంప్రదాయజ్ఞులు పేర్కొంటారు.ఉత్తరరామాయణం వాల్మీకి మహర్షి ధశరథమహారాజుకు పరమమిత్రునిగా పేర్కొంటుంది.వనమున వదినయైన సీతాదేవిని వదిలి వేయునట్టి కఠినమైన కఠోరమైన ఆజ్ఞను భాతృభక్తియుక్తుడైన లక్ష్మణునకు అప్పగించడం జరిగింది. లక్ష్ముడు వదినయైన సీతాదేవి తో "అమ్మా! విచారించకు,ఇచటికి సమీపముననే వాల్మీకి మహర్షి ఆశ్రమము ఉంది.
ఆ వాల్మీకి మహర్షి మా తండ్రిదశరథులకు మంచిమిత్రుడు.మీరచటికి వెళ్ళి ఆ ఆశ్రమమున సదారాముని స్మరిస్తూ తపోనిష్టలో గడపవలసినదిగా ప్రార్థిస్తు"న్నాను అని పలికాడు.
వనవాసమున నున్న సీతామాత వాల్మీకి ఆశ్రమంలో చాలాకాలముంది.సీతకు లవకుశులు జన్మించడమూ,విరి విద్యాభ్యాము అక్కడే కొనసాగింది.వాల్మీకి రామాయణ కావ్యరచన కావించిన తరువాత వారిద్దరికి రామాయణం కథాగానమును అభ్యసింపచేశారు శ్రీరాముని అశ్వమేధయాగం పరిసమాప్తి యైన తరువాత రామాయణం కావ్యగానమును శ్రీరామునిసభలోని వారందరికి లవకుశులు వినిపింపజేశారు.సభలోని వారందరూ, మధురాక్షర భరితము శ్రవణ మంగళమైన రామకథను వీనులవిందుగా విని హరచషపులకితులైనారు.
తరువాత వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రులకు మహత్తరమైన పావనమైన సీతాసాధ్వి యొక్క సౌశీల్యాది మహత్తరమైన గుణములను వివరించి సీతామాతను స్వీకరించమని కోరాడు.
రామాయణ కథా ప్రశంస మహాభారతములో ను,జైన బౌధ్ధాది మతగ్రంధములలోను కనబడుతున్నది.రామాయణకథ త్రేతా యుగమునకు సంబంధించినది.చరిత్రకారులనిర్ణయం ప్రకారం రామాయణంలోని భాషాశైలి ననుసరించి,అంతర్గత అంశాలను పరికించి వేదవాజ్మయము తరువాతదిగా నిర్ణయీంచాయి.
వేదములో పేర్కొన్న సామాజిక నైతిక ధార్మిక కార్యకలాపాలు విపులంగా విసృతంగా వర్ణించడాన్ని మనంగమనించ వచ్చు.ఇంతెందుకు రామాయణం కాలంనాటి సాంస్కృతిక ఆధ్యాత్మికతయావత్తు వేదకాలంనాటిదని స్పష్టంగా చేరుస్తుంది.
భారతీయులకు రామాయణం బోధించే అత్యున్నత మైన విలువలు, ఆదర్శాలముందు రామాయణం రచనా కాలముపై జరిగే చర్చను ప్రజలు అస్సలు పట్టించుకోరు.
రామాయణం రచనా సంవిధానములోని నైపుణ్యము పరిపూర్ణత,అందం అనితర సాధ్యము.విశ్వసాహిత్యంలో రామాయణ ఆదర్శాలకే అగ్రతాంబూలము.
రామాయణరచన సంస్కృత సాహిత్యానికి ముఖ్యంగా కవితా రచనకు కొత్త అందాలను సమకూర్చింది. రామాయణంలోనే "సంస్కృతం" అనే పద ప్రయోగం మొదటగాకనవస్తుంది. సంస్కృతం అంటే చక్కగా సంస్కరింపబడినది అనే అర్థం వుండనే వుంది.
శ్రీమద్రామాయణ రచనారంభంనుంచి కూడా సంస్కృత సాహిత్యం ప్రజలు దైనందిన జీవితం లౌకిక కార్యకలాపాలపై నే దృష్టి నిలిపింది.సమాజంలో భాగమైన మానవుడు,సమాజంలో నిర్వహించవలసిన పాత్రపైనే దృష్టి పెట్టింది.ఆదర్శవంతుడైన తండ్రిగా,అన్నగా,తమ్మునిగా,కుమారునిగా,ఎలా తన పాత్రను నిర్వహించాలో చక్కగా వివరించింది.మానవుని అంతరంగమును ఇంత చక్కగా విశ్లేషించిన కావ్యం మరొకటి లేదు.
రామాయణంలోని ప్రతిపాత్ర దానికదే సాటి.రామాయణంలో శ్రీరాముడు కథానాయకుడు.రామస్య అయనం రామాయణం.రాముడు నడిచిన దారే మనదారికావాలి .సీతాయాశ్చరితం మహత్ ఆన్నది అక్షర సత్యం.
సీతామహాసాధ్వి చరితం పరమపావనము.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి