ద్రౌపది Part 2
మహాభారతంలో ద్రౌపదీ దేవి పాత్ర
---------------+++-------------పంచకన్యలలో పరమప్రసిధ్ధురాలు ద్రౌపదీ దేవి.
ద్రౌపది,కృష్ణ,పాంచాలీ, యాజ్ఞాసేని అని ప్రసిధ్ధి నామాలతో ప్రఖ్యాతి చెందిన విశిష్ట మహిళా శిరోమణి.
భారతంలో నలువురు కృష్ణులలో ద్రౌపదికి కృష్ణ అని పేరుంది.
"వరమును బుట్టితిన్ భరతవంశముజొచ్చితి" అని సగర్వంగా చెప్పుకొన్న ఘనత ఆమె సొంతం.ఆమె కారణజన్మురాలు.శంకరవరప్రసాద లభ్ద.అయోనిజ.
ఆమె మూడు జన్మల పరంపరలో ద్రౌపదీ జన్మ మూడవది, ఆఖరిది.
ఈమె మొదటి జన్మ నలుని కుమార్తె యైన నాలాయనాఖ్యతో పిలువ బడే ఇంద్రసేన.
ఈమె మౌద్గల్యమహాముని ధర్మపత్ని.క్రుష్టరోగపీడితుడు,వృధ్ధుడు, అనాకారి.ఆమెమహాపతివ్రత,మార్పునకు, క్షమాగుణమునకు నిలువెత్తు నిదర్శనము.క్రుష్టిరోగి,అనాకారీ, వృధ్ధుడైనప్పటికీ భర్తకు అచంచలభక్తివిశ్వాసములతో భర్తకుసేవ చేసిన పరమసాధ్వి.
ఒకమారు క్రుష్టురోగియైన భర్త బొటన వ్రేలు తనవిస్తరిలో వచ్చినా అసహ్యించుకోకుండా, చిరాకు పడకుండా,ఆ వ్రేలును ప్రక్కన పెట్టి భర్త భుక్తశేషాన్ని పరమభక్తితో స్వీకరించిన దొడ్డి యిల్లాలు.
తాను పెట్టిన పరీక్షలన్నిటిని అవలీలగా నెగ్గిన ఇంద్రసేనా పాతివ్రత్యానికి సంతుష్టాంతరంగుడైన ముద్గలముని ఆమెకు అనేకవరములొసగాడు.
ఆమొ యిష్టమును తెలుసుకొన్న భర్త పంచదావిభక్తమైన దేహముతో ఆమెను కామసుఖములతో పెద్ద కాలము సంతృప్తి కలుగజేసి అంత్యమున అతడు తపో నిష్టుడై ముక్తి ధామాన్ని పొందాడు.
కాని ఇంద్రసేనకు సంతృప్తికలుగలేదు."తృష్ణా నజీర్ణా వయమేవ జీర్ణ" అనుసూక్తి ననుసరించి, మరుజన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించి కన్యకగా చాలాకాలము గడిపింది.వివాహముకాకపోవడంవల్ల పరమేశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేసింది.పంచాగ్ని మధ్యంబున తపము చేసి పరమేశ్వరుని ప్రసన్నము కావించుకొన్నది. వరములు వేడమని అడిగిన శంకరునితో" శివాపతిందేహి, శివాపతిందేహి" అని యైదు మార్లు ప్రతీకగా శివుడు తథాస్తు అని పంచభర్తలను వరంగా ప్రసాదించాడు.
ఇంతలో యముడు,వాయువు,ఇంద్రుడు,అశ్వినీ దేవతలు వచ్చి మరుజన్మలో తమ అంశతో జన్మించిన వారాలకు పత్నిగా
వుండాలని కోరారు.
"పతికినొక్క రుండ పతిగాక యెందును
పంతులు పలువు రవుట కతలుగలవె
లోకనాథ!
లోకవిరుధ్ధంపు
వరమునరయ నమరవరద యెల్ల"
అని ప్రశ్నించగా
"నా వరమువల్ల నీకు యైదుగురు భర్తలు ధర్మప్రకారమే లభిస్తారు.
అందువల్లనే నీమీది దయతో నీకు ఈవరంఈస్తున్నాను"అని అన్న పరమేశ్వరునితో
"అనిన అంట్లేని ఆ యేవురు పురుషులందు ప్రత్యేకంగా మేము,కన్యాత్వము,పతిసేవా భాగ్యము,సౌభాగ్యము వరములగా నిమ్మనికాశీరాజ కుమార్తె ,కాబోయే ద్రౌపది వరములు కోరినది.
అందుకేనేమో! పంచకన్యల నామములలో ద్రౌపదీ దేవి సుప్రసిద్ధురాలైనది.
శివుని ఆజ్ఞ ప్రకారము దేవేంద్రుడు పంచదావిభజ్యుడై పంచపాండవులుగా అవతరించాడు
ఈ వృత్తాంతం మంతా ఆది పర్వంలో విస్తృతంగా వివరించడం జరిగింది.
ఇక మత్స్యయంత్రభేధనలో వీర్యశుల్కగా పంచపాండవులు ధర్మ పత్నియైన ద్రౌపది లో పూర్వజన్మ సంస్కారం జన్యమైన లక్షణాలు, స్వతంత్ర భావాలు మనం గమనించ వచ్చు.
ఇక ద్రౌపది వ్యక్తిత్వం విషయాన్ని పరిశీలిస్తే ఆమె ఉదాత్త వ్యక్తిత్వం, మేధస్సు,శీలసంపద, నిర్మోహమాటత్వం మనకు తెలుస్తాయి.
ఆమెమహాపతివ్రతాఅనే అంశం సుస్పష్టము.అంతమాత్రముచేత భర్తలు అనిన ప్రతి మాటకు "డూడూబసవన్నలా ఊకొట్టె"మనస్తత్వం కాదు.నిర్భీతి, నిర్మొహమాటత్వం,ఆమెలో నిండుగా వున్నాయి.బల్లగుద్ది చెప్పడంలో ఆమె తరువాతే యెవరైనా! రాబోయే పరిణామాలను ముందే ఊహించగలిగే శక్తి సామర్థ్యాలు,మేధా సంపత్తి,ఆమె స్వరూపలక్షణాలు.
వాటిగురించి వివరణలు ఆమె మాటల్లో ఉద్యోగ పర్వంలో తిక్కనామాత్యడు వాటిని గుదిగుచ్చి మనకందించాడు.
ధర్మజుడు శ్రీకృష్ణుని కౌరవసభకు రాయబారిగా పంపుతున్నఘట్టములో ద్రౌపది దేవి వాడిని శరాఘాతపు మాటలు ఆలకిద్దాము.
ధర్మజభీమార్జున నకులు నలువురూ సంధిని కుదిర్చి శాంతిని నెలకొల్పమని ముక్త కంఠముతో విజ్ఞప్తి చేశారు.
కానీ సహదేవుడు ద్రౌపది వీరి వాదనలతో పూర్తిగా విరోధించి కథనమే కర్తవ్యమన్నారు. దానికి తగిన కారణాలు వారు చూపారు.శంకాస్వాంతుడై శ్రీకృష్ణునికిదుర్యోధనాదులు అపకారం
చేస్తారేమోనని శంకించి రాయభారమే వద్దన్నాడు.
ఈ ఘట్టములో ద్రౌపదీ దేవి ఆలోచనా విధానములోని పరిణితిని పరికిద్దాము.
ధర్మరాజు సంధి గురించి జోకొట్టే మాటలను విన్న ద్రౌపదికి వాళ్ళు మండిపోయింది.
తిక్కన తాపము,దీనత్వం అనే పదాలు ద్వార తాను పొందిన అవమాన భారముతో తపించిపోయిన విషయం గుర్తు చేసింది.
సహజంగా ప్రతికారం తీరకపోవడంతో నిరాశ నిస్పృహ రావడం సహజము.
అందుకే గద్గద కంఠియై యిట్లాపలికింది.
తెలుగులో సర్వనామాలను తగినట్లు కవిత్వంలో పొదగడంలో తిక్కన, పోతన మహాకవులు సిద్ధహస్తులు.
అందుకే ద్రౌపది తనప్రసంగాన్ని యెత్తుకోవడంలోనే "అంతలూ", "పోనడచి" అనే పదాలను యెన్నుకొన్నాడు.
అంతలూ---అన్న దాంట్లోనే బాల్యంలో భీమునకు విషం పెట్టడంతో ప్రారంభించి, లాక్షాగృహదహనం,మాయాజూదం,వస్త్రాపహరణం ప్రయత్నం, ఘోషయాత్ర,దుర్వాస మహర్షి ప్రయోగం,ఉత్తర గోగ్రహణం ఇవన్ని అంతలు అనే పద ప్రయోగంతో చెప్పింది.
ఇది తిక్కన అల్పాక్షరాలతో అనల్పార్థ రచన అని చెప్పవచ్చు.పోనడచె అన్న పదంలో వెళ్ళగొట్టడం వ్యక్తంచేశాడు
---------part---2)
అయిదురుగురికి అయిదూళ్ళుయిచ్చినా చేయాలంటూ పెంపేదతనముతో రాజీ పడుతున్న ధర్మరాజు దీనత్వాన్ని అతిమంచితనాన్ని యెండగట్టింది ద్రౌపది.గౌరవము చెడిపోయెట్లుగా సంధిరాయభారముచేస్తే అదిమనకే నష్టము ఇట్టి సంధికౌరవులకే లాభకరము.అని ఈ రాయభారములోని వైఫల్యాన్ని ముందే దర్శిచింది ద్రౌపది.
"ఓట యెకింత యేనియు సుయోధనుచిత్తమునందులేదు"అని దుర్యోధనుని మనస్తత్వాన్ని చదవగలిగిన మనస్తత్త్వ శాస్త్ర వేత్తలొ ద్రౌపది దర్శనమిస్తుంది.
దుర్యోధనుని మనస్సులో యత్ కించిత్ పశ్చాత్తాపము లేదు.నీరాయభారమవలన అతడు ఇంకా ద్వేషము పెంచుకొనే అవకాశముంది.రాయభారం విఫలమైతే అరణ్యవాసానికే అలవాటు పడడం వల్ల యుధ్ధంచేయక అరణ్యవాసానికి పోవడానికి యిష్టపడతారనుకొంట.అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది.
నామాటలవలన సంధి విఫలమైతే నిందనాపై వేయకండి,ఎదో వకవిధంగా సంధి చేసుకొండని సలహా చెప్పింది.
నిందలు నిష్టూరాలు పడటం వల్ల కలిగిన ఆవేదనను మనసులో దాచుకోలేక కోపముతో మాట్లాడుతున్నాను.ఎక్కడైనా నాలాంటి వెర్రిదానికి వివేకం వుంటుందా?" వీరడియైన మానసికి వెండి వివేకము కల్గ నేర్చునే" అని తన ఆక్రోశాన్ని, భర్తలపై గలకోపాన్ని వ్యక్తీకరించిన ది.తన వెర్రి తనానికి వారి అమాయకత్వమే కారణం అని వ్యంగ్య విసురు
ద్రౌపది దేవి ఆభిజాత్యానికి కౌరవ సభలో జరిగిన అవమానం పరాకాష్ట
తాను సామాన్యురాలు కాదనీ, అసామాన్యవ్యక్తిత్వం కలదాన్నని
"వరమున బుట్టితిన్ భరతవంశముజొచ్చితి నందుపాండు
భూవరనకు కోడలైతి,జనవంద్యులబొందితి,నీతివిక్రమ
స్థిరులగు పుత్రులంబడసితిన్ సహజన్ముల ప్రాపుగాంచితిన్
సరసిజనాభ! యిన్నిట ప్రశస్తిని నెక్కిన దాని నెంతయున్"అని ఆభిజాత్యమును వర్ణించింది.
సరిసిజనాభ! అన్న సంభోధనలో కృష్ణుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అని తెల్పి, దుష్టశిక్షణ శిష్టరక్షణ కర్తవ్యాన్ని గుర్తు చేసింది.దుష్టులైన కౌరవులను శిక్షించే సమయం ఆసన్నమైనది వ్యంగ్యంగా తెలిపింది.
నీలాంటి ఆత్మీయుడు అండగా వున్న మాకీ కష్టాలు తప్పడం లేదని బాధ వుంది.
"పంకజనాభసోదరి"అని కీర్తన జగత్ప్రసిద్ది ము.అది అమ్మ వారికే సొంతముతాను నారాయణీ స్వరూపురాలని అంతరార్థము.
పుట్టినిల్లు,మెట్టినిల్లు,ఇటుఏడుతరాలు అటుఏడుతరాలు పావనం చేసిన దొడ్డ యిల్లాలు,భర్తలా! వరప్రసాధ లభ్ధులైన మహావీరులు, కొడుకులేమో నీతివిక్రమస్థిరులు, సహజన్ముల ప్లాపు అనగా దుష్టద్యుమ్నుడేకాక శ్రీకృష్ణుడు కూడా అని అంతరార్థము.ఇన్నివిధముల గొప్పదనమున్న నాకు తిప్పలు తప్పులేదు కదా! అని అనుకోవాలి.
శ్రీకృష్ణునితో " నీవు సుభధ్రకంటె గడునెయ్యము గారవందలిర్ప సంభావన సేయదు" అన్న పద్యంలో ద్రౌపది " నీ చెల్లెలు సుభద్ర కంటె యెక్కువ ప్రేమతో గౌరవంతో చూస్తావని, అటువంటి నన్ను రాజసూయావభృదస్నానములో పెనుపొందిన జడను పెట్టుకొని నీచుడైన దుశ్శాసనుడు సభలోకి యీడ్చాడు.ఈ అవమానాన్ని యీయొదుగురు భర్తలు చూచారని బాధ పడినది.ఇందులో "ఒకండు" "యీయేవురూ " అన్న పద ప్రయోగం కేవలం తిక్కనా మాత్యునకే సాధ్యము.భర్తలను పేరు పెట్టి పిలవక పోవడం సాంప్రదాయమైతే, ఈ యైదుగురు అన్నమాటలో వారిపై వున్న గట్టి అలకను సూచిస్తుంది.
మాయాద్యూతంలో ఓడినప్పుడు నిన్ను కోడలని భావించక,దాసిగా చేసిన ఆlమహాపురుషుని(దృతరాష్ట్రుని)వద్దకు కోడలుగా వెళ్ళమంటివా ? దాసిగా వెళ్ళ మంటావా? నీవే నిశ్చయించమని కృష్ణుని కాలికి ముందే బంధం వేసింది.
ద్రౌపది తనకొప్పముడి ఆవేశముతొ విప్పి,కోడెనాగులా మెరిసిపోతున్న ఆ వల్లనో జుత్తును వేసుకొని గదచగదకంఠముతో కన్నులు నీరుకారగా "రక్కసితాల్మితో" ,చిచ్చుఒడిగట్టీనట్లు" చాలా కాలం వరకు ఎదురు చూచాను,తీవ్రతేజము గల్గు భర్తలున్నా దిక్కులేనివారికి దేవుడే దిక్కన్నట్లు నిన్నే నమ్మాను అని భారమంతా కృష్ణుని పై వేసింది
ఇక్కడ రక్కసి తాల్మి, చిచ్చోడిగట్టినట్లు, జగములు గాచునట్లు అనే పదాలు మహార్థాలను తనలో ఇమిడ్చుకొన్నాయి.ద్రౌపదీ దేవి జ్వలించే అగ్ని పర్వతంలా వుంటే ఆమె మాటలు లావాల విస్పులింగాలా వున్నాయి.
మామూలుగా ఓర్పును భూదేవితో పోలుస్తారు.కానీ ద్రౌపది దేవి వారు పెట్టిన బాధలనుతాను రక్కసితాల్మితో
పంటిబిగువుతో భరిస్తున్నట్లుగా సూచిస్తున్నాయి ఈ పదాలు.
చిచ్చుఒడిగట్టినట్లు అన్న పద ప్రయోగాన్ని గమనిద్దాము
ఆడపిల్లను అత్తారింటికి పంపేముందు ఒడిబియ్యం నింపుతారు.
అది ప్రాంతాలకొద్ది తేడాలుండొచ్చు.
కడుపు చలువకై చలిమిడి పెట్టడం కద్దు.రాయలసీమలో ఒడిలో బియ్యముతో పాటు,ఐదుయెండు కొబ్బరి చిప్పలు, కజ్జీకాయలు,పసుపుకుంకుమగాజులు మొదులైన మంగళద్రవ్యాలు నింపుతారు, తెలంగాణా ప్రాంతంలో సుమారుగా యించుమించు యింతే, సర్కారు ప్రాంతంలో మొదటిసారి చలిమిడితో పాటు బియ్యము,కంద పిలకలతో నింపుతారు.
కాని ద్రౌపది వడిలో చిచ్చుతో ఒడినింపినట్లున్నదని అన్నది.దీనిని బట్టి ఆమె మనసులో ఎంత బాధవుందో అర్థం చేసుకోవచ్చు.
ద్రౌపది దేవి ఆగ్రహిస్తే అపరకాళి, అనుగ్రహిస్తే ఆపరశాంత మూర్తి.తనకుమారులైన ఉపపాండవులను నిర్ధాక్షిణ్యంగా నిద్రపోతున్న వారిని అర్ధరాత్రి హత్యచేసిన అశ్వత్థామను చంపవద్దని తన భర్తలను వేడుకొన్న దయా హృదయ.తనకు కలిగిన పుత్రశోకం గురువర్యులైన ద్రోణాచార్య పుత్రునికి కలగరాదని సహానుభూతిని వ్యక్తం చేసిన మహోన్నత వ్యక్తి ద్రౌపది. భారత మహిళా మణులలోద్రౌపది మేరుశిఖరము.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి