భాగవతామృతము

భాగవతామృతరసము 
---------------+++----------
బ్రహ్మాది దేవతలు,ప్రజాపతులూ కాలకూటవిషభయముచే పీడింపబడినవారై,ఆత్మరక్షణ మే తక్షణకర్తవ్యముగా భావించి,తమను రక్షింపగలవాడు ఆ మహాదేవుడొక్కడే అనిఅనుకొన్నవారై కైలాసపర్వతమున నున్న పరమేశ్వరుని సమీపించి సభక్తికముగా తమకు శరణమునిమ్మని యిలా ప్రార్థిస్తున్నారు.
"భూతాత్మ! భూతేశ! భూతభావనరూప!
దేవమహాదేవ! ! దేవ వంద్య!
ఈలోకములకెల్లయీశ్వరుండవునీవు
బంధమోక్షములకు ప్రభుడవీవు
ఆర్తశరణ్యుండవగు గురుండవు నిన్ను
కోరిభజింతురు కుశలమతులు
సకల సృష్టి స్థితిసంహారకర్తవై
బ్రహ్మవిష్ణుశివాఖ్య బరగువీవు
ఆ.వె.పరమగుహ్యమైన బ్రహ్మంబు సదసత్త
మంబునీవ శక్తిమయుడవీవ
శబ్దయోనివీవ జగదంతరాత్మవు
నీవప్రాణమరయనిఖిలమునకు 
భావము:--ఓ మహాదేవా! నీవు భూతాత్ముడవు! భూతములకు ఈశుడవు! భూతభావనరూపుడవు! ఈ లోకాలన్నిటికీ నీవే ఈశ్వరుడు, జీవులబంధమోక్షములకు నీవే ప్రభుడవు.ఆర్తజనులకు నీవే దిక్కు.కుశలమతులు నిన్ను భక్తితో సేవిస్తారు.నీవే సకల సృష్టి స్థితి సంహారాకర్తవై బ్రహ్మవిష్ణు మహేశ్వరనామములతో  ప్రకాశిస్తావు.
పరమగుహ్యమొనట్టి సదసత్తమమైనట్ఝి పరబ్రహ్మస్వరూపమే నీవు.శక్తిమయుడవునీవే.సకలప్రాణులకు నీవే ప్రాణము.
ఇక ఈ పద్యమునందలి అంతరార్థమనుఅవలోకి ద్దాము.
విషచణపారమ్యాన్ని తెలిపే మహాభాగవతములో శివతత్త్వాన్ని తెలియజేసే ఘనమైన పద్యమిది.ఈ పద్యము సనాతనమైన వేదధర్మమైన భాగవతం ధర్మాన్ని తెలియజేస్తుంది.
"విష్ణోరన్యం తం పశ్యంతి యే మాంబ్రహ్మాణమేవవా!
కుతర్క మతయోః మూఢాః పచ్యన్తే నరకేష్వథః
యేచ మూఢా దురాత్మానో భిన్నం పశ్యంతి మాంహరేః
బ్రహ్మాణం చతత ద్భ్రహ్మ హత్యా సమంత్వమమ్!
అని భవిష్యొత్తర పురాణంలో మహేశ్వరుని వచనము.
నన్ను బ్రహ్మను విష్ణువు కంటే భిన్నులని భావించే కుతర్కమతులకు నరకము ప్రాప్తించును.అట్టి వారికి బ్రహ్మహత్యా సమపాతకం లభించును" అని భవిష్యోత్తర పురాణములోని మహేశ్వర వచనమును స్మరించుకోవాలి.హరివంశమున
కృష్ణార్జునులు కైలాసమనకేగినప్పుడు మహేశ్వరుడు వారితో చెప్పిన మాటలను ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి.
"ఆదిస్త్వం సర్వ భావానాం మధ్యమన్తస్తదా భగవాన్
త్వత్త స్సత్వమభూద్వీశ్వం త్వయి సర్వం ప్రలీయతే
అహింసా త్వం సర్వగోదేవ త్వమేవాహం జనార్దన!
అవయోరన్తరం నాస్తి శబ్దైః అర్థైః జగత్రయే!
నామాని త్వం గోవిన్ద రాని లోకే మహన్తిచ
తాన్యేవ మమ నామాని నాత్రకార్యా విచారణా!
త్వదుపాస జగన్నాథ సైవాస్తు మమగోపతే
యశ్చత్వాం ద్వేష్టి భోదేవ సమాం ద్వేష్టి నసంశయః!" 
సర్వభావములకు ఆది మధ్య అంతములు నీవే! ఈ విశ్వము నీవలనే ఉద్భవించింది.నీయందే లయమగుచున్నది.సర్వ గతుడనైన నేను నీవే! నీవే నేను.శబ్దములచే గానీ అర్థములచేగానీ మనకిద్దరికీ అంతరము(తేడా)లేనే లేదు.
గోవిందా! లోకములో నీనామములేవికలవో,అవియే నా నామములు.సందేహములేదు.జగన్నాథ! నీ ఉపాసనయే నా ఉపాసన:;నీన్ను ద్వేషించు వాడు నన్నుద్వేషించువాడే;"అని హరివంశము స్పష్టపరిచుచున్నది.
"శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే
శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివః 
యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషీ" అని మనం నిత్యం సంధ్యావందన శ్లోకాన్ని అనుసంధానించుకోవాలి
"ఏకం సత్ విప్రా బహుదా వదంతి" అన్నవేదోక్తి ఇదే భావాన్ని వ్యక్తీకరిస్తుంది.
సకల ప్రాణులకు అతడే ఈశ్వరుడు."నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ" అని నమకమును భక్తి శ్రద్ధలతో పఠిస్తున్నాము.
పశువు--పాశము--పతి అనే త్రిపుటిలో జీవుడు పశువు,కర్మబంధము పాశము,కర్మబంధమునుండి ముక్తిని కలిగించే  వాడు ఆ పరమేశ్వరుడు. దీనిని  పాశుపతమతము  అని అంటారు.
ఆర్తశరణ్యుడు శివుడే.భువనములస్థిరత్వమునకు భంగము వాటిల్లకుండా  సదాకాపాడుటవల్లే అతనికి "భువిన భయభంగ వ్యసనినః" అని పుష్పదంతాచార్యులు  తన మహిమ్నస్తవములో కీర్తించాడు.భువనములకు కలిగిన భయమును ఎల పోగొట్టాలా? అన్నదే పరమేశ్వరుని ఆలోచన.
దక్షిణా మూర్తి యై ఆదిగురువై పరమార్థ తత్త్వాన్ని నుంచి పెట్టే మహనీయుడు ఆ పరమేశ్వరుడు.అందుకే కుశలములను కోరుకొనే కుశలమతులు పరమేశ్వరుని భుజిస్తారు.
అఖండ సచ్చిదానంద పరబ్రహ్మమే సృష్టిస్థితిలయలను కొనసాగించడానికి
బ్రహ్మవిష్ణు మహేశ్వరూపాలతో  వెలిసింది.
శక్తిస్వరూపిణి యైన జగదంబతో కూడినందువల్ల శక్తిమయుడైనాడు,ఓంకార శబ్దవాచ్యుడగుటవల్లనే ఇతడు శబ్దయోని యైనాడు.
ఇన్ని విశేషాలు ఈ సీసపద్యములో నిక్షిప్తమై వున్నాయి.
ఇంతమహిమాన్వితుడైన ఆ పరమేశ్వరుని భక్తితో భజించి అధ్యాత్మికాను భూతిని సొంతచేసుకొందాము.  


సత్యమేవ జయతే
@@@@@@@@@@@@@@@"సత్" అనే ధాతువు నుంచి సత్యం అనే పదం వచ్చింది. సత్ శబ్దమునకు ఉన్నది,గొప్పది అనే అర్థాలున్నాయి."ఏకం సత్ విప్రాబహుదా వదంతి" అన్నది వేదోక్తి. సత్యమొక్కటే,పండితులు పలువిధాలుగా పేర్కొంటారు అన్నది పై వేదోక్తి భావము.
ప్రపంచములోని అన్ని మతాలు సత్యాన్ని పరతత్త్వంగా భావించడం ఈ సత్యాన్ని గుర్తించడం వల్లే‌."నీరు"అనే పదానికి పలుభాషల్లో పలు పేర్లు ఉండవచ్చు.పేర్లువేరేయైనంత మాత్రాన వస్తువు వేరు కాదుకదా
"సత్యో స్థాపితా భూమిః" అన్నది శృతి.ఈ భూమి సత్యముపై స్థాపించబడినది అని వేదోక్తి వల్ల తెలుస్తుంది. మన నిత్యజీవితంలో ప్రతి అంశమూ సత్యము పై ఆధారపడి వున్నదని తెలుస్తుంది. "మాటకు ప్రాణము సత్యము"అన్న సుమతి శతకం కారుని మాట వుండనే వున్నది.పరస్పర విశ్వాసాల పైనే  కదా మననిత్య జీవనయాత్ర సాగుతుంది.మనవిశ్వాసాలకాధారము సత్య పాలనమే కదా!
గ్రహాలు నక్షత్రాలు సకలసృష్టి, నియమబద్ధంగా సాగితేనే కదా! ఈ విశ్వసృష్టి కొనసాగుతుంది.ఋతువులూసంవత్సరిలు,,సూర్యోదయాస్తమానాలు అన్ని నియమబద్ధంగా కొనసాగితేనేకదా ఈ విశ్వం సహజస్థితిలో వుంటుంది.ఇందులో ఏ స్వల్ప మార్పు వచ్చినా అంతా అల్లకల్లోలమై అయోమయావస్థత స్థితి ఏర్పడూతుంది ‌భగవంతుడు సత్యస్వరూపుడు ఇదే విషయాన్ని వేదాలూ పురాణాలూ,ఇతిహాసాలూ,శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.
"సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ"అన్నది తైత్తిర్యోపనిషత్తు.పలబ్రహ్మమే సత్యమొనది, జ్ఞాన స్వరూపమైన ది,అంతములేనట్టిది ఆనందస్వరూపమైనట్టిది అని ఉపనిషత్ సూక్తి కర్థము.
పరతత్వమునుమన వేద ఋషులు "సత్యం-శివం-సుందరం" రూపములుగా తమతపో నిష్టతో దర్శించి మనకందించారు.ఏది సత్యమో అదే శివముశివ మంటే మంగళస్వరూపము.ఏది మంగళస్వరూపమో అదే సుందరము.వేదాంత పరిభాషలో చెప్పాలంటే పరతత్త్వమునకు "సత్య-శివ-సుందరం " అనునవి స్వరూపాలే క్షణాలు.
వేదాంత పరిభాషలో సత్యాన్ని  మూడు విధాలుగా వర్గీకరించారు.అవే వ్యావహారిక,ప్రాతిభాసిక పారమార్థిక సత్యాలు.
వ్యావహారిక సత్యం అంటే ఏమిటో ముందు తెలుసుకొందాము.ఇది మన నిత్యజీవితంలోని జాగ్రదావస్థలోని ప్రాపంచిక సత్యము.ప్రపంచంలోని వస్తువులన్నీ జాగ్రవదావస్థలోని సత్యాలే.ఈ సత్యం వ్యవహారానికి తోడ్పతుంది. కానీ పుట్టుక,బాల్యము,యవ్వనము, వార్ధక్యం,మరణము అనే పరిణామాలవల్ల దీని అసలు తత్త్వం తెలుస్తుంది. ఈ వ్యవహారిక సత్యం,సప్నావస్థలో ,సుషుప్తి స్థితిలో ఉనికి లేకపోతుంది.
ఇక ప్రాతిభాసిక సత్యానికొద్దాము.ఎండమావుల్లో నీరున్నట్లు,కన్పించడం,ముత్యపు చిప్ప వెండిగిన్నెలా తోచడం,చీకటిలో తాడును పాముగా భావించడం మనకు అనుభవములోనున్న అంశాలే.భ్రాంతి(భ్రమ) తొలగనంతవరకు అవిసత్యాలుగానే తోస్తాయి.నిజం తెలిసిన తరువాత  భ్రాంతి తొలగిపోతుంది.మనకు స్వప్నంలో లక్షరూపాయలు దొరికినట్లూ,దొంగలు మనలను తరుముతున్నట్లు,వింతకలలు కంటూవుంటాము,మెళకువ రాగానే  లక్షరూపాయలూవుండవూ,దొంగలూ దొరకరు.కానీఇవి స్వప్నావస్థలో వున్నంత వరకు సత్యమేగా!
ప్రపంచంలోని ప్రతి వస్తువూ ఈ రెండు సత్యాల్లో ఏదో సత్యానికి చేరుతుంది.కానీ మానవుడు పారమార్థిక సత్యాన్ని వదిలి ఎండమావుల్లో నీరు వెదికే వెర్రబాటసారుల్లా పయనిస్తున్నాడు.
ఇక పారమార్థిక సత్యమంటే ఏమిటో తెలుసుకొందాము.పారమార్థిక సత్యమంటే జన్మమృత్యపరిణామాది ధర్మాలు లేకపోవడంవల్లా, వస్తువు కాకపోవడం వల్ల,దేశకాలకారణాలకతీతమవడం వల్ల శాశ్వతంగా వుంటుంది.
సత్యం పరబ్రహ్మమునకు స్వరూప లక్షణంగా చెప్పబడుతుంది.కాబట్టి పరబ్రహ్మమే పారమార్థిక సత్యం."బ్రహ్మ సత్యం జగన్నిథ్య జీవో బ్రహ్మైవ నాపరః"అన్నమహావాక్యం ఆధారంగా చేసుకొని జగత్తులేదని దబాయించరాదు.ఆ దబాయింపుకుదరదు.శ్రీమహాభాగవతం దశమస్కందంలో భగవంతుని "సత్యస్య సత్యం" జగత్తు సిపేక్ష సత్యమైతే పరబ్రహ్మం పరామరార్థమైన సత్యం.
ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశాన్ని గురించి కొంత విపులంగా చర్చించాము కదా!
మనం ఈ ప్రపంచంలో వున్నాము కాబట్టి నేల విడిచి సాము చేయకుండా సత్యాన్ని మన జీవితంలో దర్శించి ఆచరించాలి.
"సత్యం వద--ధర్మంచెర "అన్నది వేదానుశాసనం. వేదం ప్రభువులాగా శాసిస్తుంది.ప్రభుత్వశాసనాన్ని పౌరులు అవశ్యమాచరించినట్లు,అలానే మనం వేదానుశాసనాన్ని ఆచరించి, మానవోత్తములుగా మరి భూలోకాన్ని నందనవనంగా మారుద్దాము.
సత్యాన్ని పలకడం ధర్మాన్ని ఆచరించడం రెండూ వేరువేరు కాదు.సత్యాన్ని పలకడం వాచిక ప్రక్రియ,ధర్మాన్ని ఆచరించడం మనో బుద్ధి దేహేంద్రియాలతో ఆచరించడం కూడుకొన్నది.
శకుంతలను గాంధర్వ వివాహం చేసుకొన్న దుష్యంతుడు,లోకోపవాద భీతితో శకుంతలను తిరస్కారిస్తాడు. అలా తిరస్కరించిన దుష్యంతుని తో శాకుంతల
"నుతజలపూరితంబులగు నూతులు నూరిటికంటె సూనృత
వ్రత! యొకభావిమేలు,మరిబావులు నూరిటికంటె నొక్క
సత్కృవది మేలు,తత్కృతుశతంబునకంటె సుతుండుమేలు
తత్తసుతుశతంబునకంటె నొక్క సూనృతవాక్యముమేలు సూడగన్"అని సత్యవాక్య విశిష్టతను తెలిపింది.వంద మంచినీటి చేదబావులకన్నా,ఒక్క దిగుడు బావి మేలు,ఎందుకంటె దిగుడు బావినీరు మానవులకే కాక పశుపక్ష్యాదుల దాహార్తిని తీర్చగలదు,అలాంటి వంద దిగుడుబావులకన్నా ఒక మంచి యజ్ఞముమేలు, యజ్ఞములవల్ల దేవతలు సంతోషిస్తారు కదా!అలాంటి వంద యజ్ఞానలకన్నా ఒకసత్పుత్రుడు మేలు,అలాంటి వంద సత్ప్రుతులకన్నా ఒక సత్యవాక్యం గొప్పదని మహాభారత సందేశము శకుంతల ద్వారా అందించింది.
సూనృత వ్రత! అని శకుంతల దుష్యంతుని సంబోధిస్తుంది.సత్యవాక్యపాలనమే వ్రతముగా కలవాడా! ఇలా నీవు అసత్యం పలకవచ్చా? అని మెత్తగా చురక వ్యంగ్యమర్యాద ద్వారా యిస్తుంది.
పంచమి వేదమైన మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయభారఘట్టములో ధృతరాష్ట్రునితో "ధర్మసత్యాలను కాపాడుటలో నిర్లక్ష్యం (ఉపేక్ష) వహిస్తే,అది ఉపేక్షించిన వారికే హాని కలిగిస్తుంది.సత్యధర్మాలను రక్షించడానికి భగవంతుడున్నాడని హెచ్చరించి కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు.
ప్రేయస్సు అంటే సుఖము.అసత్యం పల్కడంవల్ల తాత్కాలిక ప్రయోజనం కల్గి,దానివల్ల సుఖం లభించ వచ్చు.అవసరం గడుపుకోవచ్చు..పేరు తెచ్చుకోవచ్చు.కాని దాని వైభవము తాత్కాలికం మాత్రమే.సత్యసూర్యోదయమయిన తరువాత ఆ అసత్యం మంచులా కరిగిపోతుంది.అవసారార్థం అసత్యాన్ని పల్కినా,ఆ అసత్యమును
సత్యంగా నిరూపించడానికి నానా ప్రయాసలు పడవలసి వుంటుంది.చివరకు అది అసత్య మాని తేలుతుంది.
శ్రేయస్సు అనగా మంచితనము మంగళకరం,శివం,శుభం,అనే అర్థాలున్నాయి.సత్యం పల్కడంవల్ల శుభాలు చేకూరుతాయి.మరి సత్యం స్వరూపమేమి?
"సత్యస్యవచనం శ్రేయః సత్యాదపి హితం వదేత్
యధ్భుతహితం అత్యంతం ఏతత్ సత్యం మతం మమ"
అని శ్రీకృష్ణవచనం.
సత్యవచనం శ్రేయస్సును కలిగిస్తుంది.సత్యమునకన్న ఆ హితము అందరికీ మంచిని కలిగిస్తుంది.అంటే సర్వభూతహితమైనదే సత్యము.ఇదే నామతము .అని శ్రీకృష్ణుడు నిష్కర్షగా తేల్చిచెప్పాడు.ఇది సమస్తమానవాళీ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఉదాత్త సందేశము.
సర్వజనులకు బాధకలిగించు నట్టిది ఎంత గొప్ప సత్యమైనా అది సత్యం కాదు, కానేరదు.
భారతానికి పంచమవేదమనే ప్రఖ్యాతి వుంది.ఒకధర్మానికి మరోధర్మానికీ మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు ఏది ఆచరించాలి ?ఏది మానివేయాలి? అనే సమస్య తలెత్తినప్పుడు,మహా భారతములొ దానికి సరియైన సమాధానము దొరుకుతుంది.సత్యవాక్యపాలన గొప్ప ధర్మం,అలానే సకల జనులకు హితమునూ శ్రేయస్సును కలిగించడమూ గొప్ప ధర్మమే.సత్యం చెప్పితే జనులకు బాధ,కష్టము,వినాశమూ కలుగుతుంది.అలా అనిఅసత్యం పలికితే సత్య వాక్యపాలనకు విఘాతం కలుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఏమి చేయిలి అనే ప్రశ్న తలెత్తక మానదు.
ఒక ఆశ్రమంలో మునీశ్వరుడు తపస్సు చేసుకొంటున్నాడు.అతడు సత్య వాక్యం పాలనా వ్రతుడు.దుండగులతో తరుమబడుతున్న బాటసారులు,స్త్రీలు,వృద్ధులు,బాలలు ఆ ముని ఆశ్రమంలో శరణుపొందారు.దుండగులు అక్కడికొచ్చి ఆ బాటసారు. లెక్కడ వున్నా లో తెలుపమని మునీశ్వరునీ నిగ్గదీశారు.అసత్యాన్ని పలుకవలసివస్తుందని బాటసారుల ఉనికిని తెలిపాడు.ఆ దుండగులు అక్కడే మారణకాండకు జరిపి వెళ్ళిపోయారు.కొంతకాలము తరువాత మునీశ్వరుడు కాలధర్మం చెంది సమవర్తి యైన యమధర్మ రాజు వద్దకు వస్తాడు.యమధర్మరాజు మునీశ్వరునిపై విచారణ జరిపి నరకలోక శిక్షను మునీశ్వరునకు విధిస్తాడు.
నేను జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు కదా! నిత్యతపశ్చర్యలో  గడిపే వాడిని కదా! నాకెందుకీ  కఠిన శిక్ష? ఇదేమైనా న్యాయంగా వుందా? అని మునీశ్వరుడు ప్రశ్నించాడు.సత్యవాక్య పాలన గొప్పదే, కానీ అసత్యము ఇతరులకు హానీ అపకారము కలిగించరాదు.నీవు దొంగలకూ ధూర్తులకు అమాయకులైన బాటసారుల ఉనికిని తెలిపి వారి మరణానికి కారకుడవైనావు.అందుకే‌నీకీ శిక్ష అని యముడు తన తీర్పును ప్రకటించాడు.
సత్యం పలకడం ధర్మం.కానీ సర్వభూత హితము కొరకు పాటుపడటం పరమధర్మమని మహాభారతం నిగ్గు తేల్చింది.
"సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
నబ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ నానృతం బ్రూయాత్
ఏషధర్మః సనాతనః"
అన్నది పంచమవేదమైన మహాభారతం.సత్యమును పలుకు,ప్రియమును ఆహ్లాదమును కలిగించేలా పలుకు.అప్రియమైన సత్యాన్ని పలికి జనులకు హాని కలిగించవద్దు.అలా అని ప్రజలను మోసంచేయడానికి,మభ్యపెట్టాలని కీ,ఆహ్లాదంగా వుంటుందని అబద్ధాలు చెప్పవద్దు.ఇదే సనాతనమైన ధర్మము.
రోగి పరిస్థితి విషమంగా వుందని గ్రహించిన వైద్యుడు,రోగి ఆత్మవిశ్వాసము సడలిపోకుండా,నిజాన్ని ఉన్నది ఉన్నట్లుకాకుండా కొంతవరకు సత్యాన్ని రోగి వద్ద మరుగు పరుస్తాడు.దీని వల్ల రోగికి హాని కలుగదు.అలాకాక ఉన్నది ఉన్నట్లుగా నిజం తెలిపితే రోగి పరిస్థితి ఏమవుతుందో అందరికీ తెలుసు.
కొందరు తమ పబ్బం గడుపుకోవడానికి అసత్యాలను,అవలీలగా, అడ్డు అదుపు లేకుండా పలికేస్తారు.
సత్యవాక్యపాలనకై తన సర్వస్వాన్ని కోల్పోయి, అష్ట కష్టాలు పడి, విశ్వామిత్రుడు పెట్టిన పరీక్షలో అంతములో గెలుస్తాడు.ఇందు వలన హరిశ్చంద్రుడు సత్యహరిశ్చండు డై మానవాళికంతా ఆదర్శంగా నిలుస్తాడు.
బాల్యంలో గాంధీజీ సత్యహరిశ్చంద్ర నాటకమునుచూచి ,ప్రభావితుడై తాను జీవితంలో అసత్యమాడరాదని నిశ్చయించుకొన్నట్లు తన ఆత్మకథలో వ్రాసుకొన్నాడు‌.ఆ తరువాత స్వాతంత్ర్య సిధ్ధికై గాంధీజీ  సత్యాహింసలను ఆయుధాలుగా చేసుకొని మనకు స్వాతంత్ర్యాన్ని సముపార్జించడం మనకు తెలిసిందే.
సత్యమంటే మనకు గుర్తు వచ్చే మరో పేరు బలిచక్రవర్తి.లక్ష్మీ పతియైన శ్రీమహా విష్ణువు వామనావతారం ధరించి బలిచక్రవర్తి వద్దకు వచ్చి మూడడుగుల నేలను దానమడిగాడు.దానవ గురువైన శుక్రాచార్యులు రాక్షస రాజైన బలిచక్రవర్తి తో ,ఇతడు దానమడగవచ్ఛిన బ్రాహ్మణ వటువుకాడు,నీరాజ్యాన్ని అపహరించి,దేవేంద్రునకివ్వడానికొచ్చిన మహా విష్ణువు.దానం ఇవ్వొద్దు అని వారిస్తూ
"వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణవిత్త మానభంగం ముందు
చకితగోకులాగ్ర జన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము పొందదధిప"
,అని ఆడితప్పినా పాపము లేదంటు ఉపాయం చెప్పాడు.
ధీరుడైన బలిచక్రవర్తి గురువుకు కోపము వచ్చినప్పటికి
"బ్రతుకు వచ్చు గాక బహుబంధనములైన
వచ్చుగాక లేమి వచ్చు గాక
జీవ ధనములైన చెడుగాక పొడుగాటి
మాటతిరుగలేరు మానధనులు" అని బలిచక్రవర్తి సత్యవాక్యపాలనకే బద్ధుడై మహావిష్ణువు ను మెప్పించాడు.
మహాకవికాళిదాసు తన రఘువంశమహాకావ్యములో రఘవంశరాజుల ప్రశస్తిని వర్ణిస్తూ "సత్యాయ మితభాషిణాం"అని పేర్కోన్నారు.సత్యవాక్యపాలనకొరకే రఘవంశరాజులు మితభిషులై వుండేవారట.అతిగా వాగితే అసత్యాలు దొర్లే ప్రమాదం వుండనే వుంది.
"ప్రాణ్ జాయె పరవచన్ నా జాయె యే రఘుకుల రీతి సదా చలి అయి"అని తులసీదాస్ తన రామచరిత మానస్
లొ శ్రీరాముని చేత పలికిస్తాడు.ప్రాణం పోయిన పోవుగాక రఘవంశస్థులు ఆడితప్పరు.ఇలానే రఘువంశం అలా సాగింది.
మన సుమతీశతక కర్త బద్దెన "మాటకు ప్రాణము సత్యము"అని అంటాడు.శరీరానికి ప్రాణమెంతముఖ్యమో,మాటకు సత్యం అంత ముఖ్యము
ఇన్ని విధాలుగా మనం నిత్యజీవితంలో సత్యం విశిష్టతను తెలుసుకొని కూడా , అతిచిన్న విషయాలకే అవలీలగా అబధ్ధాలాడేస్తుంటాము.
పెద్దలు పిన్నలకు ఆదర్శంగా నిలవాలి.మనం నిత్యజీవితంలో అసత్యాలాడకుండా ,పిల్లలచేత కూడా అసత్యాలాడించకుండా  వుండాలి.పెద్దలు పిన్నలకు ఒక చెంపనీతులు చెబుతు ,మరో ప్రక్క తాము అసత్యాలను అవలీలగా ఆడేస్తుంటే ,మన ప్రవర్తన పిల్లలకు ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముంది.అలా కాకుండా మనం మొదట ఆచరించి వారికి ఆదర్శంగా నిలవాలి.
-----






!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత