ఆది శంకరులు జీవితము- సందేశం.(రేడియో ప్రసంగము)

"సదాశివ సమారంభాం శంకరాచార్య
మాధ్యమాలు
అస్మదాచార్య పర్యంతాం వందే గురు
పరుశురాం"
"శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవతపాదశంకరం లోక శంకరం"
నేడు ఆదిశంకరులు జయంతి
ధర్మస్థాపన కై మహాత్ములు మహాపురుషులు అవతరించి అవనిపై
ఆనందామృతమును వర్షించి,మంచిని పెంచి మార్గనిర్దేశనము చేసి తమజీవనయాత్రను దిగ్విజయంగా ముగిస్తారు. అటువంటీ వారికోవలో అగ్రగణ్యులు ఆదిశంకరులు అవతరించిన గొప్ప దినం.
క్రీ.శ.785 వ సం.రం వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆర్యొంబ శివగురువులనే పుణ్యదంపతుల తపః ఫలంగా ఈశ్వర ప్రసాద లభ్ధంగా జన్మించారు.అందుకే శంకరం శంకరం సాక్షాత్"
వ్యాసో నారాయణో హరిః"
అని వారి శిష్యుల పలుకు అక్షర సత్యం.
అది శంకరులు అవతరించిన కాలంలో
భరతవర్షము గొప్ప సంక్షోభం లో కూరుకు పోయింది.ఆ సంక్షభిత సమయంలో రాజకీయ సామాజిక, సాంస్కృతిక పరిస్థితులలో ఒక ఆశాకిరణం లా ఆదిశంకరుల ఆగమనం జరిగింది.
వేదమార్గభ్రష్టులై మిక్కిలి భయంకరమై జుగూప్సా కరమైన వామాచార కౌళాచారాది శుధ్ధతంత్ర శాస్త్రములనుసరీంచే వారొక వైపు,చార్వాకాది నాస్తిక దర్శనాలోకవైపు చెలరేగి పోతున్నాయి.అవి కేవలం భౌతికసుఖలా పరమావధిగా భావిస్తు బోధిస్తున్నాయి.ఇక స్వర్గలోక సుఖాలను బోధించే పూర్వమీమాంసకులు  యజ్ఞయాగాదులపైనే దృష్టి నిలిపిస్వర్గలోకానికినిచ్చెనలువేస్తున్న కాలం.కరుణకు త్యాగానికి కేంద్రబిందువైన బౌద్ధ మతం బుధ్ధ నిర్యాణానంతరం హీనయాన మహాయాన వజ్రయానములుగా చీలిపోయింది.పైగ సంఘ శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి అంటు అంటు ఆధ్యాత్మికతను అటకెక్కించడం జరిగింది.శైవవైష్ణవ గాణాపత్య స్కాంద సౌరములనె మతశాఖలు తమ మాత్రమే సర్వోష్టృమని మతాల పేరుతో మారణహోమాలు చేసుకొంటున్న కాలమది.ఆ మతాలలో కూడా కొన్ని అవాంజనీయములైన ధోరణులు ప్రబలాయి.
ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు బోధించే ఆత్మతత్త్వం కొందరికే పరిమితమై మున్యాశ్లమాలకే పరిమితమైనది.
ఇటువంటి క్లిష్ట సమయంలో ఆదిశంకరులు తన ముప్పది రెండు సంవత్సరాల అల్పవయస్సులోనే  భారతదేశ మంతటా ముమ్మారు పర్యటించి భారతదేశాన్ని అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు
"బ్రహ్మ సత్యం జగన్మిథ్య
జీవో బ్రహ్మైవ నాపేరః"
(బ్రహ్మమొకటే సత్యము ,ఈ చరాచరాత్మక జగత్తు మిథ్య అంటే నిత్యపరిణామశీలమైనది) అని ఘంటాపథంగా తేల్చి చెప్పారు.అద్వైత తత్త్వం సర్వ వేదసారమని నిగ్గు తేల్చారు.
ఆదిశంకరులు విశ్వానికందించిన అద్వైత తత్త్వము సర్వకాలీనమైనదని విశ్వజనీనమైనదని ప్రాచ్య  పాశ్చాత్య తత్త్వ వేత్తలు అంగీకరించారు.
ఆదిశంకరులు ప్రపంచానికి అతిముఖ్యమైన విలువైన  బహుమతినందించారు. అదే వారి ప్రస్థాన త్రయ భాష్యం.ఉపనిషత్తులు,బ్రహ్మసూత్రాలుభగవద్గీత ఈ మూడింటిని ప్రస్థాన త్రయమంటారు.
ఈ ప్రస్థాన త్రయానికి విపులమైన విస్తృతమైన వ్యాఖ్యను సులభశైలిలో అందించిన వీరిప్రతిభ ఆనన్యమూ,అనితర సాధ్యము రామానుజ మధ్వాచార్యులు విశిష్టాద్వైత ద్వైత సిధ్ధాంత భాష్య రచనలు ఆదిశంకరుల వరవడిలోనే  సాగాయి.
మహాభారత సముద్రంలో నిక్షిప్తమైన భగవద్గీతను భీష్మపర్వమునుంచి,విష్ణుసహస్రనామస్తోత్రమును అనుశాసనిక పర్వం నుంచి వెలికితీసి,వాటికి విస్తృత వ్యాఖ్యానాలు వ్రాసి మనకందించారు
. భ ఎంతారతీయత లోని భిన్నత్వంలో ఏకత్వమును దర్శించి, భారతదేశసమైక్యతకు విశేషకృషి చేసిన వారిలో ఆదిశంకరులు సర్వప్రథములు.పరివ్రాజకులుగా ఆసేతుశీతాచలపర్యంతమూ ముమ్మారు పాదచారులై పర్యటించి తమసంవాదాలద్వార చర్చల ద్వారా సనాతన ధర్మ ఏకాత్మకతను చాటిచెప్పారు."ఏకం సత్ విప్రా బహుదా వదంతి" అనేవేదోక్తిని  ఆచరణాత్మకంగా తెలిపి ,షణ్మతస్థాపనాచార్యులైనారు.
భారతదేశ సమైక్యతా స్మగ్లర్లను దృష్టిలో పెట్టుకొనే దేశంనలుమూలలో నాల్గు ప్రధాన మఠాలను స్థాపించారు.దక్షిణమున శృంగేరి,ఉత్తరమున బద్రి, పశ్చిమమున ద్వారకా, తూర్పున పూరి మఠములను నెలకొల్పిన క్రాంతి దర్శి ఆదిశంకరులు.ఈ పీఠములు నాల్గు వేదములను నాల్గు మహా వాక్యాలను పరివ్యాప్తం చేస్తూ,ఆయా ప్రాంత ప్రజానీకానికి ఆధ్యాత్మిక  ధార్మిక మార్గనిర్దేశకత్వం నేటికీ చేస్తున్నాయి.
ఆదిశంకరులు బహుముఖీన ప్రతిభాపాటవాల కలబోత యనిచెప్పవచ్చు.వారిది అనన్య సామాన్య వ్యక్తిత్వం మన అవగాహనకు అతీతము అని చెప్పక తప్పదు.తత్త్వవేత్త,కవి ,సంఘసంస్కర్త,మానవతావాది ఇలా ఆదిశంకరులు లో అనేక పార్శ్వాలున్నాయి.సోదరి నివేదిత ఇదే విషయాన్ని పేర్కొంటు" ఆదిశంకరులు అద్భుత వ్యక్తిత్వము పాశ్చాత్యల అవగాహనకు అతీతమైన విషయము.ఆదిశంకరులలోని ఈ అద్భుత సమ్మేళనం మును చూచి మనం ఆశ్చర్యచకితులను కావలసిందే ప్రాన్సిస్ అసిస్ లోని భక్తి తత్పరత, అబే లార్డ్ లోని మేధాసంపత్తి,మార్టిన్ లూథర్ లోని శక్తివంతమైన స్వేఛ్ఛానురక్తి, ఇంగ్లీషా లయోలా లోని మొక్కవోని కార్యదీక్ష  ఇవన్ని ఆదిశంకరులు లో మనం ఒకసారి చూడవచ్చు"అని అన్నారు.
సన్యాసులకు యతీశ్వరులకు ఆదిశంకరుల జీవితం ఆదర్శప్రాయుడు.ఆదిశంకరులకు తల్లిపై ప్రేమ అపారము.తల్లికి ఎటువంటి కష్టము కలిగినా తల్లడిల్లేవాడు.ఈ సందర్భంగా ఆదిశంకరుల బాల్యంలో కలిగిన రెండు సంఘటనలను ముచ్చటిస్తాను.
ఒకమారు తల్లి ఆర్యాంబ స్నానానికి పూర్ణానదికి వెళ్ళింది.ఎండతీవ్రతకు కళ్ళు తిరిగి పడిపోయింది.ఇది తెలిసిన శంకరులు పొరుగు పరుగున వెళ్ళి అమ్మకు సపర్యలు చేశాడు.అంతటిఆగకుండా తన తల్లికి భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా పూర్ణానదిని తన ఇంటి ముందే ప్రవహింపచేయమని ఆనందిని ప్రార్థించి ,ఆ కార్యంలో సఫలీకృతుడైనాడు.
తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఆమె అంత్యసమయంలో వచ్చి ,తల్లికీ సపర్యలు చేసి,ఆమె మరణానంతరం పుత్రినిగా ఆమె అంతిమ సంస్కారమును కావించి పుత్రునిగా తన బాధ్యతలను నిర్వహించి ఆదర్శప్రాయుడైనాడు.
యతీశ్వరులైనా జన్మదాతయైన తల్లికి దండప్రణామములను సమర్పించే సత్సాంప్రదాయాన్ని నెలకొల్పాడు.
ఆది శంకరులు దయా హృదయానికి సంబంధించిన కనకధారస్తవ ఆవిర్భావానికి సంఘటన యిది.
బాల శంకరుడు గురుకులంలో విద్యనభ్యసిస్తున్న  రోజుల్లో  బ్రహ్మచారిగా భిక్షాటనకై  వెళ్ళాడు.
"భవతి భిక్షాందేహి"అంటూ బిక్షను అర్థించాడు.ఇ ఇల్లాలు నిరుపేద.ఆమె ఇల్లంతా వెదికి వెదికి బిక్షార్థియై వచ్చిన బ్రహ్మచారిని నిరాశపరచలేక ఉసిరికాయను బిక్షగా అర్పించింది. బాలశంకరులకు ఆమెదీనస్థితికి హృదయం ద్రవించగా,ఆమెకు సిరి సంపదలు ప్రసాదించాలని మహాలక్ష్మిని కనకధారా స్తవముద్వారా స్తుతించి కనుక వృష్టిని కురిపింపజేశాడు.
నర్మదా నదికి వరదలు వచ్చి గ్రామాలకు గ్రామాలు కొట్టుకు పోతుండగా ప్రజల ఆర్త పాదాలను విన్న ఆదిశంకరులు నర్మదా నదిని స్తుతించి ప్రజలను కాపాడాడు.
ఇలా యతీశచవరులకు కలసామాజిక బాధ్యతను ఆచరించి తరువాతి తరం వారికి మార్గదర్శకులైనారు.
ఆదిశంకరులు గొప్ప కవి.వ్యాసవాల్మీకి కాళిదాసాది కవులకేమీ తీసిపోనట్టి కవిత్వ రచనా  దురంధరుడు.వివేకచూడామణి అని తన ఫ్రకరణ గ్రంధం లో మహాత్ముల స్వభావాన్ని కవితామయంగా వర్ణించాడు." శాంతో మహాంతో నివసంతి సంతః వసంతవల్లోక హీతం చరంతః' అనే శ్లోకంలో ఆమని సమస్త చరాచర సృష్టికంతా ఆనందం కలిగీంచి మంచిని చేస్తుందో ,అలాగే శాంతస్వరూపులైన మహాత్ములు తమకు ఏ ప్రయోజనము లేకుండినా ఇతరులకు ఉపకారం చేస్తారు.భయంకరమైన సంసార సముద్రాన్ని తాము తరించి ఇతరులను తరింప జేస్తారు. అని మహాత్ముల ఔన్నత్యాన్ని అలతి అలతి పెదాలతో  అందంగా వర్ణించారు.
వేదాంత తత్త్వాన్నే కాదు భక్తి భరితమైన గొప్పభావనలను కూడా అమృత ప్రాయమైన రీతిలో వర్ణించాడు
",ఆవినయమపనయ విష్ణోః దమయమనః విషయమృగతృష్ణోయం
భూతదయాం విస్తార తారయ సంసార సాగరం" ఓ శ్రీహరీ!  నా అహంకారాన్ని తొలగించి, వినయమును ప్రసాదింపుము, చంచలమైన నా మనస్సును నిగ్రహించి,నీచరణములను ఆశ్రయించునట్లుగా చేసుకొమ్ము.విషయసుఖాలనే ఎండమావుల వెంట పడకుండా ,నిన్ను కాపాడి,ఈ సంసారసాగరము నుండి నన్ను తరింపచేయుము."అని ఈ చిన్న శ్లోకమున అనంతమైన గంభీరమైన అర్థమును ధ్వనింప జేసారు.ఇలా రచన చేయడం ఆదిశంకరులకు వెన్నతో పెట్టిన విద్య.
మహాకవి శ్రీశ్రీ తాను రచించిన "పదండి ముందుకు పదండితత్రోసుకు పోదాం"అని తన మహా ప్రస్థానగీతానికి స్పూర్తి "భజగోవిందం భజగోవిందం భజ మూఢమతే"అనే ఆదిశంకరుల శ్లోకం పాదం స్పూర్తినిచ్చిందని తెలిపాడు .ఇలా ఆదిశంకరులు తరువాతి తరాలకు పలురీతులా ప్రేరణ నిచ్చాడు.
పరివ్రాజకులుగా సంచారం చేస్తున్న సమయంలో సమాజంలోను, వ్యక్తుల్లో ను ప్రబలిన దురాచారాలను దుర్లక్షణాలను గమనించి వాటి నిర్మూలనకై పాటు పడ్డాడు. వారి భజగోవింద స్తోత్రంలో మనం ఈ అంశాన్ని గమనించ వచ్చు.
"మూఢ! జహీహి ధనాగమా తృష్ణాం కురుసద్భుధ్ధిం మానేసి వితృష్ణాం
యల్లభసే నిజకర్మో పాత్తం విత్తం తేనె వినోదయ  చిత్తం."
అధికంగా ధనం సంపాదించాలనే ఆశవల్లనే కదా పలుసమస్యలొచ్చాయి,ఎంత తిన్నా పట్టెడు మెతుకులేకదా! అనే జ్ఞానం వుంటే అవినీతికి,అక్రమార్జనకు పోవడం జరగదుకదా! అని హెచ్చరించారు.సంపద వల్ల సుఖం లభిస్తుందని నమ్మి మానవుడు ధనసంపాదనకై కష్టపడుతుంటాడు.అటువంటివారిని హెచ్చరించడానికై "అర్థమనర్థం భావయనిత్యం నాస్తితతః సుఖలేశత్వం"అని హెచ్చరించాడు.ఇలా సమాజ హితం కొరకు శంకరులు ఎన్నో అమూల్యసందేశాలను అందించారు.
ఆదిశంకరుల రచనలు జీవితము రాబోయే తరాలకు మార్గనిర్దేదకత్వాలై నిలుస్తాయి. భారత దేశ తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియా,గ్రంధములో "ఆది శంకరులు
అమేయమైనశక్తికి అనంతమైన విస్తృతమైన క్రియాశీలతకు ప్రతిరూపం.సామాన్యమైన సానువుల్లో ఏకొండగుహల్లోనో అరణ్య ములలోనో ముక్కుమూసుకొనే ఫలాయన వాదికాడతడు.వ్యక్తిగత స్వార్థ పరతలేని ఉత్తమ వ్యక్తిత్వం అతనిది" అని ప్రశంసించాడు.
"లోకే గురువొ బహవస్సంతి శిష్యవిత్తాపహారకః
త్వమేవం శంకరం వందే శిష్యసంతాపహారిణ"లోకంలో శిష్యవిత్తాపహారుకులైన దొంగ గురువులకు లెక్కేలేదు.కానీ శంకరా! శిష్యు హృత్తాపహారకుడవు నీవొకడివే"అన్న ఆర్యొక్తి అక్షర సత్యం.
ఆదిశంకరుల అద్భుత వ్యక్తిత్వం వారి బోధనలు విశ్వజనీనములు.అవి మనకు ప్రేరణా దాయకములు కావాలని ఆశిస్తూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.




.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత