పురందర దాసు జీవితసంగ్రహం

కర్ణాటక శాస్త్రీయ సంగీతానికీ గట్టి పునాదులు వేసిన వాగ్గేయకారుల్లో పురందరదాసు అగ్రేసరులు.అందుకే ఇతనిని కర్ణాటక సంగీత పితామహుడని ప్రఖ్యాతి వచ్చింది.సంగీత సాహిత్యాలలో పురందరదాసులది అందెవేసిన చేయి.
సంగీత విద్యను అభ్యసించే భవిష్యత్తారలకు చక్కని శిక్షణా ప్రణాలికను ఏర్పరచారు వీరు.తన అజరామరమైన  భక్తి భరితమైన సంగీత కృతులతో కీర్తన భక్తినిఅత్యున్నత శిఖరంపై నిలిపిన
వాగ్గేయ కారుడు పురందరదాసులు.
"శ్రవణం కీర్తనం, విష్ణోస్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ
నివేదనం"అనే నవవిధ భక్తి మార్గాల్లో మన పురందరదాసులుకీర్తనభక్తిని ఆశ్రయించారు.
"నామస్మరణ ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే" అన్న పెద్దలమాట ననుసరించి భవసాగరమును తరించడానికి నామస్మరణ అనే నావకన్నా మించిన సాధనం మరొకటి లేదుగా!
భగవంతుడు అపారకరుణా సముద్రుడు.సంసారసాగరంలొ దారీతెన్నుతెలియక కొట్టుకు పోతున్న జీవులను దరిజేర్చి కాపాడడమే అతని లక్ష్యము.అందంకోసం అతడు ఎన్ని అవతారాలైనా భగవంతుడు ఎత్తుతాడు.భగవంతుని అనుగ్రహానికి పాత్రుడైన మూగవాడు గొప్ప వక్త కాగలడు,కుంటివాడు సముద్రాన్నిలంఘించగలడు.అట్లే భగవత్సంకల్పముంటే ప్రేమ పిసినారి త్యాగమూర్తి గా భక్తుడుగా మారగలడు.అందుకు మనపురందరదాసులె నిలువెత్తు నిదర్శనం.
పురందరదాసు అసలు పేరు శ్రీనివాసనాయకుడు.మహారాష్ట్రంలోని పులిందర్ ఘడ్ లో నివసించే వాడు.ఇతనిది వడ్డి వ్యాపారం.విలువైన వస్తువులను తాకట్టు పెట్టుకొని అధిక వడ్డీలకు అప్పులిచ్చేవాడు.అతని వద్ద అపారధనరాసులు మూలుగుతున్నాయి.అతని వద్ద ఎంతధనముందో అంచనా వేయలేక ఆ వూరి ప్రజలు అతనికో బిరుదిచ్చారు. నవకోటి నారాయణా అని గుసగుసలు పోయేవారు.ఇలా మనశ్రీనివాసుడు కోట్లకు పడగలెత్తాడు.అత్యాస,పిసిని గొట్టుతనము అతని స్వరూప లక్షణాలుగా బంధువులనుకొనేవారు
"ధనమూలమిదం. జగత్"(డుడ్డే దొడ్డప్ప) అనిగట్టిగా నమ్మేవాడు.ఇలా అతని జీవితంమూడు తనఖాలు ఆరు తాకట్లుగా సాగిపోతుంది.
కాలం ఎప్పుడు ఒకేలా సాగదు కదా!
జగన్నాటక సూత్రధారి తానే పాత్రధారిగా మారి నవకోటి నారాయణజీవితానికి అర్థం పరమార్థం తీసుకురావాలని భావించినట్లుంది. శుభస్యశీఘ్రం అన్నది జగన్మాత. చివరకు ఆ మంచిరోజు రానే వచ్చింది.శ్రీమహావిష్ణువు పేదవిప్రుని వేషం ధరించిమనకథానాయకుని సమీపించి "అయ్యా! నేను కడుపేదను.నేను నాకుమారునకు ఉపనయన సంస్కారంచేయించ దలచాను.గర్భాష్టమములోనే ఈ కార్యం చేయాలని మీ బోటి పెద్ధలు చెప్పారు."జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః "అన్నది శాస్త్రం.నేనా రిక్థుడను.చేతిలో చిల్లిగవ్వ లేదు.మీ బోటి పెద్దలు సహాయము లేనిదే ఈ ఉపనయనం సంస్కారము పూర్తికాదు.అందుకే మీవద్ద ధనసాహాయానికై వచ్చాను."అనిపలువిధములుగా అభ్యర్థించాడా మాయా విప్రుడు.
నవకోటి నారాయణ మన విప్రుని విజ్ఞప్తిని వినీ విననట్లు గా వున్నాడు.చివరకు విసుగొచ్చి"నేను ప్రస్తుతం చాలా పనిలో వున్నాను తరువాత రమ్మం"టు ఇలా ఆరునెలలపాటు కాలక్షేపము చేశాడు.ఇవ్వాలని మనసులో వుంటేకదా ఇవ్వడానికి.కాని మన పేదబాపడు పట్టువదలని విక్రమార్ఖుడిలా నగలదుకాణానికి వస్తూపోతున్నాడు.చివరికి మన నవకోటి నారాయణనునకు విసుగొచ్చింది.ఇక తప్పదురా నాయనా! అని అనుకొని అరిగిపోయిన చెల్లుబాటుకాని  నాణాన్ని ఆ పేద బ్రాహ్మణుని ముఖాన కొట్టినంత పనిచేశాడు.మనపేద విప్రుడు నిరాశతో వెనుదిరిగాడు.కాదుకాదు వెనుదిరిగి నట్లు నటించాడు .మరోకొత్తనాటకానికి తెరదీశాడు.తాకట్టుకొట్టునుండి  బయలుదేరి నేరుగా శ్రీనివాసనాయకుని  ఇంటికి చేరుకొన్నాడు.పిసిని గొట్టు పతికి పెద్ద మనసున్న భార్య లభించడం దైవలీల.ఈమేపేరు సరస్వతి.దయగలతల్లి.పరమసాత్వికురాలు.పరోపకార పరాయణత్వం గలది.ఆమె మనపేద విప్రకుమారుని ఉపనయనం వృత్తాంతము విని అతనికి సహాయము చేయాలని నిశ్చయించుకొంది.నిశ్చయం మనసులో వచ్చిన ధనం పైనుంచి రావలసిందేకదా! ఎంతైనా ఆమె భర్త చాటు భార్య.పోపుల డబ్బాల్లో చీరమడతల్లో ధనం దాచే అలవాటు ఆమెకు లేదనుకొంట.చివరకు తన పుట్టినింటినుండితనఆస్తిగా వచ్చిన తన ముక్కెరను అతని చేతిలో బెట్టి కృష్ణార్పణమని నమస్కరించింది.
ముక్కెరను తీసుకొన్న పేద బ్రాహ్మణుడు నేరుగా మననవకోటి నారాయణుని దుకాణానికి వెళ్ళి ఆ ముక్కెరను అమ్మజూపాడు.తన భార్యముక్కుపొడకను గుర్తించిన వాడై ఏమి తెలియనట్లుగా,ఇప్పటికే ఆలస్యమైనది.ఈ ముక్కుపుడకకు తగిన  ద్రవ్యాన్ని రేపు ప్రొద్దున్నే మీకిస్తాను.ప్రస్తుతానికి వెళ్ళిరండని పలికాడు.అలానే అంటూ మన పేదబ్రాహ్మణుడు నిష్క్రమించాడు.ముక్కుపుడకను జాగ్రత్తగాపెట్టెలో  భద్రపరచి హడావుడిగా ఇంటికి బయలుదేరాడు.
ఆఘమేఘాల పై యింటికి వచ్చాడు.వచ్చిన వెంటనే "సరస్వతీ! సరస్వతీ! అంటూ భార్యను ఏదో పనివున్నవాడిలా పిలిచాడు.అమె అలారాగానేఎదో యథాలాపంగా మాట్లాడినట్లు మాట్లాడుతూ"ఎదినీముక్కు పుడక?"అని ప్రశ్నించాడు.ఇన్ని సంవత్సరాలకాలం కాపురంలో భర్త స్వభావాన్నికాచివడబోసిన దొడ్డ  యిల్లాలు,రాబోయె ఆపదను గుర్తించింది.ఉపనయనం నిమిత్తం పేద బ్రాహ్మణునికి దానంఇచ్చానని తెలిస్తే,అగ్గిమీద గుగ్గిలమవుతిడని,ముక్కుపుడక కొరకు రాచిరంపాన పెడతాడని గ్రహించి,ఇంతకన్నా ప్రాణం పోవడం మేలని గ్రహించి విషంత్రాగడానికి సిద్ధపడింది.విషంచిన్న గిన్నెలో పోసి త్రాగడానికి సిద్ధపడింది.ఇంతలో గిన్నెలో ఎదో వస్తువు కదలినట్లనిపించింది.గిన్నెలోనికి తొంగి చూచిందీ.తీరాచూడగా అది తనముక్కుపుడకే. భర్తకు ఆ ముక్కుపుడక చూపించింది.శ్రీనివాసనాయకునకుఆశ్చర్యముతో నోటమాట రాలేదు.ఎందుకంటే తాను ఆ ముక్కు పుడక ను అతి జాగ్రత్తగా ఇనప్పెట్టెలోపెట్టాడు.అలా  భధ్రపరచిన ముక్కు పుడక ఇక్కడికేలా వచ్చింది? తనకండ్లను తాను నమ్మలేక పోయాడు.వెంటనే తన నగలదుకాణానికి పరుగు పరుగున వెళ్ళి తాను భద్రపరిచిన ముక్కు పుడకకై వెదికాడు.ఊహూ! ముక్కుపుడకశకన్పించలేదు.
అతని హృదయం అల్లకల్లోలమైనది.మానసిక సంఘర్షణకు అతను గురియైనాడు.గత ఆరునెలలుగా తనకుమారుని ఉపనయనానికి ధనమును యాచిస్తున్న బ్రాహ్మణుడు నిజమైన యాచకుడుకాడు.తనకు జ్ఞానోదయం కలిగించడానికై ఆ భగవంతుడే ఈ రూపంగా వచ్చాడన్న సత్యం అవగతమైంది.తనపైన తనలోభిత్వం పైనా విపరీతమైన అసహ్యం కలిగింది.సాక్షాత్తు భగవంతుడే తనదగ్గరకు వస్తే గుర్తించ లేని తనధనమంధాదతపై ఏవగింపుకలిగింది.తుఛ్ఛమైన యైహిక సుఖాలపై విరక్తి కలిగింది.
కృష్ణార్పణమంటూ తనయావదాస్తిని సకల సంపదలను దానం చేశాడు.అప్పటి నుంచి శ్రీ నివాసనాయకుడుకాస్తా హరిదాసుడైనాడు.నవకోటి నారాయణుడు నారాయణ భక్తుడైనాడు.
ఘల్లు ఘల్లున ధ్వనిచేస్తూ ధనము లెక్క పెట్టె చేతులు కాస్తా తంబూరనుమీటనారంభించాయి.బంగారు ఆభరణాలు ధరించే అతని కంఠసీమ తులసి మాలలతో నిండిపోయింది.అతని పూర్వపుణ్యవశమున అతనికి గొప్పగురువు లభించాడు.పరమహంసపరివ్రాజకా చార్యులైన వ్యాసరాయలవంటి గురువు లభించడము ఎంత అదృష్టము.శ్రీనివాసనాయకునకు మంత్రదీక్షను ప్రసాదించి, పురందరదాసుడని నామమును అనుగ్రహించాడు. ఆనాటినుంచి మన శ్రీనివాసనాయకుడు  పురందరదాసుగా  జగత్ప్రసిద్దుడైనాడు.
"పురందర విఠల" అనుమకుటమును ప్రసాదించాడు.
కాలక్రమేణా పురందరదాసు విజయనగర రాజధానియైన హంపీనగరానికి చేరుకున్నాడు.
వేకువ ఝామునే లేచి స్నానసంధ్యాది నిత్యకృత్యములను తీర్చి తన పాదములకు గజ్జెలు కట్టుకొని తంబూరను మీటుతూ హరిసంకీర్తనలను ఆలపిస్తూ నగరసంకీర్తనలను చేసేవాడు.ఆ హరికీర్తనలను విన్న పురజనులు భక్తి తన్మయత్వంతో మునిగిపోయే వారు.అవి వారి హృదయాలను స్పర్శించి వారి మనోమాలిన్యాలను కడిగి వేసేవి.వారందరు పురందరదాసు ను అపరనారదావతారముగా భావించేవారు.
పురందరదాసుబోధనలు అతని జీవితము బింబప్రతిబింబాలవంటివి.తాను బోధించినది ఆచరించి చూపేవాడు.ఆత్మశుధ్ధిలేని ఆచారాలను అనాచారములంటు నిరసించాడు.మనోవాక్కాయకర్మల ద్వారా పవిత్రతను పొందడమెలానో తన ఆచరణ ద్వార ప్రపంచానికి చూపించాడు.
తాను  సంకీర్తనలు ఆబాలగోపాలానికి సులభంగా అర్థమయ్యే  రీతిలో రచించారు.భావానికి తగ్గభాషను ఉపయోగించాడు.సామాన్యంగా ఆధ్యాత్మిక విషయాలు అంత సులభంగా అర్థం కావు‌.కానీ పురందరదాసులు తన అనితర సాధ్యమైన రీతిలో ఆధ్యాత్మిక రహస్యాలను అరచేతి అరటిపండులా వివరించి చెప్పగలడు.ఇదే పురందర దాసు లోని ప్రత్యేకత.ఆందుకే పురందర దాసు కీర్తనలలో సూక్తులు,సామెతలు నేటికి జనుల నిత్యజీవితములో దొర్లుతుంటాయి.
పురందర దాసుమూర్తిమత్వానికి అతని సంకీర్తనలే  ప్రత్యక్ష నిదర్శనాలు.పరోపదేశే పాండిత్యము కాక ఆచరణలో చూపించాడు.పురందరదాసు రచనల్లో కొంతభాగం అతని క్రమాను గతమైన ఆధ్యాత్మిక ప్రగతిని తెలియజేస్తాయి.తదనంతర కీర్తనల్లో అతని ఆధ్యాత్మిక అనుభూతులు,భక్తితత్పరత వివేక వైరాగ్యాది విషయాలు చర్చను మనం గమనించవచ్చు.ఇంత విస్తృతమైన సృజనాత్మక సాహిత్యము మీరే వాగ్గేయకారులలో కనబడవని పెద్దలంటారు.పురందరదాసుగురువరేణ్యులైన శ్రీవ్యాసరాయలే వీరికృతులను పురందరోపనిషత్తని శ్లాఘించారు.
పురందర దాసు 475000వరకు కీర్తనలను  వ్రాసినట్లు సంగీతజ్ఞుల అభిప్రాయం.ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించవచ్చు.కాని కాదని కొట్టి వేయలేము కూడా.పురందరదాసులు క్రీ.శ.1480నుంచి 1564 వరకు జీవించాలని చరిత్రకారులు నిర్ణయం.అంటే 84 వసంతాల జీవితంలో 50 సంవత్సరాలు హరిదాసుగాసుదీర్ఘజీవితం  గడిపాడు సంగీతసాహిత్య పారంగతులై  భక్తిరసములో ఓలలాడిన వీరికి 475000 కీర్తనలు రచించడం ఓలెక్క కాదు.ఉదయం భిక్షాం స్వీకరణానంతరం మిగిలిన సమయంలో నిరంతర సంకీర్తనా మహాయజ్ఞం సాగించవచ్చు.అసలు యైదు లక్షల కీర్తనలు వరకు రాయాలని సంకల్పించారట.తనసంకీర్తనలన్నిటినివాసుదేవన నామావళియ అని అనేవారట.
వీరుదివంగతులైన మరుసంవత్సరమే.అంటేశక్రీ.శ.1565వ సంవత్సరం లోతళ్ళికోట యుద్ధంలో  విజయనగర సామ్రాజ్యం పతనమైంది.దురదృష్టవశాత్తు సంభవించిన ఆ అల్లకల్లోలములో పురందర దాసు కీర్తనలు చాలావరకు కాలగర్భములో కలిసిపోయాయి.వీరితరువాత నూటాయాభై సంవత్సరాల తరువాత జీవించిన విజయదాసుద్వారనే పురందర దాసుని జీవితముళవారిరచనలు వెలుగులోనికి వచ్చాయి. పురందర దాసు మన పదకవితా పితామహుడుఅన్నమయ్యకుసమకాలికుడు.ఇది సంక్షిప్తముగా పురందర దాసు జీవితం చరిత్ర.
మరో వ్యాసములో పురందరదాసులభక్తి సంగీత సాహితీ వైభవాలను గురించి తెలుసుకొందాము.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత