సుశీలమ్మ మొగుడు
అ పాండురంగ విభుని --సుశీలమ్మకథ
-----------------------------------------------_-
బంగారాన్ని కాల్చిన కొద్ది వన్నె పెరుగుతుంది.వజ్రాన్ని సానబెట్టినకొద్ది మెరుస్తుంది.భక్తుని భగవంతుడు పరీక్షలు పెట్టినకొద్ది భక్తుని భక్తి పరాకాష్ట చెందుతుంది.
పాండురంగ విభుని లేఖిని నుండి(మీ తృప్తికొద్ది ఘంటమునుండి)
లిఖించబడిన పాండురంగ మాహాత్మ్యం చతుర్థాశ్వాసంలో జాలువారిన పరమభక్తురాలైన సుశీలమ్మకథ యిది.పాండురంగవిభుని పదగుంఫనము అని జగత్ప్రసిద్ది.రామకృష్ణుని పదవైభవాన్ని అవలోకిద్దాము.
సుశీలమ్మ గురించి తెలుసుకొనే ముందు ఆమె భర్తను గురించి పరిచయం చేసుకొంటాము.
"కన్యావరయతే రూపం" అంటారు పెద్దలు.ఏ ఆడపిల్లైనా తనభర్త అందంగా వుండాలని కోరుకొంటుంది.అది సహజము.కానీ మనసుశీలమ్మ భర్త రూపహీనుడు.రూపాన్ని ఏంచేసుకొంటాము? కొరుక్కు తింటామా! గుణం మంచిదైతే చాలనుకొంటాము
రూపహీనుడే కాదు.మహాక్రోధనుడు.ఎప్పుడు నిప్పులు గ్రక్కుటుంటాడు.కోపిష్టి అయితే ఏమిటి పెండ్లాన్ని బాగా చూసుకొంటే చాలదా ! అనుకొంటారేమో!అతడు అతిలోభి.ఇక మీ అందరికీ అర్థమయ్యే వుంటుంది,పెండ్లాన్ని ఎంతబాగాచూచుకొంటాడో!
బధ్ధమత్సరుడు.మిక్కిలి అసూయాపరుడు.ఇతరులు సుఖంగా వుంటే కళ్ళలో నిప్పులు పోసుకొనేరకము.
"అన్య బుధ్ధి"అంటే చెడ్డ బుధ్ధి.కలవాడన్నమాట.అసూయకు, చెడ్డ బుద్ధికి, దగ్గర సంబంధము.దానితో యితరులను సుఖపడనీయడు,తాను సుఖపడడు.ఇన్ని అర్హతలు వున్న వ్యక్తిని ఏ బంధువు ఆచరిస్తాడు చెప్పు? సకల బంధువిరోధి అన్న బిరుదుకు అర్హత సాధించాడు.బంధువులొస్తే డబ్బుదండగ అని బాధపడేరకం.ఇతరులను నొప్పించి ఒప్పించడానికో ,ఒప్పించి నొప్పించడానికో ఏమోగాని ఇతనికొక బ్రహ్మాస్త్రం వుంది.అదేమంటే ప్రతి చిన్న విషయానికి, ఒట్టుపెట్టనిదే తోచదు. అందుకే "బహుశపథోక్తి లంపటుడు కూడా! అని తెనాలి రామకృష్ణుడు సుతిమెత్తగా చెప్పాడు."శఠుడు" అంటే పరమ మూర్ఖ శిఖామణి.తానుపట్టిన కుందేటికి మూడుకాళ్ళేని అనేరకం.ఇలాంటి వారిని చూచే కాబోలు "మూర్ఖప్రియకథాలాపం ప్రియమారణ్య రోదనం" అన్నారు పెద్దలు.మూర్ఖునితో మంచి మాట్లాడటం కన్నా ,అరణ్యంలో మనసారా భోరుమని యేడవటం మంచిదట.
అసూయపరుడని ఇంతకు ముందే చెప్పుకొన్నారు కదా!
ఇతరులు కలిసిమెలిసిసంతోషంగా వుంటే ఇతనికీ నిద్రపట్టదు.సంతతావిశ్వాస సస్యప్రరౌహుడితడు.అంటే అవిశ్వాసమనే పంపాను పండించే విచిత్రమైన రైతు.ఇతరుల మధ్య తంపులు పెట్టివారు తన్నుకు చస్తుంటే ఆనందించే కలహాసనుడు.నారదనకు కలహభోజనుడనే పేరున్నా అవన్ని లోక కళ్యాణకారకాలు.కాని సుశీలమ్మ భర్త కలహప్రియత్వము ప్రజాబాధకాలు.అంతేతేడ.
వాడికి గర్వంతో కళ్ళునెత్తికెక్కాయి, అని గర్విష్టుని అంటూ వుంటాము.
మనసుశీలమ్మ భర్త "గర్వ పర్వత మస్తక స్థితుడు.గర్వమనే పర్వతశిఖరమై ఎక్కి కుర్చున్నాడట! ఎంతగర్వమో!
బమ్మిని తిమ్మిగా ,తిమ్మిని బమ్మిగా నిరూపించే క్రియాకుశలుండు మనసుశీలమ్మ భర్త.ఇటువంటి వ్యక్తిత్వమున్న మనిషి మనఃస్థితి ఎలా వుంటుందో ఎవరు వర్ణించగలరు?
"సంగతోన్మాదోత్తమాంగకుండు"అంటే పిచ్చి బాగా తలకెక్కిన వాడు.
ఇక భార్యను అస్తమానము రాపాడించుకు తినేవాడు
దుర్గుణాలను రాసిపోసి మనిషిగా
తయారుచేసీన బ్రహ్మదేవుణ్ణి ఏమనాలి.? ఇలాంటి నికృష్టుణ్ణీ ఏ ఇల్లాలైనా ఎన్నాళ్ళు భరించగలదు..బలహీనురాలైన భార్యయైతే ఏనుయ్యో గొయ్యో చూచుకొనేది.కొంచెం మొండిఘటమైతే
"తములపాకుతో నీవొకటంటే, తెలుపు చెక్కతో నేనొకటంటా"అంటుచేతివాటుసరసం చూపించేది.ఇంకొంచెంభర్త బాధిస్తే భర్తయ్యేది, భార్యయ్యెదీదేవుడయ్యేది ఇప్పుడే చూపిస్తానంటూ భర్తబుర్రను రామకీర్తన పాడించేది.ఆధునిక మహిళైతే పెండ్లైన మరునాడే విడాకుల పత్రం భర్త ముఖానకొట్టి తనవారిని తాను చూచుకొనేది.
కానీ ఇవన్ని తెలియని సత్యంకాలం మనిషిగనుక మనసుశీలమ్మ పతియే ప్రత్యక్ష దైవమని భావించే పరమసాత్వికురాలు.ధర్మమే జయిస్తుందని ఘట్టికా నమ్మే దొడ్డయిల్లాలు.
అందుకే భర్తగా నిర్ణయించిన బ్రహ్మదేవుని నిందించలేదు.ఇటువంటిదుష్టుని అల్లుడిగా నిర్ణయించి, కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన తండ్రిని నిందింపక ఆ భర్తతో కాపురం చేసింది.
తెనాలి రామకృష్ణునకు కూడా ఆమెమగనిపై కోపము, ఆ అమాయుకురాలైన ఇల్లాలిపై సానుభూతి.అందుకే ఆమె వ్యక్తిత్వాన్ని సహనాన్ని వర్ణిస్తూ
"తాళివిభుండుగట్టిన మొదల్ పతిదేవత యాసుశీల పెన్
గోలతనంబునన్ మొగుడు కొట్టిన తిట్టిన రట్టు పెట్టినన్
దాళి దినంబు దచ్చరణ తామరసంబు గొల్చు"
అని వర్ణించాడు.ఆమె పెన్ గోలతనంబును మొచ్చుకొన్నాడు.పెన్ గోలతనంబు అంటె మిక్కిలి అమాకత్వము".మగమహారాజులము మేముతిట్టీనా కొట్టినా ఏంచేసినా చెల్లుతుంది.మేముకొట్టినా తిట్టినా అల్లరి పెట్టినా భరించాలి.భరించక తప్పదు."అని అని అనుకొనే పతిదేవుళ్ళకు నేడు లోటు లేదు.పతిదేవుడనే పద ప్రయోగం తెనాలి రామకృష్ణుడు వ్యంగ్యంగా వాడాడని భావించాలి.
"నేలయున్ బోలునె యీపెకంచు కృతబుధ్ధులు వృద్ధులు ప్రస్తుతింపగన్"
అని సుశీలమ్మను పెద్దలతో పాటు రామకృష్ణులు మొచ్చుకొన్నారు.
సహనంలో సుశీలమ్మ భూదేవిని మించిపోయింది.పెద్దలు బుద్ధిమంతులు మెచ్చుకొన్నా, మొచ్చుకోకపోయినా ఆమె తీరుమారదు, మగడికి బుధ్ధి మారదు.
మగమహారాజులుకు బుధ్ధి రావాలని కాబోలు ఆ మగని గుణగణాలు వైన్ వైనాలుగా వర్ణిస్తున్నాడు.
సూర్యరశ్మి వల్ల వచ్చే వేడిని మనం ఓర్చుకోలేము.కానీ సూర్యని భార్యయైన ఛాయాదేవికి సూర్యుని వేడేని భరించక తప్పదు.అలానే మనసుశీలమ్మ తనభర్తచేసె అసహ్యదర్శనములచే బాధించు భర్తను సంప్రీతునిగా చేయుటకు ప్రయత్నిస్తుదంట.ఇక్కడ "అసహ్యదర్శనములంబీర్వుకులంబెట్టు దుర్జాతు"డని తెనాలి రామకృష్ణుడు తెలిపినారు. ఆ సహింపరాని దర్శనాలేవో ? ఆ భర్తకు, ఆడొడ్డ యిల్లాలికి, ఆభగవంతునకే తెలియాలి.దుర్జాతుడు,వీతదయుడు,అని ఆపకుండా "ప్రియున్" అని కవిముక్తా యిస్తాడు.దుర్జాతుడు, వీతదయుడు,ఏ మాత్రం దయలేని వాడు అని ఆపకుండా ప్రియుడు అని అనడంలోనే గడుసుదనంవుంది.ఎంత దుర్మార్గుడూ,భాధాకరుడు ప్రియుడెట్లా అయ్యాడంటే ఎంత చెడ్డా భర్తేకదా! అని సరిపెట్టుకొందేమో ఆ యిల్లాలు
లోకంలో అభిమానవతులైన వనితలు తమభర్తలను ఎవరు నిందించినా సహించరు. పైగా ఆ భర్తలను ప్రేమతో కంటికి రెప్పలా కాపాడుకొంటారు.వారిపై యీగవాలనివ్వరు సరికదా!తమ భర్తను నిందించిన వారిపై అగ్గిమీద గుగ్గిలం లా ఎగిరి పడతారు.వారు తమ ఆలోచనా ల్లో అంతరంగల్లోఅలాంటి భర్తలను గురించి ఏమనుకొంటారో వారికి తప్ప ఎవరికీ తెలియదు, తుదకు వారిని సృష్టించిన బ్రహ్మకైనా తెలుసో తెలియదో! మనసుశీలమ్మ తన భర్తను గురించి ఏమనుకుంటుందో ఆమె తెలుపలేదు.ఆమె పాత్రను సృష్టించిన తెనాలి రామకృష్ణుడు తెలుపలేదు.తెనాలి రామకృష్ణుడి కీ తెలియదేమో?
"నిశ్ఛలున్ తదుచితాచరణంబుల సంప్రీతి జేయు" అని కవి తెలుపడం వల్ల ఆమె నిష్కామకర్మయోగియైన భక్తురాలి గా కనిపిస్తుంది.భగవద్గీత భక్తి యోగంలో
"తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో యేనకేన చిత్ అనికేతస్థిరమతిః భక్తిమాన్ మేసమప్రియః" అని భగవానుడు చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది.
నిజమైన భక్తుడు నిందాస్తుతులను సమానంగానే చూస్తాడు.పొగడ్తలకు పొంగిపోడు,తెగడ్తలకు క్రుంగిపోవడం లేక మౌనంగానే వుంటూ సంతుష్టిని కలిగి భగవంతునిపై స్థిరమతిని కలిగి వుంటాడు.అట్టి భక్తుడు నాకిష్టుడు అని శ్రీకృష్ణుడి పల్కులను మనం గుర్తుకు తెచ్చుకోవాలి.
సాధ్వీమ తల్లిగా తనధర్మాలను నిర్వహిస్తుందని భావించాలి.
మహాకవులు అర్థగాంభీర్యముతో ఔచిత్యముతో రచనలు కావిస్తారు.మహాకవులలో మేటియైన రామకృష్ణులు "ఆ తీవ్రాంశుని వేడికోర్చి మునుఛాయాదేవి బోలె"అను పద్యములో ఉపమాలంకారము వాడారు.సుశీలమ్మను ఉపమేయంగా, ఛాయాదేవిని ఉపమానంగా భావిస్తే , వైశాఖమాసం లోని రోహిణీ కార్తె లోని మిట్టమధ్యాహ్నపు యెండయెంత భరింపరానిదో ,ప్రాణాపయ కరమైనదో
మనసుశీలమ్మభర్త చర్యలు కూడా అంత భయంకరమైనవే.అలాంటి భర్తతో కాపురమునడివేసంగియెండలో జీవించడం లాంటిదేమో! ఈ బాధలు
భర్తలదౌష్ట్యానికి గురియైన వనితలకే తెలుసు .
భార్యసరే! పెండ్లానికి తప్పదు.వాని పాలుపడి వూరిలో వారెలా జీవిస్తున్నారో పాపం! అని అనుకోవడానికి ఆస్కారం ఎక్కువుగావుంది.
"అయ్యా! నాకొడుకు ఉపనయనం,నాకుమార్తెకు వివాహం నిశ్చయమైంది.పెండ్లికి వియ్యంకులు వారంత అగ్రహారం వారితోతరలివస్తున్నారు.డబ్బా! చేతిలోఆడటంలేద"రాజులను,షాహుకార్లను పెండ్లి సంభారాలకు యాచించి తేవడం ,తెచ్చిన పదార్థాలను కోమిటిండ్ల వద్ద అమ్మించడం ,డబ్బు మూటగట్ఠడం చేసేవాడు.ఇదొరకం సంపాదన.
పౌరోహిత్యం వల్లగానీ,పొలంలో పండిన ధాన్యాన్ని గానీ,గాదెల్లో దాచి,వాటిని జాగ్రత్తగా మూసి మూతలు ఊడకుండా మేకులు కొట్టడం చేస్తాడు.ఆ ధాన్యాన్ని వండుకు తిన్నపాపానికి పోడు.బయటనుండి ధాన్యం దొరక్క పోతే పస్తులుండడానికైనా సిద్ధమే.గింజపోతే ప్రాణం పోయినట్లే.
చుట్టమెవరైనా భోజన సమయానికి యింటికి వస్తే రెండవ సూతకం(చావుమైల) వుందని తెల్పి గుమ్మం ముందునుంచే సాగనంపే నైపుణ్యం మనవాడి సొత్తు.
పొరపాటునగానీ గ్రహపాటునగానీ ఎవరైనా దానం చేస్తానని చెబితే ,అది వారు ఇచ్చేవరకు ముచ్చిచ్చున వేగిపోతాడట!
అంటే మూడుఅగ్నులు.సాంప్రదాయకుటుంబంలో ఆహవనీయము,గార్హపత్యము,దాక్షిణాగ్ని అనే అగ్నులు వెలుగుతుండేవి.
"అగ్నిమీళే పురోహితం యజ్ఞస్యదేవ ఋత్విజం హోతారం సప్త ధాతవం"అని అగ్నిని పూజించే వారు పెద్దలు.మనసుశీలమ్మ మొగునికి ఇంత భక్తి లేదు కానీ సాంప్రదాయము ను పాటించే వాడేమో మరి.ఆ అగ్నిహోత్రం లో అగ్నిలాగా ఇతని ధనదాహం మండిపోతుందని కవి భావన.
ఎవరేమిదానం యిచ్చినా వద్దనేవాడుకాడు.శాకాయావాస్యాత్ లవణాయవాస్యాత్" అని అనుకొంటు కూరకో ఉప్పుకో సరిపోక పోతుందా అని సర్దుకుపోతాడు.
అతడు వేరేయింటికి వెళ్ళినా వారేమి ఇవ్వక పోయినా బాధపడే రకంకాదు.వారింటి ధూళి తనకంటుకొందని "ధూళీ పరగృహాదపి" అని అనుకొనే వాడు.
"ఈగకు కాటూ,పాముకు బలి" ఇవ్వడేమిటా ? అని సుశీలమ్మ బాధ పడేది.
తన భోజనం వూరిమీద ,మరిభార్యవుందికదా! మరి భార్య ఆకలి తీర్చే విధానం ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూద్దాము.
భార్య ఈరోజుకు ఏంవంట చేయాలని ప్రశ్నిస్తే ఆరోజు భోజన సామగ్రిని గొణుక్కుంటూ ఇచ్చేవాడు.పదార్థాలను అడిగిన వెంటనే ఇవ్వక కినికి కినిసి ఇచ్చేవాడు. తిండి పేరెత్తితే అగ్గిమీద గుగ్గిలం మయ్యే వాడు.ఆ కోపం అవధులు దాటి తిట్లకు లంకించుకొనేవాడు.ఇకతప్పదురా అనుకొంటు ఈ పదార్థాలు ఇన్నాళ్ళకు లెక్కగట్టి తిండిగింజలు ముఖానికి కొట్టేవాడు.ఆ యిచ్చే పదార్థాలు ముక్కిపోయినవి,అవి కూడా తప్పుడు కొలతలతో కొలిచి యిచ్చే వాడు.అలా బిచ్చమేసి ఇచ్చిన పదార్థాలను మహాప్రసాదం గా మనస్సులో భావించి
"హర్షరసోల్లాసదానాబ్జయై"గ్రహించేదట మనసుశీలమ్మ .అల్ప సంతోషము నాకు ఇంతకన్నా ఉదాహరణ యేముంటుంది.
ఈ విధంగా చంద్రబింబము వంటి ముఖముకల్గిన మనసుశీలమ్మ వివిధములైన కుటిలాచార చతురుడు జీవితేశ్వరుని ఈశ్వరుని గా భావిస్తూవుంది.భావించడమేకాదు,అది చేతలతో చూపించింది.భగవంతుని భక్తుడు సేవిస్తాడు,మనసుశీలమ్మ జీవితేశ్వరుని ఉపాసన తనకు ఇహపర సిద్ధికి సాధనంగా మనస్సులో భావించేది.ఇలా కీర్తత మైన చరిత్రతో ప్రవర్తించేది.
తృప్తి మనసుకు సంబంధించినది.వస్తువుతో దానికి సంబంధంలేదు.సంపదలన్నీ రాశులు పోసినా అసంతృప్తితో రగిలిపోయె మనుషులెందరు లేరు? ఇంకా కావాలి ఇంకాకావాలి అంటూ వస్తుసంచయమే తమ ఆనందానికి మూలకందమంటూ,ఎండమావుల వంటి సుఖాలకై వెంపర్లాడే అభాగ్యులే ఎక్కువ మంది వున్నారు.అలాంటి వారు అసంతృప్తితో ముఖం మటమటలాడిస్తూ కోరినది దొరికే వరకు తాము సుఖపడకుండా,ఇతరులకు మనశ్శాంతి లేకుండా చేస్తుంటారు.అంత వరకు ఎందుకూ మనసుశీలమ్మ మొగుడున్నాడు చాలదా?
సంతృప్తివల్ల కలిగిన ఆనందం ఆ వ్యక్తి ముఖకవళికల్లోనే వ్యక్తమవుతుంది.
సంతృప్తి వల్ల కలిగిన ముఖము ఆనందంతో వెలిగిపోతుంటే తృప్తి లేని వాని ముఖం అట్ల పెనంలా అఘోరిస్తుంది.అందుకే మనసుశీలమ్మ మోము పూర్ణచంద్రబింబములా వెలిగిపోతుందంటే ఆశ్చర్యము లేదు మనసుశీలమ్మ భర్త గురించి విపులంగా తెలుసుకొన్నాము .కనుక,ఇక కథలోకి ప్రవేశిద్దాము.పాత్రలే ఈ తీరుగా వుంటే
కథ యెలావుంటుందోనని కుతూహలము వుండడము సహజము.
భారతీయ జీవన స్రవంతిలో శాశ్వతమైన విలువలున్నాయి.కాలం మారినా,మానవ జీవన విధానం మారినా ఆ విలువలు మాత్రం మారవు.
ఆ విలువలే భారతీయాత్మగా భావింప బడుతాయి.
"కలడుకలండనెడివాడు కలడో లేడో"అని సందేహింపక సర్వవ్యాపియైన భగవంతుని సర్వే సర్వత్రా దర్శించమంటు మన వేదాలు, పురాణాలు ఇతిహాసాలు నొక్కిచెప్పారు తున్నాయి.కనిపించే దేవుని దర్శించిన తరువా అవాజ్ఞ్మానసగోచరుడైన భగవంతుని దర్శించడం తేలిక
మమతలు గుడి తల్లినుండి.అందుకే అమ్మ మానవాళికి ప్రత్యక్ష దైవం,తొట్ట తొలిగురువు తల్లి.శిశువు భావిజీవితము అంత" అమ్మ" అనే రెండక్షరాలతో ముడివడింది.అందుకే శృతి"మాతృదేవో భావ"అన్నది వేదం.
తరువాతి స్థానం తండ్రిది.శిశువుజీవితపు రెండో పార్శ్వాన్ని తండ్రి ఆవిష్కరిస్తాడు.ఎందుకంటే బ్రహ్మోపదేశాన్ని చేసి మార్గనిర్దేకత్విన్ని వహించే గురుతర బాధ్యత తండ్రిది.అమ్మ అవని అయితే తండ్రి ఆకాశం.ఆందుకే తండ్రి "పితృదేవో భవ" అన్నది శృతి.ఇక ఇహపర సాధకమైన విద్యను దానం చేసేవాడు గురువుది తరువాతి స్థానము.
అందుకే " ఆచార్యో దేవో భవ" అన్నది శృతి."అవిద్య యా మృత్యు తీర్థ్వా, విద్యయా అమృత మశ్నుతే" అన్నది వేదము.జీవియొక్క శారీరక,మానసిక యెదుగుదలకు పనికి వచ్చే విద్యను అపరావిద్య అంటారు.దీనిని అవిద్య అంటారని భావము.అవిద్య అంటే అజ్ఞానమని అర్థం కాదు
అపరావిద్య మానవుని భౌతిక మానసిక అవసరాలు తీర్చడానికి పనికి వస్తుంది.ఇది మానవుని అభ్యుదయం వైపుకు తీసుకుపోతుంది.అపరావిద్యతో కలిగిన జ్ఞానముతో మృత్యువును అధిగమించి పరావిద్యతో జననమరణాలు లేని నిశ్శ్రేయత్వాన్ని సాధించడమే విద్యలక్షణము.ఇటువంటి విద్యను ప్రసాదించిన గురువు దేవునితో సమానుడే కదా!
ఇక నాలుగో దేవుడు అతిథి దేవుడు.తిథి,వారనక్షత్రాలనే నియమం పట్టించుకోకుండా చుక్కతెగిపడినట్లు వచ్చేవాడే అతిథి."ఆర్తి సతతం, గఛ్ఛతీత్వథిః" అని ఎప్పుడూ తిరుగువాడని నిఘంటువు అర్థం చెప్పింది.
గృహస్థాశ్రమం నాలుగు ఆశ్రమాల్లో కెల్ల విశిష్టమొనది.ఎందుకంటే బ్రహ్మాచార్యాశ్రమం,వానప్రస్థం, సన్యాసాశ్రమాలకు గృహస్థాశ్రమమే ఆధారం.అందుకే అతిథి సంతర్పణ గృహస్థులకు ముఖ్యకర్తవ్యం.
అభాగ్యతః స్వయం విష్ణుః అన్నది ఆర్యోక్తి.ఆకలితో గృహస్థుని యింటికి వచ్చిన అతిథిని ఆదరాభిమానాలతో సేవించడమనే అదృష్టం గృహస్థునకు లభించినవరం .పూర్వజన్మపుణ్యఫలం అని చెప్పక తప్పదు.కఠోపనిషత్తులో నచికేతుడు యమధర్మరాజు గుమ్మంలో యమరాజుకొరకు మూడురోజులు నిరాహారముతో నిరీక్షించిన విషయాన్ని తెలియజేస్తు అతని భార్య "వైశ్వానరః ప్రవిశ్వతథిర్భ్రాహ్మణో గృహాన్ తస్మైతాం శాంతిం కుర్వంతి హీరో వైవస్వతోదకం"
బ్రాహ్ముణుడైన యతిథి అగ్నిలాగా యింట్లో ప్రవేశిస్తాడు,అతని సద్గృహస్తులు ఆతిథ్యంతో శాంతింపచేస్తారు.కనుక వైవస్వుతుడా నీళ్ళు తీసుకురా! అని పల్కుతు
"ఆశా ప్రతీక్షే సంగతం సూనృతం
చేష్టాపూర్తే పుత్ర పశూంశ్చ సర్వాన్
ఏతద్ వృజ్గక్తే పురుషస్యాల్పమేధసో
యస్యానశ్నన్ వసతి బ్రాహ్మణో గృహే"అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడు ఏ యింటిలోనిరాహారుడై వుంటాడో ,ఆ బుధ్ధిహీనుడి ఆశలు ఆకాంక్షలు,సత్సాంగత్యం ఫలము,సర్వకర్మల పుణ్య ఫలము,పశుసంపద అంతా కూడా నశించిపోతుంది."అని తెలియజేసింది.
ఆశలు అంటే యజ్ఞయాగాది పుణ్యకర్మలవల్లవచ్చే స్వర్గలోకాది రూపమైన పుణ్య ఫలము నశిస్తుంది.ప్రతీక్ష అంటే ఎదురుచూస్తున్న ధనధాన్యాదులచే లభించే సుఖములు నశిస్తాయి అని కఠోపనిషత్తు ద్వారా గృహస్తులు కర్తవ్యాన్ని తెలియజేస్తున్నది.
ఇక ప్రస్తుతం కథలోనికి వద్దాము.
ఒకరోజు మనసుశీలమ్మ భర్త రావాల్సిన డబ్బులు రాబట్టు కోవడంకోసమో, పౌరోహిత్యం కోసమో గ్రామాంతరము వెళ్ళాడు.అతడు అలా వెళ్ళగానె మనసుశీలమ్మ ఇంటికి ఎంతో ప్రకాశంగల శరీరఛ్ఛాయతో వెలిగిపోతున్న వాడు, భోజనంపై ఆపేక్షతో వున్న బ్రహ్మచారి వచ్చాడు.
అతని వాలకంచూస్తుంటే బలిచక్రవర్తిని మూడడుగుల దానంతో పాతాళానికి నెట్టిన వామనుడల్లే వున్నాడట.
ఆకలితో ఇంటికి వచ్చే అభ్యాగతుడు విష్ణు స్వరూపుడు.అలాంటిదే స్వయంగా విష్ణువే అభ్యాగతుడైతే ఆ సుశీలమ్మ పుణ్యము ఏమని చెప్పాలి?
ఇంటిగుమ్మం వద్ద అడుగుల సవ్వడిని భర్తను గురించి ఆలోచనల్లో ఉన్న తనను భర్తే పిలిచాడనుకొని ఆలోచనతో గుమ్మం వైపు తొంగి చూడగా బ్రహ్మచారి కనిపించడమే కాదు " స్వస్వస్తుతే"(,నీకు శుభమగుగాక) అని ఆశీర్వదించాడు.
అప్పుడు సుశీలమ్మ వినయ విధేయతలతో ఆ వటువునకు నమస్కరించి "ఎక్కడినుండి వస్తున్నారు? ఇక్కడికి రావడానికి కారణమేమిటి?మిమ్ములను చూస్తుంటే భోజనమునకై వచ్చినట్లున్నారు.మావారు ఊరిలో లేరు.చావడిలో విశ్రమించండి.గంటగంటన్నరలో భోజనం సిద్ధం చేస్తాను.మీరు తొందరగా భోజనం చేయవచ్చు"అన్నది ఆ దొడ్డయిల్లాలు.
అందుకు బ్రహ్మచారి "అమ్మా! నేను గత యైదురోజులుగా భోజనం చేయలేదు.చాలా ఆకలిగా వున్నది.అన్నం తయారయ్యేదాకా నేనాగలేను.చద్ది అన్నమైనా బాధలేదు.పాత్ర అడుగున ఉన్న అన్నం కొంచెం పెట్టినా చాలు.చద్ది అన్నం తిన్నందుకు ప్రాయశ్చిత్తంగా తరువాత కావల్సివస్తే తపస్సుచేసుకొంటాను" అని గడుసుగా జవాబిచ్చాడు.
ఆమె" అయ్యయ్యో! మీకు చద్దన్నం ఎలా పెడతాను? క్షణములో వంటసిధ్ధము చేస్తాను.మీరు భుజించి వెళుదురుగాని "అని పలికింది.అందుకు బ్రహ్మచారి "అమ్మా! యాత్రార్థము వెళుతున్నప్పుడు ఆచారాన్ని అంతగా పాటించనక్కర లేదు."పథిశూద్రవదాచరేత్" అన్నారు పెద్దలు.అలా ఆచారమును పాటించకపోయినా బ్రాహ్మణత్వమునకు వచ్చిన నష్టము లేదు."అని అన్నాడు
వాక్కు చేత మనస్సుచేత శరీరము చేత కర్మల చేత సంభవించే గృహస్థుని పాపములను అభ్యాగతుడు తొలగించి శాశ్వతముగా సుఖములు కలుగజేయును వల్లనే కదా! అభ్యాగతః స్వయం విష్ణుః "అన్నారు పెద్దలు.అని నిమ్మళముగా పలికాడు
నాతో పాటు బయలుదేరిన బ్రహ్మచారులు అలసిపోయినప్పటికీ పండరీపురంలో పాండురంగని దర్శనాభిలాషులై చాలా తొందరగా వెళ్ళారు.కూటిపేద త్రోవదప్పెనని సామెతగా నాఆకలి నన్ను ముందుకు సాగనివ్వలేదు.క్షుధాతురనకు రుచితోను కాలంతోను ఏంపని? బాటసారులకు అడక్కొన్నా ఎవరు పాయసమిస్తారు?
నీ చిత్తశుధ్ధి ఎంతో గొప్పది.ఇంక గృహశుధ్ధిని గురించి అడుగ పనిలేదు.ఇకపాత్రశుధ్ధిగురించి అడుగపనిలేదు.ఆత్మశుధ్ధి ,పాకశుధ్ధి,భాండశుధ్ధి కలిగిన యింటిలో చల్ది అన్నమైనా పురోడాశమైనా సాటి వస్తుందా? అంతేకాదు "శరీరమాద్యం ఖలుధర్మ సాధనం" అన్న ఆర్యోక్తి వుండనే వున్నది.ధర్మసాధనకై శరీరపోషణము ఆవశ్యక కర్తవ్యము.విశ్వామిత్రుడు మొదులగు మహర్షులు శరీరభరణార్థము చేసిన పనులు మీకు తెలియనది కాదుకదా! అని అన్నాడు మాయావటువు
బ్రహ్మచారికి చద్ది అన్నం ఎలా పెట్టాలి? ఆ కొంచెం ఏంసరిపోతుంది? అని నీవు అమాయకంగా అడిగిన దానికి యింత చెప్పవలసివచ్చింది.ఆత్మస్తుతి పరనిందపనికిరాదంటు పెద్దలంటారని జంకుతున్నారు.నేను మనసులో తృప్తిచెందితే మూడు లోకాలు తృప్తి చెందుతాయి"అని వటువు తన మహత్వమును నర్మగర్భంగా చెప్పాడు.
నీవు అన్నం పెట్టకపోతే నేనుపోనేపోను.అని నిర్మహమోటంగా పులికి వెర్రి ఆకలితో నీరసముతో వున్నవాడు తడబడినట్లుగా త్వరగా నడుస్తు వంటింట్లో వెళ్ళి తిష్ట వేసుక్కుర్చున్నాడు.
ఈ హడావుడి కి మనసుశీలమ్మ తెల్ల బోయింది.
తనలొ తాను" పరిహరించడానికా ఇతడు బాటసారి.పైగా పసిబిడ్డ.ఆకలితో అలమటిస్తున్నారు.ఏమైనా చద్ది అన్నం పెట్టడానికా మనసొప్పదు.అలా చల్ది అన్నం పెడితే పాపంచుట్టుకొంటుందేమో?
ఎదో తినడానికొకటిచ్చి పొమ్మంటే పోతాడో ! పోడో? ప్రయాణపు బడలిక చే అలిసిపోయినట్లు న్నాడు.ఇంతకూ సద్దిఅన్నం పెడితే సరిపోతుందో లేదో?
నాభర్త నాకిచ్చిన దానితో వండి పెడితే అదిసరిపోతుందో లేదో?
బాలుణ్ణి చూస్తే మహా మొండివాడిలా వున్నాడు.తినమని చెప్పాక గొంతెమ్మ కోరికలు కోరితే యెలా? అలా కోరితే పెట్టడానికీ లేదు,మానడానికీ లేదు.
ఎంతైనా యాత్రికులు ప్రయాణపు బడలిక చేత పెళుసుగా మాట్లాడుతారని విన్నాను.వంటయ్యేవరకు ఈ బ్రహ్మచారి ఆగేట్టుగా లేడు.బండిమీద పోతున్నట్లు గా మాట్లాడుతున్నాడు"అని మనసుశీలమ్మ తన మనసులో పలువిధాలుగా మిధున పడింది.కానీ బాలుని పరిస్తిగమనించి ఆమె చివరకు చెల్లి అన్నమును పెట్టడానికే నిశ్చయించుకొంది
అగ్రమున్న మంచి యరటాకు పరిచి గొత్రదేవతాపుత్రుడు,శుధ్ధిమఛ్ఛరణ విస్మేరాగ్ని ప్రభుడైన ఆ బ్రహ్మచారిని "రామయ్యా! "అంటు నీలాల పండిన ప్రాతరాజనపు దివ్యాన్నమును సవ్యంజన పూర్వకం గా పెట్టినది".ఈ దధ్యోధనమును కూడా ఆరగించండి" అని ప్రార్థించింది.ఆ వటువునొద్ద మంచితీర్థమును చెంబునిండా వుంచింది.నిండుగా నున్న ఆమంచినీటి చెంబు ఆమెమనసునిండుదననానికి సంకేతమా? అన్నట్లుందని రామకృష్ణుని మనసులోమాట.
మన మాయావటువు ఆపోశనా విధినినిర్వర్తించి ,సుశీలమ్మ అనుమతితో ప్రాణాహుతులు ఆచరించ కుండానే చిల్లి అన్నమును తినసాగాడు.తానే యజ్ఞస్వరూపుడైనప్పుడు ప్రాణాహుతులయవసరమేమనుకొన్నాడేమో!
"యజ్ఞోవై విష్ణు" అన్నది కదా శృతి
"బ్రాహ్మార్పణం, బ్రహ్మవిద్య
బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం
బ్రహ్మైవ తేనగంతవ్యం
బ్రహ్మకర్మసమాధినా" అన్నది గీతోక్తి .
విష్ణుసహస్రనామము కూడా " యజ్ఞ స్వరూపుడిగా నే విష్ణుని కీర్తించింది.
మనమాయా వటువు తనకృష్ణావతారం గుర్తుకొచ్చిందనుకొంట.తన నెచ్చెలులైన గోపబాలురతో అమరులు వెరుగంద శైశవంబున చల్ది ఆరగించాడుకదా!
మనసుశీలమ్మ ఇలా వడ్డించి అలా తిరిగిందో లేదో ,మనమాయా విటుడు మెతుకు మిగలకుండా తినేసి సుశీలమ్మ వైపు ఆబగా చూస్తూ"
"చూడుమీసారి భాండమో శోభనాంగి
బిస్పటంబొండె,దారితప్పనది యెండె
కలుగవె!,కుండనూర్చి తెమ్మలఘుజఠర
జాతవేదంబుహెచ్చె నీస్వల్ప ముక్తి"
అనిమొహమోటం లేకుండా అడిగేసాడు.
ఇక సుశీలమ్మకు కాళ్ళూచేతులు ఆడటం లేదు.నిన్నరాత్రి తన భర్త తనకోసం వండించిన అన్నం వుట్టిమీద వున్న విషయం చటుక్కున గుర్తుకొచ్చింది.ఆ అన్నాన్ని కూడా పెట్టింది.దానితో బాటు బాగా కాగిన ఆవుపాలను కూడా వడ్డించింది.దినిని కూడా తినేసి,ఇంకా ఆకలితీరలేదని ఆమెను తొందరపెట్టసాగాడు.అలా హడివుడి పెట్టేస్తున్న ఆవటువునకు మనసుశీలమ్మ చేతులు జోడించి"అన్నము కొంచెముకూడొ లేదు,ఇంటిలో మా ఆయనకోసం దాచినకజ్జాయాలున్నాయి.వాటిని మీరు ఆరగించండి,ఇంతలో వేడివేడి అన్నం వండి వడ్డిస్తాను" అని ప్రార్థించింది.
మనమాయా వటువు ఏమాత్రంతొణకకుండా "అమ్మా! నేను త్వరగా వెళ్ళాలి.నా మిత్రులంతా ముందే వెళుతున్నారు.నేను వెళ్ళి వారిని కలవాలి.కాబట్టి యింటిలో నూనెతో బాగా వండిన తినుబండారములేమైనా వుంటే త్వరగా పెట్టమని తొందర పెట్టసాగాడు
మన సుశీలమ్మ భర్తకు దంతసిరి బాగా వుందేమోఅందుకే తనకోసం రకరకాల పిండివంటలను ఘుమఘుమలాడే మంచి నేతితో వండించి పెట్టుకొన్నాడు.అవి కమ్మ కారంగా అప్పుడే వాడినట్లు నవనవలాడుతున్నాయి.
భర్త ఆగ్రహారానికి గురియవుతానని బాగా తెలిసినా,ఆ మెనిండుమనస్సుతో దాచిన పిండివంటలన్నీ వడ్డించింది.మనమాయా వటువు నిర్వికారుడై ఆపిండివంటలన్ని ఒక ముక్కా మిగలకుండా తినేశాడు.అయినా ఆ బ్రహ్మచారికి కడుపు నిండినట్లు లేదు.ఇంకా కావాలని అడిగడానికై మొహమోటపడినట్లు అనిపించింది.
ఆమె తన మనస్సులో "ఇసుమంత లేని పసిబాలుడు,కుడువ కూటి ప్రాయము వాడు.ఈ రీతిగా బహుభక్ష్యరాసులను అవలీలగా తింటున్నాడు.పైగా విసుగు చెందటం లేదు.పైగా తృప్తితీరినట్లు లేదు.చూడగా చూడగా మార్పు బిడ్డలా వున్నాడు.మానవశిశువులా అనిపించుట లేదు.ఇతడు దేవతా నాయకుడో,ఆ చతుర్ముఖ బ్రహ్మ యో,నా భవబంధాలను నిర్మూలించడానికి విచ్చేసిన ఆ శ్రీమన్నారాయణుడో నాకు అర్థం కావడంలేదు.ఇంకా ఆకలిగా వుందంటున్నాడు.చేసిన అప్పాలన్ని అయిపోయాయి."అని ఆశ్చర్యపోయింది.
ఇప్పుడు తనకు జగత్క్రియా సాక్షియగు ఆ అగ్నిదేవుడే రక్షించగలడు."శ్రియమిఛ్ఛేత్ హుతాశనాత్"అని పెద్దలు వూరికే అన్నారా!"అని తేల్చి సకలేప్సిత వితరణగుణలీలా చతురుడైన అగ్నిదేవుని ప్రార్థించింది.అగ్ని దేవుడు ప్రసన్నుడై భక్ష్య భోజ్య,చోష్య,లేహ్యపానీయాలను ఆమెకు అక్షయంగా ప్రసాదించాడు.
మన సుశీలమ్మ సత్యశమధైర్యోధార్య సంశుధ్ధులను చాలా మెచ్చుకొన్నాడు.పాండురంగడు తనమాయా వటుత్వమును విడిచి ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు.
ఆ మహనీయ మూర్తిని మనతెనాలి రామకృష్ణుడు కమ్మనైన సీస పద్యమున వృత్యాను ప్రాసమున వర్ణించాడు.
అలా ప్రత్యక్షమైన పాండరంగ విభుని సుశీలమ్మ నేత్రపర్వంగా దర్శించుకొని ధన్యత పొందింది.
ఆ జగన్నాటక సూత్రధారిని వర్ణిస్తూ మనతెనాలి రామలింగడు శ్రీకృష్ణుని "యదుకుల సరోమరాళ"మన్నాడు.
మరాళమంటే హంసేకదా! ఆ హంస స్వరూపుడు పరబ్రహ్మమేకదా!
అలా ప్రత్యక్షమైన ఆ పాండురంగ స్వామి మనసుశీలమ్మతో" నీ హృదయమును తెలుసుకోవాలనే నేను ఇంత చేశాను.లోకంలో ఎంతోమంది పతివ్రతామతల్లులుండవచ్చు.కానీ వారెవరికీ నీకు కల్గిన అదృష్టము లభించలేదు.ఎందరో మునీశ్వరులు ఎంతో తపస్సు చేసినా వారెవరికీ నీకు కనిపిస్తున్న నా స్వస్వరూపదర్శనం లభించలేదు.
"ఓం సుచరితా! నేడు నీ చేతి తిన్న చల్దియన్నము నాకు అమితమైన తృప్తిని కలిగించినది.శబరీ ద్రౌపదుల విందారగించాను కానీ అవి నాకు అంత తృప్తిగా అనిపించలేదు.నీవు కావించిన కావిస్తున్న పతిసేవా వ్రతము అతిమానుషమైనది అసిధారావ్రత తుల్యమైనది .
శతకోటి జన్మలెత్తీనా,బహువిధములైన
ధర్మ కార్యములాచరించినా నన్ను దర్శించలేరు.ఆట్టి అపూర్వమైన నా దర్శనము నీకు లభించడానికి ఒకకారణమున్నది. పూర్వ భవమున నాకొరకై నీవొక అపూర్వమైన అర్చనమాచరీంచితివి.అందువల్లనే నాదర్శనము నీకు లభించింది.
ఓ సుశీలమ్మా! పూర్వజన్మమున నీవొక మునీశ్వరుని హోమధేనువుగా వుంటివి.నందగోకుల విహారినైన నేను వనమున సంచరిస్తూ,వేణుగానం మును చేసితిని.ఆపాత మధురమైన వేణుగానరవమును తన్మయత్వంతో విని,ఆ దివ్యానుభూతితో నీళ్ళు నీవె మార్చి పాలనుచేపితివి.చల్లని పిల్లి తెమ్మరలు వీచుటవల్ల ఆ పాలనురుగు నాశిరస్సును తాకినది.అలా నీవు నాకు క్షీరాభి షేకము చేసిన పుణ్యము లభించింది" అని ఆమె పూర్వజన్మవృత్తాంతమును వివరించాడు.
పనిలో పనిగా మన సుశీలమ్మభర్థ పూర్వజన్మవృత్తాంతమును, ప్రస్తుతం జన్మలో అతని దుష్ప్రవర్తనకు గలకారణాలను ఇలా తెలిపాడు.
సుశీలమ్మలాంటి మంచి ఇల్లాలికి ఇటువంటి కఠినాత్ముడైన భర్తలభించడానికి ఏదో బలవత్తరమైన
కారణమేమొ వుంటుందని అది తెలుసు కోవాలని,పాఠకులకు కుతూహలముండవచ్చు కదా! అందుకే పాండురంగడు వివరిస్తున్నాడు.
ఈ జన్మమే కాదు, పూర్వజన్మలో కూడా మనసుశులమ్మ భర్త ప్రవర్తన కూడా అంతే.మార్పేమీ లేదు.అతడు "ఆకృతి సత్క్రియుడు" అంటే ఏ మంచిపనీ చేసేవాడు కాడు.పైగా మిక్కిలి పాపాత్ముడు.కఠినబుధ్ధికలవాడు.ఘోటకబ్రహ్మచారిగా సంచరిస్తూ,వసుధావరుడు అనే రాజు పట్టణమునకు చేరుకొన్నాడు.అతడు ధనవంతుడే కానీ,వివాహము చేసుకోకుండా వూరిమీదపడి పెరవింతతువుల సంగమాభిలాషకై వెంపరలాడేవాడు.
సద్బ్రాహ్మణకుల సంజాతుడైనా ,పెద్దలను పూజ్యులను సేవించకుండా పాషండులతో సఖ్యమునెరీపే వాడు.
మతిమంతుడేకానీ ఆమ్నాయాలను ఆలకించకుండా అశ్లీల ఖేలన వ్యసనాల్లో పీకలదాకా కూరుకు పోయాడు.
స్థితిమంతుడే,కాని లాభమేమి? లక్ష్మికి కాక సంచరిస్తూ,ధనవంతులను ఇంద్రుడనీ,చంద్రుడనీ అనిముఖస్తులను చేస్తూ,వారు విదిలించిన ధనముతో జీవనయాత్రను కోనసాగించేవాడు.బ్రహ్మస్వములకు,దైవస్వములకు యెగ్గు తలపెట్టెవాడు.వరికుప్పలకు నిప్పు పెట్టి పేలాలేరుకొనే తంతు.గ్రహణసమయంలో ఏనిడూనదులలో మునిగియెరుగని బ్రాహ్మణ బ్రువుడు మనవాడు.
అతడు వెలయాలికి చిక్కి పూర్వపుణ్యవశమున మహామండల కుండలంబులనదగిన పండరీ పురమున కొంతకాలము నివాసమున్నాడు.
ఒక పెద్ద పండుగనాడు(ఆ పెద్ధపండగేదో మనతెనాలి రామకృష్ణుడు ఎందుకో గానీ తెల్పలేదు, దానిని మనం ఊహకే వదిలేశాడు).కనుల పండువగా నన్ను ఆనాడూ దర్శించాడు.దూపదీపోత్సవములను దర్శించినైవేద్యమనుస్వీకరించి తనదారిని తాను పోయాడు.అలాజరిగిన కొంతకాలానికి కాలధర్మం చెందాడు."
అని ఇంతసవిస్తరంగా ఆమె భర్త పూర్వజన్మ వృత్తాంతాన్ని పాండురంగడు తెలిపాడు.భక్తులపొనేకాదు,పాపాత్ములన్న భగవంతునికి ప్రేమె.విరిలో ఒకసుగుణమున్నా చాలు వారిని కటాక్షిస్తాను అనేసత్యసంకల్పం కలవాడు కదా!
"తరుణీ!మద్భక్త దర్శనోత్సవ సుకృతము పాపవహ్నికి సలిలమై భధ్రమొసగు"అని అంటూ ఇతడు పూరచవజన్మములో చేసిన పాపములకు నిష్కృతి వుందా! అని అన్నాడు.భగవంతుని భక్త వాత్సల్యాన్ని కి మేర అంటూ వుంటుందా? పాపాత్మునిలో నున్న ఒక సుకృతానికే ఎంత అనుగ్రహం లభిస్తుందో, లభించగలదో తెలుపడానికే మనసుశీలమ్మ భర్త వున్నాడు.
అది సరే గానీ,భగవదనుగ్రహం లభించిన తరువాత కూడా సుశీలమ్మ భర్త లో ఏమాత్రం మార్పులేదేమిటా?అని సంశయం సుశీలమ్ముకే కాదు, మనకు తప్పకుండా కలగవచ్చు.
అందుకే నేమో! మనధర్మ సందేహాన్ని నివృత్తి చేయడానికే కాబోలు పాండురంగవిభుడు ఇలా వివరిస్తున్నాడు.
"పూర్వ జన్మమున పాపపరిహారమగు మదీయరూపంబును ఆకస్మికముగా కనుగొనుట జేసి పాపరాశిఅంతయు భస్మమై ఈ జన్మమున భూసుర కిశోరముగా జన్మించి వాసిబడసినాడు"అతడు ఈ విధముగా కఠినాత్ముడగుటకు కారణమున్నది. నీభావసిధ్ధిని,శుధ్ధుని పరీక్షింపదలుచుటకే నేనె అతనికి లోభక్రోధములతో మనఃక్షోభమును కలిగించినా ను.అందువల్లనే నీతో అలా దురుసుగా ప్రవర్తించాడు"అని తెలిపాడు
పతికొట్టీన పతితిట్టిన
పతినిర్దయుడగుచు నెట్టి పాటుపరచినన్
మతినన్యధాత్వమొందరు
పతిదేవతలతివ! నీకు ప్రతియగువారల్"
అని సుశీలమ్మ సుగుణాలను ఆ భగవంతుడే తెచ్చుకొన్నాడు
నిష్టురత్వము తొలగించి నేటి నుండి నీకనుకూలుడయ్యెడున్" అనివరమిచ్చాడు.అంతేకాదు
"మత్పదద్వయభక్తి సమగ్రులైన
సుతులు వేవుర గాంచెదూర్జిత విభూతి" అనిసత్సంతానప్రాప్తిని అనుగ్రహించాడు
భగవంతుని అనుగ్రహం లభించిన తరువాత ఇకకొరతేమున్నది? భక్తజనవాత్సల్యుడు కదా! భగవంతుడు,అందుకే అతని వరవృష్టి ఆగలేదు.
ఇక "నీ యింట వెండి బంగారమూలకు కొరత వుండదు.పాడిపంటలకు లోటుండదు.నోములెల్లా నోచి,నూరేండ్లు బ్రదికి నీ భర్తతో పరమపదమునొందుము" అని ఆశీర్వదించాడు.ఆ ఆశీర్వాదము తో పాటు ఒక హెచ్చిరికను చేశాడు.ఆ హెచ్చెరిక సుశీలమ్మకే కాదు,మనకందరికీ వర్తిస్తుంది.
"ఓ సుశీలమ్మా! మురమర్దనుడు నన్ను మన్నన చేసినాడనుచు అహంకరింపవలదు.అహంకరిఃచినచో కీడు కల్గును.శ్రధ్ధగా వినుము.ఇంతకుముందుకన్నా నాయందు ఇంకా ఎక్కువ భక్తికల్గి వర్తింపుము.సత్యశమార్జన శుధ్ధలక్ష్మికి వన్నె పెట్టినట్లు నీ ప్రవర్తన వుండవలెను.తృష్ణారహితులు మత్పరనిష్ణాతులు, నిత్య సత్యవచన నిందితులైన శ్రీవైష్ణవులను నా స్వరూపముగా భావించి,సేవించి తరించ"మనిపలికి పాండురంగస్వొమి తనస్వస్థానానికి చేరుకొన్నాడు.
అలా భగవంతుడు తిరోహితుడు కాగానే మనసుశీలమ్మ భర్త ఇంటికి చేరాడు.మనిషి పూర్తిగా మారాడు.ఇంతకు ముందు లా దొరల దగ్గరికీ వెళ్ళితిరిపెమెత్తడం లేదు.భూసురకులమునకు వన్నెను వాసిని పెట్టినట్లుగా తన ప్రవర్తతను మార్చుకొన్నాడు.ఇంతవరకు కామక్రోధలోభమోహమదమాత్సర్యాదులు అతనిని తమస్థొవరంగా చేసుకొని రాజ్యమేలేవి.అవి అంరించాయి. వాటిస్థానంలో వివేక వైరాగ్యాదులు వచ్చిచేరాయి.వాటికి తోడుగా అహింససత్వసంశుధ్ధి,దానం దమం స్వాధ్యాయం తపస్సు,ఆర్జవము,మొదులగు దైవీ సంపదలు వచ్చి చేరాయి.ఇప్పుడతడు దైవీగుణపరిపూర్ణుడు.
అయడిప్పుడు కోపమును నిగ్రహించుకొన్నాడు,పాపములకు రోసినాడు.అతడిప్పుడు పశ్చాత్తాపాగ్నిశిఖలతో క్రాగినాడు.అతడిప్పుడు కరుణా ద్వీపవతీ లహరిలో దోగుచున్నాడు
ధనవంతుల వద్దకు ధనముకై కాళ్ళరిగేలా తిరిగేవాడు ,వైరాగ్యం సంపన్నుడైనాడు.కయ్యాలక్రచ్చియై పొరుగువారిపై కాలుదువ్వె వాడు ఇప్పుడతడు అతిశాంతిమహితుడైనాడు.ఎంగిలి చేత్తో కాకిని విదిలించనట్టివాడు,ప్రస్తుతం నిత్యాన్నదాన ప్రశస్తిని పొందుతున్నాడు.బ్రహ్మకలచపముదాకా బ్రతుకుతాననే దురాశతో డబ్బులు మూటగట్టేవాడు ఈ జగమంతా అస్థిరమని భావిస్తున్నాడు.దేవూడెదురైనా పొగురుమోతుతనంతో విర్రవీగే వాడు,నేడు వినయసంపన్నుడైనాడు.ఇతరులు పచ్చగా వుంటే చూచి కళ్ళలో నిప్పులు పోసూకొనేవాడు, విష్ణుప్రసాదమహిమతో సర్వసముడైనాడు.
ఇంతలొ ఎంతమార్పు!భగవంతూడు తల్చుకొంటే అదేమంత పెద్దసుద్ది.పాశములలో కెల్లా పెద్దపాశము లోభిత్వము.అలా లోభత్వమునకు మూలమైన పెద్దపెద్ద కాగుల్లో మూలుగుతున్న బంగారమునంతా ధనార్థులకిస్తున్నాడు.నూతనాలయ నిర్మాణమునకై తనవద్దనున్న ధనమును వినియోగిస్తున్నాడు.ఇలా భగవదనుగ్రహముతో తనజన్మను ధన్యం చేసుకొన్నాడు.
ఇలా ఆ ఆలుమగలు మోక్షసామ్రాజ్యమునకు దగ్గరదారియైన పండరీపురమున నివసిస్తూ అనేక వ్రతాలను ఆచరించారు.ఈ పుణ్య దంపతులకు యైదుగురు కుమారులు జన్మించారు.వారు గతజన్మలలో కాకి,హింస,చిలుక,పాము,తేనెటీగలు గా వుండి పాండురంగ విభుని దయవలన మనసుశీలమ్మకు పుత్రులుగా జన్మించారు.ఆ విశేషాలేమిటో తరువాత తెలుసుకొందాం!
ఇంతహృద్యమైన కథను మనకందజేసిన తెనాలి రామకృష్ణడు నిజంగా" అగ్రశాఖికా కోకిలమే".అతనికి మనమందరం మనస్పూర్తిగా నమస్కృతులు సమర్పీద్దాం!
చివరకు ఒక మాట నిగమశర్మోపాఖ్యానంలో నిగమశర్మ అక్కకు పేరు లేదు.ఆమె నిగమశర్మ అక్కగానె జగత్ఫ్రసిధ్ధి పొందింది.అలానే మన సుశీలమ్మ కథలో సుశీలమ్మమగనికి పేరు లేదు.పేరు లేకుండానే మనకథానాయకుడు పెద్దపెద్ద పనులే చేశాడు.కాదుకాదు పాండురంగవిభుడు తెనాలి రామకృష్ణుని ద్వారా చేయించి తెలుగువారికి చ్చాడు.
ఇదయ్య మన సుశీలమ్మ కథ ఆమె మగనికథ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి