శివమానస పూజ

పరమేశు ప్రార్థింతు భక్తితో నేనింక
బాహ్యోప చారాల భయము వీడి
మదిలోన నేనంత మాహేశు సన్నిధి
కల్పించు కొంటిని కనుల ముందు
మనసులో నేనింక మహనీయ మూర్తిని 
ధ్యానింతు పూజింతు తత్త్వ మెరిగి
రత్న పీఠమున రవిచంద్ర దీపాలు వెలిగించి
అర్చనంబొనరింతు నార్తి మీర

హాయినొసగునట్టి నాహ్లాద మౌనట్లు
మజ్జనంబొనరింతు మనసుతీర
దిక్కుల న్నియు నీకు దీటైన వస్త్రాలు
వ్యాఘ్రాజినంబంత వస్త్రమేమొ
చందన చర్చతో చంద్రశేఖరుపూజ
చెలువారచేసితి చేతులార
మారేడు నీవంచు మారేడు దళముల
మదిలోనె పూజింతు మారుమారు
హృదయార విందాన్ని హృద్యమౌ నట్లుగా
అర్పణంబొనరింతు నాస్తతోన
దుర్వాసనంతయు దూరమ్ము చేయగా
ప్రార్థింతు ధూపమ్ము పగిది నింక
అజ్ఞాన తిమిరాన్ని నంతంబు చేయగా
జ్ఞానంపు దివ్వెగా జ్ఞాన మివ్వు
పరమాత్మ మదిలోన పంచభక్ష్యములంట్లు పంచేంద్రియములన్ని
అర్పింతు నీకింక నన్యమేల
నిండుమనసుతోన నీరాజ నంబంత
అర్పింతు నేనింక నార్తి తోడ
మాయమర్మములేని మదినంత నర్పింతు
మంత్రపుష్పంబుగా మనసులోన

 




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత